iDreamPost
iDreamPost
వచ్చే 2021 సంక్రాంతికి ఏ చిత్రాలు పోటీ ఉంటాయన్న విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. గత నెల దీపావళి సందర్భంగానే చాలా సినిమాలు ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఏ నిర్మాత ఫలానా డేట్ కి వస్తామని ఖచ్చితంగా చెప్పలేదు. మెల్లగా దీనికి సంబంధించిన సందేహాలు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. భారీ అంచనాలతో నిర్మాణ దశ నుంచే విపరీతమైన అంచనాలు మోస్తున్న విజయ్ ‘మాస్టర్’ని పొంగల్ రేస్ కి లాక్ చేశారట. రేపో ఎల్లుండో అధికారిక ప్రకటన చేయబోతున్నారు. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు సైతం తొంభై శాతం దీన్నే వేసుకోవడానికి ఫిక్స్ కావడంతో యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నా వసూళ్లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి.
రవితేజ ‘క్రాక్’ కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకు వస్తుంది. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే రాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ మీద హైప్ మాములుగా లేదు. మాస్ మహారాజా వరస డిజాస్టర్ల ప్రభావం క్రాక్ బిజినెస్ మీద పడలేదు. పోటీ పెద్దగా లేకపోతే పండక్కు కోట్ల రూపాయలు రాబట్టుకోవచ్చు. ఇది కాకుండా రానా ‘అరణ్య’ కూడా ఫిక్స్ అయిపోయింది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి వాయిదా సమస్యే లేదు. ఎటు తిరిగి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రెడ్, ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తదితరాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
సోలో బ్రతుకే సో బెటరూ మీదే అందరి కళ్ళు ఉన్నాయి. దానికి కలెక్షన్లు ఎలా వస్తాయనే దాన్ని బట్టి పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. యాభై శాతం సీట్లతోనే రిస్క్ చేసేందుకు సాయి తేజ్ టీమ్ రెడీ అయిపోయింది. కనీసం జనవరి మూడో వారం దాకా కలెక్షన్లు స్టడీగా ఉంటాయని అంచనా. అదే జరిగితే అంతకన్నా శుభపరిణామం ఉండదు. మొత్తానికి టాలీవుడ్ కు వచ్చే రెండు నెలలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. నిర్మాణంలో ఉన్న సినిమాలు యూనిట్లు కూడా అన్నింటిని విశ్లేషించే పనిలో ఉన్నాయి. సో మూవీ లవర్స్ ఇకపై పర్సులు సిద్ధం చేసుకునే తరుణం వచ్చేసింది.