iDreamPost
iDreamPost
అదేంటి బాషా వచ్చింది ఒక్కసారే కాదా అప్పుడే 3వ భాగం ఏమిటని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ వేరే ఉంది.సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో మర్చిపోలేని మైల్ స్టోన్ సినిమా బాషా. తమిళ తెలుగులో ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. అండర్ డాగ్ కాన్సెప్ట్ తో హీరోని పరిచయం చేసి మతులు పోయే పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ని సెట్ చేయడం ఒక ఫార్ములాగా మారింది దీంతోనే. అంతకు ముందు ఇదే తరహాలో చాలా వచ్చాయి కానీ ఇప్పటికీ బాషా ఎందరికో స్ఫూర్తి . ఆ మధ్య తమిళనాడులో ఒరిజినల్ ప్రింట్ ని రీమాస్టర్ చేసి డిటిఎస్ సౌండ్ తో రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ దక్కాయి. దర్శకుడు సురేష్ కృష్ణ స్థాయిని అమాంతం పెంచేసిన క్లాసిక్ ఇది.
అయితే కన్నడలో ఆ టైంలో డబ్బింగులు నిషేధం కాబట్టి బాషాని 2001లో స్టార్ హీరో విష్ణువర్ధన్ తో రీమేక్ చేశారు. దాని పేరు కోటిగొబ్బ. అక్కడా సూపర్ హిట్ కొట్టింది. బెంగళూరులో 30 వారాలకు పైగా ఆడి రికార్డులు సెట్ చేసింది. నాగన్న డైరెక్టర్ గా వ్యవహరించారు. దీనికి కొనసాగింపుగా కోటిగొబ్బ 2 పేరుతో ఈగ విలన్ కిచ్చ సుదీప్ 2016లో నరసింహ దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో సినిమా చేశారు. ఇదీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సుదీప్ మళ్ళీ కోటిగొబ్బ 3తో ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఇది షూటింగ్ స్టేజిలో ఉంది. సన్నీ లియోన్ ఒక స్పెషల్ సాంగ్ చేయడం ఇప్పటికే అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
కొన్నేళ్ల క్రితం సన్నీ కర్ణాటకలో ఓ న్యూ ఇయర్ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉండగా స్థానిక సాంప్రదాయ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వెనుదిరిగింది. మరి ఇప్పుడు మొదటిసారి తెరమీద అక్కడి ఆడియన్స్ కి కనిపించనుంది. ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి. కోటిగొబ్బ 3కి శివ కార్తిక్ దర్శకుడిగా వ్యహరిస్తున్నారు. అసలు లాంగ్వేజ్ లో బాషా సీక్వెల్ కి ఎంత డిమాండ్ ఉన్నా అది సాధ్యం కాలేదు కానీ శాండల్ వుడ్ లో మాత్రం ఇప్పుడు మూడో భాగం దాకా రావడం విచిత్రమే. ఆ మధ్య కోటిగొబ్బ 2ని తెలుగులో కోటికొక్కడు పేరుతో డబ్ చేస్తే ఇక్కడెవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే తమిళంలో బాగానే రిసీవ్ చేసుకోవడం అసలు ట్విస్ట్. వీటి సంగతి ఎలా ఉన్న మరోసారి బాషా వేషంలో సూపర్ స్టార్ రజినిని చూడాలని అభిమానులు ఎంత బలంగా కోరుకుంటున్నా పాతికేళ్ళుగా ఆ కోరిక అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.