ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహారంలో క్లారిటీ వచ్చింది. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారినే కొత్త సీఎస్ అంటూ సాగిన ఊహాగానాలకు తెరపడింది. అయితే సీనియర్ అధికారి సమీర్ శర్మ కూడా సర్వీస్ పొడిగింపు కారణంగా వచ్చే నవంబర్ వరకూ మాత్రమే అధికారి హోదాలో ఉంటారు. ఆయనతో పాటు మరికొంతమంది పేర్లు జోడించి కథనాలు వచ్చినా కేంద్రం తాజా ఆదేశాలతో అవన్నీ చెల్లవని తేలిపోయింది. జగన్ కోరిక మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వుల ప్రకారం సీఎస్ ఆదిత్యానాద్ దాస్ పదవీకాలం మరో మూడు నెలల పాటు పొడిగించడం విశేషం.
ఆదిత్యానాథ్ దాస్ ఈనెలాఖరుతో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయనకు ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగింపు కావాలంటూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో కేంద్రం హోం శాఖకు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందన జాప్యం కావడంతో పలు రకాల చర్చలు ముందుకొచ్చాయి. కానీ చివరకు హోం శాఖ నుంచి ఆదేశాలు రావడంతో సెప్టెంబర్ 30 వరకూ ఆదిత్యానాథ్ దాస్ కి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మూడు నెలల పాటు పొడిగింపు దక్కినప్పటికీ మరో సారి ఈ పొడిగింపును ఏపీ ప్రభుత్వం కోరితే కేంద్రం నుంచి సానుకూలత దక్కే అవకాశం ఉంది.
గతంలో నీలం సాహ్ని విషయంలో కూడా కేంద్రం ఇదే రీతిలో వ్యవహరించింది. అయితే జగన్ ప్రతిపాదనకు కేంద్రం సై అనడంతో ఆసక్తికరంగా మారింది. ఇటీవల బెంగాల్ లో సీఎస్ విషయంలో తొలుత పదవీకాలం పొడిగింపునకు అవకాశం ఇచ్చి, ఆతర్వాత కేంద్ర సర్వీసులకు మార్చడంతో అక్కడ పెద్ద వివాదమే జరిగింది. మోడీ వరదల పర్యటన నేపథ్యంలో జరిగిన పరిణామాలతో అక్కడ సీఎస్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం జగన్ లేఖకు అనుకూలంగా స్పందన రావడంతో హస్తినలో సీఎంకి అనుకూలత ఉందనే అంశం రుజువయ్యిందని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా ఇటీవల కొందరు జగన్ పై భిన్న ప్రచారం చేసినప్పటికీ వాటికి చెల్లుబాటు లేదని స్పష్టమయినట్టు కనిపిస్తోంది.
Also Read : సీఎం వైఖరి మారిందా..?