iDreamPost
android-app
ios-app

బద్వేల్ చరిత్రలో మూడో ఉప ఎన్నిక

  • Published Oct 01, 2021 | 5:55 AM Updated Updated Mar 11, 2022 | 10:41 PM
బద్వేల్  చరిత్రలో మూడో ఉప ఎన్నిక

సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఉప ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడం, నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో ఉప సమరం మొదలైంది. ఇక్కడి సిట్టింగ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య మార్చి 28న మరణించడంతో ఈ ఉప ఎన్నిక అవసరం అయ్యింది. బద్వేలు నియోజకవర్గ చరిత్రలో ఇది మూడో ఉప ఎన్నిక కావడం విశేషం.

2019లో రాష్ట్రంలో అత్యద్భుత విజయం సాధించి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అలాగే ఏప్రిల్‌ లో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం విజయాలతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న వైఎస్సార్సీపీ తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గతం కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించింది. కానీ రెండున్నరేళ్లలో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాతిపదికన ఈ ఎన్నిక జరగనుంది. అందుకే విజయం ఏకపక్షమని తెలిసినా.. ఏమాత్రం అలక్ష్యం చేయకుండా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ పార్టీ నేతలను ఆదేశించారు.

Also Read : బద్వేలులో జనసేన బాబు వెంట వెళుతుందా..? బీజేపీతో ఉంటుందా..?

ఇంతవరకు 17 ఎన్నికలు

బద్వేలు నియోజకవర్గానికి తొలిసారి 1952(1951)లో ఎన్నికలు జరిగాయి. అప్పటినుంచి 2019 వరకు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి.1962 ఎన్నికల్లో స్వతంత్రపార్టీ తరుపున గెలిచిన చిదానందం ఒక ఏడాది తిరిగేలోపే చనిపోవటంతో 1963లో తొలిసారి ఇక్కడ ఉప ఎన్నిక అవసరం అయ్యింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నాగిరెడ్డి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన చిదానందం గారి పెద్ద కొడుకు వెంకటరమణయ్యను ఓడించారు.

చిదానందం కొడుకు శివరామకృష్ణయ్య వైైఎస్సార్ కు సన్నిహితుడు. శివరామకృష్ణయ్య 1978లో జనతా తరుపున,1989లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.

నాలుగు దశాబ్దాల తర్వాత 2001లో రెండోసారి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత బిజివేముల వీరారెడ్డి 2000 డిసెంబర్ 25న మృతి చెందారు. దాంతో ఖాళీ అయిన ఈ స్థానానికి 2001లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరారెడ్డి కుమార్తె విజయమ్మ గెలిచారు.

సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఉప ఎన్నిక అవసరం అయ్యింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రస్తుత ఉప ఎన్నిక జరుగుతుండగా దివంగత నేత సతీమణి డాక్టర్ సుధను అధికార పార్టీ తన అభ్యర్థిగా రంగంలోకి దించింది. టీడీపీ గత ఎన్నికల్లో ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ ను మళ్లీ పోటీ చేయిస్తోంది.

Also Read : బద్వేలు ఉప ఎన్నిక – పెద్దిరెడ్డి సారథ్యంలో వైసీపీ టీం ఇదే..

వైఎస్సార్సీపీదే ఆధిపత్యం

నియోజకవర్గ గత చరిత్రను పరిశీలిస్తే మొదట్లో కాంగ్రెస్, తర్వాత టీడీపీలు ఆధిపత్యం వహించాయి. వీరారెడ్డి ఉన్నంత కాలం గెలుపు ,ఓటములకు అతీతంగా నియోజకావర్గంలో ఆయన పట్టు ఉండేది. టీడీపీ సానుభూతిపరులు ఎంపీగా వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఒక ఓటు,ఎమ్మెల్యే కు టీడీపీ వీరారెడ్డికి మరో ఓటు వేసిన సందర్భాలు ఎక్కువ. వీరారెడ్డి మరణం తరువాత 2004 నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు,వైసీపీ రెండుసార్లు గెలిచింది. వీరెరెడ్డి తరువాత డిసి గోవిందరెడ్డి నియోజకవర్గం లో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు . కాంగ్రెస్ తరుపున గోవింద రెడ్డి 2004 లో గెలిచారు. 2009 నియోజనాకవర్గాల పునర్విభజనలో బద్వేల్ ఎస్సి రిజర్వడ్ కావటంతో గోవింద్ రెడ్డికి పోటీచేేేసేే  అవకాశం రాలేదు కానీ ఎమ్మెల్సీ పదవి దక్కింది.

వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత బద్వేలు ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇంతవరకు జరిగిన 17 ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా ఏడుసార్లు, టీడీపీ నాలుగుసార్లు, వైఎస్సార్సీపీ రెండుసార్లు విజయం సాధించాయి. ఇండిపెండెంట్లు మూడుసార్లు, జనతాపార్టీ ఒకసారి గెలిచాయి.

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. 2,04,614 మంది ఓటర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ఓటర్లు ఆ పార్టీనే ఆదరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలిచినా బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జయరాములు 51 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. తర్వాత టీడీపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలోకి జంప్ చేసిన ఆయన 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నోటా కంటే తక్కువ ఓట్లు సాధించి నగుబాటుకు గురయ్యారు.

ఇక టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ కు 32 శాతం ఓట్లు లభించగా వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య 60.89 శాతం ఓట్లు 44 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలతో మంచి ఉత్సాహంతో ఉన్న అధికార పార్టీ ఉప ఎన్నికల్లోనూ అలవోకగా గెలుస్తుందని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు.

Also Read : ప‌వ‌న్ ఇక నుంచే రాజ‌కీయ నాయకుడ‌ట‌.!