నక్సల్స్ లొంగుబాటుకోసం ఛత్తీస్‌గఢ్ పోలీసులు చేపట్టిన మీ ఇంటికి తిరిగి రండి పునరావాస కార్యక్రమం విజయవంతం అయినట్లే కనిపిస్తుంది. తాజాగా దంతెవాడ జిల్లాలో వివిధ మావోయిస్టు గ్రూపులకు చెందిన 32 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నక్సల్ నాయకులు మావోయిస్టు సిద్ధాంతాలు పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుండటంతో విసిగిపోయిన వివిధ మావోయిస్టు గ్రూపు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.
కాగా లొంగిపోయిన నక్సల్స్ మొత్తం గతంలో పోలీసులపై దాడులు చేయడం, మందుపాత్రలు పేల్చడం వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా లొంగిపోయిన నక్సల్స్ వివరాలను గోప్యంగా ఉంచామని ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన నక్సల్స్ కు ప్రభుత్వం ప్రకటించిన రివార్డును అందించామని ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ లొంగుబాటులో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల గత ఏడాది జూన్ నుండి ఇప్పటివరకూ 150 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధాంతాలు లేకుండా హింసకు దాడులకు పాల్పడుతున్న మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన ఏర్పడేలా బ్యానర్లు కట్టి ప్రచారం నిర్వహిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.