iDreamPost
iDreamPost
కరోనా వచ్చింది. తగ్గింది. జనం ఎప్పటిలాగే తిరగడం తమతమ పనులు చేసుకోవడం మళ్ళీ మొదలయ్యింది. ఇప్పుడు బ్రతికున్న ఏ తరం ఎప్పుడూ చూడని విధంగా నెలల తరబడి ఇంట్లోనే ఉండాల్సిన విచిత్రమైన పరిస్థితి మెల్లగా సెలవు తీసుకుంటోంది. డిసెంబర్ లో సెకండ్ వేవ్ గురించి, వ్యాక్సిన్ ఆలస్యం కావడం గురించి ఎన్ని వార్తలు వస్తున్నా ఇకపై పబ్లిక్ దేన్నీ పట్టించుకునే స్థితిలో లేరు. ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు .ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. అయినా కూడా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన తప్పనిసరి.
ఇప్పటిదాకా లెక్కవేసుకుంటే మొన్న 18వ తేదీకే థియేటర్లు మూతబడి 250 రోజులు అయ్యింది. చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. వైజాగ్, విజయవాడలో కొన్ని మల్టీప్లెక్సులు తెరిచినా మొత్తం కౌంట్ లో చూసుకుంటే అవి అయిదు శాతం కూడా కాదు. సింగల్ స్క్రీన్ ఓనర్లు విద్యుత్ బిల్లుల మాఫీ గురించి డిమాండ్ చేస్తున్నప్పటికీ దానికి సంబంధించి సానుకూల సంకేతాలు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాళ్లు తెరిచాక జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ మొదలయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ మూవీ లవర్స్ ఎదురుచూపులు మాములుగా లేవు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు వీలైనంత త్వరగా కొత్త సినిమాలు రావాల్సిన అవసరం చాలా ఉంది. పాత సినిమాలతో ఫలితాలు అంతంత మాత్రమేనని అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా ట్రెండ్ చూసుకుంటే గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్స్ తో పెద్దగా కలెక్షన్లు రావడం లేదు. హృతిక్ రోషన్ వార్ వేస్తే గుజరాత్ లోని మల్టీ ప్లెక్స్ లో ఒక రోజు మొత్తం వచ్చిన వసూళ్లు కేవలం 8 వేల రూపాయలు. అది కూడా వీకెండ్ లో. ఇలా అయితే లక్షల ఖర్చుతో మైంటెసెన్స్ చేసే ఇలాంటి వాటికి నిర్వహణ భారం ఇంకా పెరగబోతోంది. అందుకే సోలో బ్రతుకే సో బెటరూ ఎలాగూ డిసెంబర్ లో రావాలని డిసైడ్ అయ్యింది కాబట్టి వీలైనంత త్వరగా డేట్ లాక్ చేస్తే బెటర్.