నిన్న ఏకంగా నాలుగు కొత్త తెలుగు సినిమాలు, ఒక ఇంగ్లీష్ మూవీ(టామ్ అండ్ జెర్రీ)తో బాక్సాఫీస్ కళకళలాడింది. ఏదీ స్టార్ హీరోది లేకపోయినా అన్నీ అంతో ఇంతో క్రేజ్ ఉన్న నటులవి కావడంతో ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ట్రేడ్ ఆశించినంత ఊపు అయితే టికెట్ కౌంటర్ల దగ్గర కనిపించలేదు. ముఖ్యంగా బిసి సెంటర్లలో పెద్దగా సందడి లేదు. వీటి పబ్లిసిటీ లోపం కొంత కారణం కాగా మాస్ ఆడియన్స్ కోరుకునే హీరోలెవరూ బరిలో లేకపోవడం కూడా ప్రభావం చూపించింది. ఇప్పుడీ వీకెండ్ రెండు రోజులు వీటికి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఫైనల్ వసూళ్లలో అధిక శాతం ఇక్కడే రాబట్టుకోవాలి.
ఇక ట్రేడ్ నుంచి అనధికారికంగా అందిన సమాచారం మేరకు కలెక్షన్ల సంగతి చూద్దాం. టాక్ అండ్ రివ్యూస్ పరంగా నాంది ఫస్ట్ ర్యాంక్ కొట్టేయగా ఆశ్చర్యంగా వసూళ్ల లెక్కల్లో మాత్రం విశాల్ చక్ర మొదటి స్థానాన్ని అందుకుంది. ఎవరూ పట్టించుకోరు అనుకున్న పొగరు థర్డ్ ప్లేస్ లో, ఇంకో హిట్ దక్కుతుందేమో అని ఆశ పడ్డ అభిమానులను నిరాశ పరుస్తూ సుమంత్ కపటధారి చివరిగా నిలిచింది. చక్ర రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారుగా 1 కోటి 8 లక్షల దాకా షేర్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 2 కోట్లు అవుతుంది. నాంది కేవలం 49 లక్షల షేర్ రాబట్టుకోగా గ్రాస్ అటుఇటుగా 80 లక్షల దాకా వచ్చింది. నిన్న సాయంత్రం నుంచి ఆక్యుపెన్సీలో పెరుగుదల కనిపిస్తోంది ఈరోజు రేపు చాలా కీలకం.
ఇక కన్నడ డబ్బింగ్ పొగరు ఏదో మాస్ జనం పుణ్యమాని 76 లక్షల దాకా షేర్ రాబట్టడం విశేషం. గ్రాస్ 1 కోటి 35 లక్షల దాకా అవుతుంది. పరిచయం లేని ధృవ సర్జ ఇమేజ్ కి ఇది చాలా పెద్ద మొత్తం. కానీ టాక్ నెగటివ్ గా ఉండటం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. కపటధారి మరీ అన్యాయంగా కేవలం 49 లక్షల షేర్ మాత్రమే తెచ్చుకున్నట్టుగా తెలిసింది. గ్రాస్ అయితే 72 లక్షల దాకా తేలింది. ఇది దారుణమైన ఫిగర్. సుమంత్ మార్కెట్ ఎంత కిందిస్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ డే అన్ని సినిమాలు మిశ్రమ ఫలితాలు అందుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారానికి ఇంకొంచెం క్లారిటీతో స్టేటస్ ని డిసైడ్ చేయొచ్చు