iDreamPost
iDreamPost
విమల్ డ్రింక్.. ఈ పేరు వినగానే చల్లదనం గొంతును పలకరించిన ఫీలింగ్. మొదట సామర్లకోట పరిసర ప్రాంతాల వారికి క్రమంగా తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఈ విమల్ రుచి విస్తరించింది. ఓ కుటీర పరిశ్రమగా పదిమంది కార్మికులతో ప్రారంభమైన దీని ప్రస్థానం మల్టీనేషనల్ కంపెనీ డ్రింక్‌ల పోటీని తట్టుకుంటూ 50 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరింది. స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 1983 ఆగస్టు 23న స్థాపించిన విమల్ కూల్ డ్రింక్స్ తూర్పుగోదావరి జిల్లాలో మంచి పేరు సంపాదించుకొంది. పెద్దాపురం,ప్రత్తిపాడు రోడ్డులో దీన్ని స్థాపించారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు అక్కడ ఉన్న విమల్ బాట్లింగ్ కంపెనీ వద్ద ఆగి కూల్ డ్రింక్స్ తాగవలసిందే అనేంతగా దీని క్రేజ్ పెరిగింది.
వివిధ ఫ్లేవర్స్‌లో..
ఆరంజ్, లెమన్, ఫైనాపిల్, గ్రేప్, సోడా రుచులతో ఈ డ్రింక్‌ను అందిస్తున్నారు. మామిడి కాయ రుచితో క్రేజీ ప్యాకెట్లలో కూడా దీన్ని తయారు చేస్తారు. సంస్థ ప్రారంభించినపుడు 250 ఎం.ఎల్. కూల్‌డ్రింక్ ధర రూ.3 ఉండేది. ప్రస్తుతం రూ.8కి విక్రయిస్తున్నారు. 1986లో రూ.2.50 క్రేజీ ప్యాకెట్‌ను మార్కెట్‌లోకి తెచ్చారు. ప్రస్తుతం ఇది రూ.5కు లభిస్తోంది. చక్కటి రుచితో డ్రింక్‌ను ప్రజలకు చేరువ చేశారు. వేసవికాలంలో డ్రింక్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది.
ఫంక్షన్లు, పెళ్లిళ్లలో విమల్ రుచులు
సామర్లకోట పరిసర ప్రాంతాల్లో జరిగే ఫంక‌్షన్లు, పెళ్లిళ్లలో విమల్ డ్రింక్ ఉండాల్సిందే అనే రీతిలో ఇది పేరు తెచ్చుకుంది. మల్టీ నేషనల్ కంపెనీలు అందించే డ్రింక్‌ల ధర కన్నా తక్కువ ఉండడం, హానికరమైన రసాయనిక వ్యర్థాలు లేకపోవడం వంటి కారణాలతో జనం దీన్ని ఆదరిస్తున్నారు.
కరోనాతో తగ్గిన ఉత్పత్తి
గంటకు సుమారు 96 బాటిల్స్ తయారు అవుతాయి. యూనిట్‌లో సుమారు 25 వేల సీసాలు ఉంటాయి. కరోనా కారణంగా గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ పరిశ్రమ మనుగడపై ప్రభావం చూపింది. మార్కెట్‌లో అమ్మకాలు తగ్గిపోవడంతో ఉత్పత్తిని కూడా తగ్గించారు. కార్మికులను కూడా తగ్గించారు. వినియోగదారులు తీసుకు వెళ్లడానికి వీలుగా రూ.5కే క్రేజీ ప్యాకెట్లు, మామిడి, ద్రాక్ష, ఆరెంజ్ రుచులలో ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. చిన్న చిన్న ఫంక‌్షన్లు జరుగుతున్న సమయంలో క్రేజీ ప్యాకెట్లకు గిరాకీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ 28 శాతం, 12 శాతం సెస్‌తో చిన్న తరహా పరిశ్రమలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. అయితే గత ఏడాది మార్చి నుంచి లాక్‌డౌన్ ప్రారంభం కావడంతో కూల్ డ్రింక్ పరిశ్రమకు ఎదురుదెబ్బ తగిలింది. విమల్ బాట్లింగ్ పరిశ్రమలో అమ్మకాలు 60 శాతం తగ్గిపోయాయి. 50 మంది ఉన్న కార్మికుల సంఖ్యను 25కి తగ్గించారు. సెకండ్ వేవ్‌తో ఈ పరిశ్రమ దెబ్బతింది.
కోవిడ్ సమయంలో కూలింగ్ పదార్థాలు సేవించరాదనే సోషల్ మీడియాలో ప్రచారంతో అమ్మకాలు తగ్గిపోయాయని పరిశ్రమ యజమానులు చెప్పారు. అయితే కోవిడ్ ఛాయల నుంచి జనం క్రమంగా బయట పడుతుండడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ అమ్మకాలు పెరుగుతున్నాయని, వేసవి నాటికి బాగా పుంజుకుంటాయని ఆశిస్తున్నారు. ఏ రాష్ట్రంలో తయారు అయిన డ్రింక్స్‌కు ఆ రాష్ట్రంలో అమ్మేలా ప్రాధాన్యం ఇచ్చి, ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇస్తే ఇటువంటి చిన్నతరహా పరిశ్రమలు నిలదొక్కుకుంటాయని సంస్థ యజమానులు ఆర్వీ సుబ్బరాజు, ఆర్వీ వీరభద్రరావు అంటున్నారు.
Also Read : Adventure Ride – అమెరికా టు హైదరాబాద్ కారులో.. డాక్టర్ దంపతుల థ్రిల్లింగ్ అడ్వెంచర్