iDreamPost
android-app
ios-app

77 రోజుల్లో 3 థియేట్రికల్ రిలీజులు

  • Published Feb 21, 2021 | 6:55 AM Updated Updated Feb 21, 2021 | 6:55 AM
77 రోజుల్లో 3 థియేట్రికల్ రిలీజులు

ఆ మధ్య శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ అయినప్పుడు హీరో నితిన్ ఎంత గ్యాప్ తీసుకున్నాడో చూశాం. 2019ని అసలు ఒక్క సినిమా లేకుండా ఖాళీగా వదిలేశాడు. అంతకు ముందు అందుకున్న ఫ్లాపుల ప్రభావం కూడా దీని మీద ఉంది లెండి. లాక్ డౌన్ కు ముందు భీష్మ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాక మళ్ళీ ఇతనిలో మునుపటి ఉత్సాహం వచ్చేసింది. వరసబెట్టి సినిమాలు ఓకే చేయడం, షూటింగులు చకచకా పూర్తి చేయడం మొదలుపెట్టాడు. ఏడాదికి ఒక చిత్రాన్ని విడుదల చేయడమే మహా గగనంగా మారిన తరుణంలో నితిన్ లాంటి మార్కెట్ ఉన్న హీరో చాలా తక్కువ సమయంలో ఏకంగా మూడు సినిమాలతో ముందుకు రావడం పెద్ద విశేషమే.

కేవలం 77 రోజుల వ్యవధిలో నితిన్ మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముందుగా ఫిబ్రవరి 26న రాబోతున్న చెక్ మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. టిపికల్ స్క్రీన్ ప్లేతో మెప్పిస్తారనే పేరున్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకులు కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్లు నటించడం మాస్ కోణంలో ప్లస్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ హైప్ ని తెచ్చింది. ఇక రెండోది మార్చి 26న కేవలం నెల రోజుల గ్యాప్ లో వస్తున్న రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్ గా వరుణ్ తేజ్ తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద చాలా క్రేజ్ ఉంది.

సుమారు భీష్మతో జరిగినంత బిజినెస్ దీనికీ జరగొచ్చనే అంచనాలో ట్రేడ్ ఉంది. కాంబినేషన్ కలర్ ఫుల్ గా ఉండటంతో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆపై జూన్ 11న హిందీ బ్లాక్ బస్టర్ అందాదున్ రీమేక్ థియేటర్లలోకి వచ్చేస్తుంది. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నభ నటేష్ హీరోయిన్ కాగా మొదటిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని తమన్నా చేస్తోంది. నితిన్ ఇందులో కళ్ళు లేని వాడిగా చాలా డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. మంచి మార్కెట్ ఉన్న నితిన్ లాంటి హీరో ఇంత తక్కువ నిడివిలో మూడు సినిమాలతో రాబోతుండటం రికార్డే.