iDreamPost
android-app
ios-app

మూడో టెస్టును డ్రా గా ముగించిన టీం ఇండియా

మూడో టెస్టును డ్రా గా ముగించిన టీం ఇండియా

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా టీమ్ ఇండియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ 334 పరుగులు చేసి డ్రాగా ముగించింది. రిషభ్‌ పంత్‌(97; 118 బంతుల్లో 12×4, 3×6) పుజారా(77; 205 బంతుల్లో 12×4) అశ్విన్ (39; 128 బంతుల్లో 7×4)రాణించగా, హనుమ విహారి(23; 161 బంతుల్లో 4×4) ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.

407 పరుగుల భారీ లక్ష్యంతో 98/2తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ ఇండియా ప్రారంభంలోనే కెప్టెన్ రహానే వికెట్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్‌ ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తూ బౌండరీలు సిక్సులతో విరుచుకు పడగా, మరోవైపు పుజారా పూర్తి సంయమనంతో ఆడుతుండడంతో టీమ్ ఇండియాకి గెలుపుపై ఆశలు చిగురించాయి. 80 వ ఓవర్లో లైయన్‌ బౌలింగ్ లో షాట్‌ ఆడబోయి గల్లీ పాయింట్‌లో కమిన్స్‌ చేతికి చిక్కడంతో పంత్‌ పుజారాలు నెలకొల్పిన 148 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 88 వ ఓవర్లో పుజారా హేజిల్‌వుడ్‌ బౌలింగ్ లో బౌల్డ్ కావడంతో ఆస్ట్రేలియాకు గెలుపుపై ఆశలు చిగురించాయి.

కొరకరాని కొయ్యల్లా నిలబడ్డ ఆ ఇద్దరు

ప్రధాన వికెట్లు కోల్పోవడం మిగిలింది టెయిలెండర్లు మాత్రమే కావడంతో భారత్ ఇన్నింగ్స్ కుప్పకూలడం ఖాయం అని అందరూ భావించారు. కానీ ఈ దశలో హనుమ విహారి అశ్విన్ జోడీ కొరకరాని కొయ్యల్లా మారి క్రీజులో పాతుకుపోయారు. దుర్భేద్యమైన డిఫెన్స్ తో ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన ఈ జోడీ నింపాదిగా ఆడుతూ టీం ఇండియాను డ్రా దిశగా నడిపించారు. ముఖ్యంగా హనుమ విహరీ డిఫెన్స్ ను చేధించడం ఆస్ట్రేలియా బౌలర్లకు సాధ్యం కాలేదు. అశ్విన్ అడపాదడపా పరుగులు చేసినా హనుమ విహారి మాత్రం ఓవర్లను కరిగించడానికే ప్రయత్నం చేసాడు. 122 వ ఓవర్లో విహరీ ఇచ్చిన క్యాచ్ ను ఫైన్ జార విడవడం కూడా భారత్ కి కలిసి వచ్చింది. అశ్విన్ పూర్తి స్థాయి బ్యాట్స్మెన్ లా రాణించడం గమనార్హం.. వీరిద్దరి జోడీ 258 బంతుల్లో 62 పరుగులు జోడించారు. వీరిద్దరి పోరాటం వల్ల ఆస్ట్రేలియా టీం ఇండియాల మధ్య మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

నాలుగు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా టీమ్ ఇండియా చెరో విజయం సాధించగా మూడో టెస్టు మాత్రం డ్రా గా ముగిసింది.ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్‌,లైయన్ రెండేసి వికెట్లు సాధించగా కమిన్స్ ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.