ఏపీ మహిళా కమిషన్ సభ్యులుగా ముగ్గురు నియమితులు అయ్యారు. విశాఖకు చెందిన గెడ్డం ఉమా, తణుకు పట్టణానికి చెందిన బూసి వినీతా, గుంతకల్ కు చెందిన డాక్టర్ షేక్ రఖియా బేగంను కూడా నియమిస్తున్నట్టు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పదవిలో నియమితులు అయిన ముగ్గురు ఐదేళ్లపాటు ఉంటారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇక ఉమా ముందు నుంచి వైసీపీ విద్యార్థి విభాగంలో యాక్టివ్ గా ఉంటూ ఆమె అనేక కార్యక్రమాల్లో భాగం అయ్యారు. వైసీపీ మహిళా నాయకురాలిగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
నిజానికి ఆమెకు ముందు సింహాచలం ఆలయ పాలక మండలి సభ్యురాలి పదవి ఇచ్చారు. కానీ కొద్ది రోజులకే ఆలయ పాలకమండలి సభ్యుల జాబితా నుంచి గెడ్డం ఉమ పేరును ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఏదైనా ఆలయ పాలకమండలి సభ్యుల వయసు కనీసం 30 ఏళ్లు ఉండాలి అనే నిబంధన ఉంది. ఉమ వయసు అప్పటికి 26 ఏళ్లు మాత్రమే కావడంతో ఆమె అనర్హురాలు కావడంతో, ఆమె నియామకాన్ని ఉపసంహరిస్తూ ఆదేశాలిచ్చారు. తణుకు పట్టణానికి చెందిన బూసి వినీత కూడా వైసీపీ మహిళా నేతగా ఉండి అనేక మహిళా సాధికారిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమెను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించారు.
అలాగే గుంతకల్ కు చెందిన డాక్టర్ షేక్ రఖియా బేగంను కూడా మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించారు. గతంలోనే ఇద్దరు మహిళా కమిషన్ సభ్యులను నియమించారు. కె. జయశ్రీ, గజ్జల జయలక్ష్మిలతో పాటు కొత్తగా మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించినట్టు అయింది. మహిళలకు సంబంధించిన అన్ని విషయాలను చూడాల్సిన బాధ్యత మహిళా కమిషన్ పై ఉంది. మహిళా, శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా పనిచేయనున్న ఈ కమిషన్ మహిళా సమస్యలపై తమ గొంతు వినిపించవచ్చు, అలాగే మహిళలు ఎలాంటి బాధలో ఉన్నా వారికి అండగా నిలవచ్చు.
Also Read : కాపు ఉద్యమం.. జగన్, చంద్రబాబు ఎవరు ఎలా వ్యవహరించారు..?