iDreamPost
android-app
ios-app

2020 : కాషాయానికి క‌లిసొచ్చింది..!

2020 : కాషాయానికి క‌లిసొచ్చింది..!

2020 ఏడాది దేశ రాజకీయ రంగంలో సంచలన మార్పులకు కేంద్రబిందువైంది. ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదికి పాకేందుకు బాటలు వేసింది. ఆరేళ్లుగా ఓటమి ఎరుగని కారు పార్టీకి కాషాయదళం ముచ్చెమటలు పట్టించింది. తెలుగు రాష్ట్రాల‌లోని తెలంగాణ‌లోనూ పుంజుకుంది. స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేజిక్కించుకన్న టీఆర్‌ఎస్‌కు.. దుబ్బాక దంగల్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ.. విజయం బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి.

గ్రేటర్‌లో వికసించిన కమళం..

ఈ ఏడాది డిసెంబర్‌ తొలివారంలో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ భారీ ఎదురుదెబ్బ తగలగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్‌-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ సాధించకపోవడంతో హంగ్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యంగా ఎవరి ఊహలకు అందని విధంగా బీజేపీ 47 స్థానాల్లో జెండా పాతింది. టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తామే ప్రత్నామ్నాయమని సవాలు విసిరింది. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాతబస్తీపై మరోసారి పతంగి ఎగిరింది. 2016లో గెలిచిన 44 సీట్లను తిరిగి దక్కించుకొని మేయర్‌ పీఠం సాధనలో కీలకంగా మారింది. అసద్‌ వ్యూహరచన.. అక్బర్‌ వాడి వేడి ప్రసంగాలతో మైనార్టీ ఓటు బ్యాంకును తమవైపే నిలుపుకొన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. టీఆర్‌ఎస్, మజ్లిస్, బీజేపీ పోరులో పోటీపడలేక చతికిలపడింది.

భాగ్యనగర్‌లో బీజేపీ విస్తరణ..

ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదిపై కన్నేసింది. హస్తిన నుంచి బయలుదేరి కర్ణాటకలో పాగా వేసిన కమళనాథులు హైదరాబాద్‌పై గురిపెట్టారు. గత పార్లమెంట్‌ ఎన్నికలు నింపిన జోష్‌ను కొనసాగిస్తూ దుబ్బాక మీదుగా హైదరాబాద్‌ గడ్డపై కాలుమోపారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.అంతేకాకుండా కేవలం 15 రోజుల వ్యవధిలోనే జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నిక​ల్లో అధికార టీఆర్‌ఎస్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి.. ఈ ఏడాది అన్నీ అనుకుల పరిణామాలే ఎదురైయ్యాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ బాధ్యతలు చేప్టటిన అనంతరం దూకుడుగా వ్యహరిస్తూ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నారు.