iDreamPost
android-app
ios-app

తెలివిగా డేట్ లాక్ చేసుకున్న ప్రదీప్

  • Published Jan 11, 2021 | 6:40 AM Updated Updated Jan 11, 2021 | 6:40 AM
తెలివిగా డేట్ లాక్ చేసుకున్న ప్రదీప్

లాక్ డౌన్ వల్ల విడుదల ఆగిపోయిన సినిమాల్లో యాంకర్ ప్రదీప్ హీరోగా డెబ్యూ చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా ఒకటి. అప్పట్లో ఓటిటి ఆఫర్లు బాగానే వచ్చినప్పటికీ థియేటర్లు తెరుస్తారేమోనన్న నమ్మకంతో వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ బాగా ఆలస్యం కావడంతో ఒకదశలో ఇచ్చేద్దామనుకున్నారు కానీ అప్పటికే రేట్ తగ్గిపోవడంతో ఆగిపోయారనే టాక్ కూడా వచ్చింది. వీటి సంగతి అలా ఉంచితే తాజాగా కొత్త డేట్ తో నేరుగా హాళ్లలోకి రావడానికి సిద్ధమయ్యిందీ సినిమా. జనవరి 29న రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డైరెక్ట్ గా థియేటర్లలోనే చూడండని పబ్లిసిటీ కూడా మొదలుపెట్టింది.

ఇది తెలివైన నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికంతా సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది. అందరూ వాటిని చూసేసి ఉంటారు. వేరే దర్శక నిర్మాతలు ఎవరూ ఫలానా తేదీకి జనవరిలో వస్తున్నామని ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. 50 శాతం ఆక్యుపెన్సీకి భయపడి వెనుకడుగు వేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాంతో ఈ అవకాశాన్ని వాడుకోవాలని 30 రోజుల్లో ప్రేమించడం ఎలా టీమ్ డిసైడ్ అయ్యింది. దీనికి మున్నా దర్శకుడు. ఆ టైంలో ఏ కాంపిటేషన్ లేదు. ఆఖరికి హిందీ మూవీస్ కూడా ఉన్న దాఖలాలు లేవు. రాబోయే రెండు మూడు వారాల్లో ఏమైనా ప్రకటనలు వస్తాయేమో చూడాలి.

దీనికి అంతో ఇంతో బజ్ రావడానికి కారణం నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాట. ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్న ఈ పాటను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరిచిన తీరు ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రదీప్ కు ఎంత ఇమేజ్ ఉన్నది పక్కనబెడితే ఈ సాంగ్ వల్ల వచ్చిన సాఫ్ట్ కార్నర్ తో పాటు టైటిల్ అంతోఇంతో ఓపెనింగ్స్ తెచ్చేలా ఉంది. అయితే ఇదే రేంజ్ కు తగ్గట్టు సినిమా ఉంటేనే వసూళ్లను విజయాన్ని ఆశించవచ్చు. ఎంత సినిమాలు లేకపోయినా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అది కరోనా ముందైనా తర్వాతైనా. ఇందులో మార్పు ఉండదు. మరి ప్రదీప్ ఏ మేరకు అంచనాలు నిలబెట్టుకుంటాడో.