iDreamPost
iDreamPost
ఇంకొద్ది రోజుల్లో కరోనా నామ సంవత్సరంగా ఎన్నో కోట్లాది ప్రజలకు పీడకలగా మిగిలిపోయిన 2020 సంవత్సరం సెలవు తీసుకోబోతోంది. ఎప్పుడెప్పుడు ఈ వారం రోజులు అయిపోతాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమా పరిశ్రమ దీని వల్ల ఎన్ని వందల కోట్ల నష్టాన్ని చవిచూసిందో లెక్క బెట్టడం కష్టం. షూటింగ్ స్పాట్ లో పని చేసే సభ్యులతో మొదలుకుని థియేటర్లలో పని చేసే సిబ్బంది వరకు అందరూ బాధితులే. నిర్మాతలు, దర్శకులు, హీరోలు అందరూ కాళ్లకు తాళ్లు కట్టుకుని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తొమ్మిది నెలలు కరిగిపోయినప్పటికీ మూడు నెలలు యాక్టివ్ గా ఉన్న టాలీవుడ్ లో బెస్ట్ గా నిలిచిన మ్యూజికల్ మెమోరీస్ చూద్దాం.
అల అగ్ర సింహాసనం మీద
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్స్ శ్రీనివాస్ కాంబోలో తమన్ స్వరపరిచిన ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఆల వైకుంఠపురములో. గత కొన్ని సంవత్సరాలలో ఈ స్థాయిలో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయిన మూవీ మరొకటి లేదనేది అతిశయోక్తి కాదు. రాములో రాములా, సామజవరగమనా పాటలు ఊరువాడా మ్రోగిపోయాయి. బుట్ట బొమ్మా సాంగ్ ఏకంగా విదేశీయులతో కూడా స్టెప్పులు వేయించింది. మొత్తం అన్ని పాటలకు కలిపి అన్ని ప్లాట్ ఫార్మ్స్ మీద ఎన్ని వ్యూస్ వచ్చాయో లెక్కబెడితే రికార్డుల ఊచకోత కనిపించింది. ఎవరికీ సాధ్యం కానీ రికార్డులు అందుకుంది.
ఆన్ లైన్ లో సంగీత ఉప్పెన
ఇంకా సినిమా విడుదల కాలేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్ మ్యుజిక్ మాయ చేసేసింది. నీ కన్ను నీలి సముద్రంని జనం నెలల తరబడి వింటూనే ఉన్నారు. మ్యూజిక్ లవర్స్ కంటిన్యూ లూప్ లో పెట్టుకుని ఎంత మైమరిచిపోయారో. దానికి సాక్ష్యంగా యుట్యూబ్ వ్యూస్ ని చూసుకోవచ్చు. తర్వాత వచ్చిన మరో రెండు పాటలు అదే స్థాయిలో కాకపోయినా ఉప్పెన స్థాయికి మించిన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే దేవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సరిలేరు నీకెవ్వరు మాత్రం ఈ స్థాయి జ్యుక్ బాక్స్ గా నిలవలేదు.
మురిసిపోయిన నీలి ఆకాశం
స్టార్ హీరో లేడు. హీరోయిన్ ఎవరికీ తెలియని అమ్మాయి. కొత్త దర్శకుడు. అయినా కూడా గొప్ప ట్యూన్ ఈ పరిమితులను దాటేసింది. అనూప్ రూబెన్స్ సూపర్బ్ ట్యూన్ కి చంద్రబోస్ రాసిన నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాట హద్దులు లేకుండా సాగిపోయి వన్ అఫ్ ది బెస్ట్ సాంగ్ అఫ్ 2020గా నిలిచింది. యాంకర్ ప్రదీప్ ఇమేజ్ కి మించిన గొప్ప ఫీట్ ఇది. కేవలం ఈ ఒక్క పాట వల్లే దీని మీద అంచనాలు పెరిగాయన్నది నిజం.
పిచ్చగా ఎక్కేసిన నక్కిలీసు
పలాస సినిమా రిలీజైనప్పుడు అందులో ఇంత గొప్ప పాట ఉందని గుర్తించినవాళ్లు తక్కువే. ఉత్తరాంధ్రలో ప్రాచుర్యంలో ఉన్న ఓ జానపద గీతానికి తనదైన శైలిలో రఘు కుంచె సమకూర్చిన సంగీతం దీన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. సోషల్ మీడియా స్టార్ దుర్గరావు డాన్సు వీడియో వదిలాక మిలియన్ల వ్యూస్ వరదలా వచ్చి పడ్డాయి. లెక్కలేనన్ని రియాలిటీ డాన్స్ షోలలో ఈ నక్కిలీసు గొలుసును వాడుకుని లబ్ది పొందిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు
మరికొన్ని మెరుపులు
భీష్మలో మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన వాటే బ్యూటీ యూత్ కి పిచ్చగా కనెక్ట్ అయ్యింది. జానులో లైఫ్ అఫ్ రామ్ సాంగ్ మెలోడీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సిరివెన్నెల సాహిత్యం దాన్ని ఇంకో మెట్టు పైన నిలబెట్టింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో గుంటూరు వంటల గొప్పదాన్ని వివరిస్తూ సెట్ చేసిన పాటకు కూడా మంచి పేరు వచ్చింది.
విలో వస్తున్నా వచ్చేస్తున్నా, వకీల్ సాబ్ మగువా మగువా, శ్రీకారంలో బలేగుంది బాలా, ఉమామహేశ్వరలో నింగి చుట్టే, డిస్కో రాజాలో నువ్వు నాతో ఏమన్నావో సాంగ్స్ కూడా ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. వీటిలో కొన్ని విడుదల కానీ సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తానికి 2020 ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చినప్పటికీ టాలీవుడ్ కు మ్యూజిక్ పరంగా పరిమిత సంఖ్యలోనే అయినా మంచి జ్ఞాపకాలను మిగిల్చింది.