iDreamPost
android-app
ios-app

ఒకే తేదీని టార్గెట్ చేసుకున్న 4 సినిమాలు

  • Published Jan 24, 2021 | 6:08 AM Updated Updated Jan 24, 2021 | 6:08 AM
ఒకే తేదీని టార్గెట్ చేసుకున్న 4 సినిమాలు

థియేటర్లు తెరుచుకున్నాక జనం వస్తారో రారో అనే అనుమానాలను సంక్రాంతి పూర్తిగా బద్దలు కొట్టింది. కోట్ల రూపాయల వసూళ్లను బాక్సాఫీస్ సాక్షిగా తీసుకొచ్చింది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అని ఛాలెంజ్ చేసే రీతిలో సగం సీట్లతోనే బయ్యర్ల జేబులు నింపారు ప్రేక్షకులు. అందుకే కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటించేందుకు నిర్మాతలు పరుగులు పెడుతున్నారు. ఒకవేళ సేమ్ డేట్ కి క్లాష్ ఉన్నా సరే భయపడకుండా పోటీకి సిద్ధపడుతున్నారు. మార్చ్ నుంచి భారీ చిత్రాలు క్యూలో ఉండటంతో మీడియం రేంజ్ అండ్ లో బడ్జెట్ మూవీస్ అన్నీ ఫిబ్రవరిని టార్గెట్ చేసుకుంటున్నాయి. అప్పుడైతే రిస్క్ తక్కువగా ఉంటుందనే ఉద్దేశం.

ప్రత్యేకంగా ఫిబ్రవరి 12న ఏకంగా నాలుగు సినిమాలు కర్చీఫ్ వేశాయి. అందులో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తున్న ‘ఉప్పెన’ మొదటిది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ త్వరలో ట్రైలర్ తో పాటు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో పాటు ప్రమోషన్ లో వాడిన మెటీరియల్ దీని మీద అంచనాలు పెంచేస్తోంది. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన బుచ్చిబాబు డెబ్యూతోనే మంచి బజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆది సాయికుమార్ నటించిన ‘శశి’ కూడా అదే డేట్ కి రెడీ అయ్యింది. ఇప్పటికే ఆడియో పరంగా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

చాలా కాలంగా రిలీజ్ కోసం వెయిటింగ్ లో ఉన్న విశాల్ ‘చక్ర’ కూడా 12కే ఫిక్స్ అయినట్టుగా చెన్నై మీడియా టాక్. ఇప్పటికే దీని తాలూకు పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో జీ సంస్థ ద్వారా ఓటిటి రిలీజ్ అన్నారు కానీ ఏవో ఆర్థిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఇక్కడికి లాక్ అయ్యింది. జగపతిబాబు ఓ విభిన్న పాత్రలో నటిస్తున్న ‘ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ (FCUK)’ కూడా అదే రోజునే రాబోతోంది. టీజర్ చూశాక ఇదేదో వెరైటీ కాన్సెప్ట్ అనే అభిప్రాయమైతే జనంలో కలిగింది. మొత్తానికి 12న గట్టి పోటీ కనిపిస్తోంది కానీ వీటికి వచ్చే టాక్ కలెక్షన్స్ లో చాలా కీలక పాత్ర పోషించబోతోంది.