iDreamPost
android-app
ios-app

2020 : రివ్వున ఎగిసిన ఓటిటి

  • Published Dec 29, 2020 | 5:20 AM Updated Updated Dec 29, 2020 | 5:20 AM
2020 : రివ్వున ఎగిసిన ఓటిటి

సంక్షోభం ఏదైనా ఒకరికి శాపంగా మారితే ఏదో రూపంలో ఇంకొకరికి వరంగా మారుతుంది. 2020 సంవత్సరం మానవాళికి మర్చిపోలేని పీడకలగా నిలిచిపోవడం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా సినిమా రంగం దీని వల్ల ఎంత నష్టపోయిందో లెక్క వేయడం కూడా కష్టమే. కానీ ఈ మహమ్మారే ఓటిటికి ఊహించని వరంగా మిగిలి దాన్ని ఒకేసారి వందలాది మెట్లు పైకెక్కించేసింది. ఈ ఏడాది మార్చి ముందు వరకు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ మీద అవగాహన, వాటిని క్రమం తప్పకుండా వాడే ప్రేక్షకులు ఇండియాలో భారీగా లేరు. ప్రైమ్ లాంటి యాప్స్ కు చందాదారులు ఉన్నప్పటికీ సగటు మనిషి మాత్రం వీటికి దూరంగా ఉంటూనే వచ్చాడు.

ఎప్పుడైతే లాక్ డౌన్ మొదలయ్యి జనం ఇంట్లోనే ఉండటం ప్రారంభమయ్యిందో ఆ క్షణం నుంచే ఓటిటి సంస్థలు తమకు అందివచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు స్ట్రెయిట్ రిలీజుల కోసం ఖర్చు పెట్టి దానికి తగ్గ పేరుని, రిటర్న్స్ ని దక్కించుకున్నాయి. నాని, అనుష్క, కీర్తి సురేష్ లాంటి స్టార్ యాక్టర్ల సినిమాలను డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా ప్రైమ్ కు సబ్స్క్రైబర్స్ ఏ స్థాయిలో పెరిగారో అంచనా వేయడం కష్టమే. రీజనల్ కంటెంట్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని నెట్ ఫ్లిక్స్ సైతం పోటీకి సై అని తెలుగు తమిళ చిత్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏటిటిలు కూడా ఈ మధ్యకాలంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చేశాయి. 

ఇక తొలుత బోల్డ్ కంటెంట్ తో ప్రయాణం మొదలుపెట్టినా తర్వాత పబ్లిక్ పల్స్ అర్థం చేసుకున్న ఆహా యాప్ మెల్లగా రూటు మార్చి మంచి ఫలితాలను అందుకుంది. మలయాళం డబ్బింగ్ లతో పాటు తెలుగు మీడియం బడ్జెట్ సినిమాలను మంచి రేట్ ఇచ్చి కొనుక్కుంది. కలర్ ఫోటో, ఒరేయ్ బుజ్జిగాకు భారీ వ్యూస్ కూడా దక్కాయి. ఇటీవలే సమంతాతో మొదలుపెట్టిన సెలబ్రిటీ టాక్స్ కు సైతం రెస్పాన్స్ బాగుంది. హాట్ స్టార్ మాత్రమే బాలీవుడ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో నేషనల్ మార్కెట్ లో పట్టు సాధించింది. జీ5 కూడా గట్టిగానే యుద్ధం చేస్తోంది. మొత్తానికి తాబేలు నడకలో ఉన్న ఓటిటి రంగాన్ని 2020 ఏకంగా చిరుత స్పీడ్ తో పరుగులు పెట్టించిన మాట వాస్తవం.