iDreamPost
android-app
ios-app

భద్రతా దళాలకు భారీ దెబ్బ ..మావోలతో ఎన్కౌంటర్లో 30 మంది జవాన్లు మృతి!

  • Published Apr 04, 2021 | 10:26 AM Updated Updated Apr 04, 2021 | 10:26 AM
భద్రతా దళాలకు భారీ దెబ్బ ..మావోలతో ఎన్కౌంటర్లో 30 మంది జవాన్లు మృతి!

ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలకు గట్టి దెబ్బ తగిలింది. బస్తర్ అడవుల్లో మావోయిస్టులతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 30 మంది వరకు జవాన్లు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఎనిమిదిమంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మిగిలిన వారు గల్లంతయ్యారని.. వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. మరో 31 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో మావోస్తుల వైపు కూడా భారీ ప్రాణనష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక మహిళా మావో మృతదేహాన్ని మాత్రమే బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

అసలేం జరిగింది…

మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న దక్షిణ బస్తర్ అటవీప్రాంతంలోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టు శిబిరం నిర్వహిస్తున్నారని అందిన సమాచారం ఆధారంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ) పార్టీ ఒక వ్యాన్ లో ఆ ప్రాంతానికి బయలుదేరింది. ఈ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు సుమారు 600 మంది జొన్నగూడ గ్రామ సమీపంలో మాటువేసి భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వ్యాన్ పై దాడి చేశారు. ఐఈడీలు, రాకెట్ లాంచర్లు, ఏకే 47 రైఫిళ్లతో మావోలు దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకొని చుట్టుపక్కల కూంబింగ్ నిర్వహిస్తున్న కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ దళాలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో శనివారం మధ్యాహ్నం 12 నుంచి సుమారు మూడు గంటలసేపు ఇరుపక్షాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతాదళ అధికారులు శనివారం రాత్రి చెప్పారు. 31 మంది జవాన్లు గాయపడ్డారని, 25 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. కాగా గల్లంతైన వారిలో 22 మంది వరకు మృతి చెందారని తెలుస్తోంది.

2 కి.మీ. పరిధిలో చెల్లాచెదురుగా మృతదేహాలు

గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం ఆదివారం ఉదయం ముమ్మర గాలింపు ప్రారంభించారు. సుమారు రెండువేల మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతానికి రెండు మిలోమీటర్ల పరిధిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పది ఉన్నట్లు గాలింపు బృందాలు గుర్తించాయి. ఇప్పటివరకు ఎనిమిది మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సంఖ్య 30 వరకు ఉంటుందని అంటున్నారు. మావోయిస్తుల్లో కూడా 15 మంది వరకు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక మహిళా మావోయిస్టు మృతదేహం మాత్రమే లభించింది.

తాడిమెట్ల ఘటనను తలపిస్తూ..

మావోయిస్టుల ఏరివేతలో ఇదే బస్తర్ అడవుల్లో 2010లో టాడిమెట్ల, 2020లో మినోపా ప్రాంతాల్లో భారీ ఎదురు దెబ్బలు తిన్నాయి. తాజా ఎదురుకాల్పులు వాటిని తలపిస్తున్నాయని భద్రతా దళాల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మావోయిస్టు పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ హిద్మ నేతృత్వంలో ఆనాటి దాడులు జరిగాయి. తాజా ఘటనలోనూ ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. హోంమంత్రి షా ఛత్తీస్ గఢ్ సీఎంతోను, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ తోనూ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆదేశాల మేరకు సీఆర్పీఎఫ్ డీజీ ఉదయం రాయ్ పూర్ చేరుకొని అక్కడి నుంచి బీజాపూర్ వెళ్ళారు. ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పూర్తి వివరాలు అందాల్సి ఉందని రాష్ట్ర నక్సల్స్ ఆపరేషన్స్ విభాగం డీజీ అశోక్ జునెజా వెల్లడించారు.