iDreamPost
android-app
ios-app

ఒకే కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు.-అహ్మదాబాద్ బాంబ్ పేలుళ్ల కేసులో తీర్పు

  • Published Feb 18, 2022 | 12:55 PM Updated Updated Mar 11, 2022 | 10:18 PM
ఒకే కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు.-అహ్మదాబాద్ బాంబ్ పేలుళ్ల కేసులో తీర్పు

సుమారు 14 ఏళ్ల క్రితం దేశంలో ప్రకంపనలు సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఏకంగా 38 మందికి మరణశిక్ష విధించింది. మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో శుక్రవారం తుది తీర్పు వెలువడింది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఒకే కేసులో ఇంతమందికి మరణశిక్ష పడటం ఇదే తొలిసారి అని న్యాయరంగానికి చెందిన వారు చెబుతున్నారు. దోషులకు భారీ జరిమానాలు కూడా విధించారు.

70 నిమిషాల్లో 22 చోట్ల పేలుళ్లు

2008 జులై 26న గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన దుండగులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నగరంలోని ఆస్పత్రులు, బస్సులు, పార్కింగ్ స్థలాల్లోని సైకిళ్లు, కార్లలో మొత్తం 24 చోట్ల బాంబులు పెట్టి 70 నిమిషాల వ్యవధిలో పేల్చివేశారు. వరుస పేలుళ్లు, ప్రజల ఆర్తనాదాలు, హాహాకారాలతో అహ్మదాబాద్ నగరం దద్దరిల్లింది. అయితే వీటిలో 22 బాంబులు పేలాయి. మరో రెండు పేలలేదు. కలోల్, నరోదా ప్రాంతాల్లో పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధ్వంసకాండలో మొత్తం 56 మంది మరణించారు. 200 మంది క్షతగాత్రులయ్యారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. నిషేధిత ఉగ్రసంస్థలైన ఇండియన్ ముజాహిదీన్, సిమీ గ్రూపులకు చెందినవారే ఈ పేలుళ్లకు బాధ్యులని పేర్కొన్నారు.

79 మంది నిందితులు.. 1100 మంది సాక్షులు

అతి దారుణమైన పేలుళ్ల ఘటనపై విచారణకు ప్రభుత్వం  ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. పదమూడున్నరేళ్ల సుదీర్ఘ విచారణలో 79 మంది నిందితులపై అభియోగాలు నమోదు కాగా.. 1100 మంది ప్రత్యక్ష సాక్షులను కోర్టు విచారించింది. నిందితుల్లో ఒకడైన ఆయాజ్ సయీద్ 2019లో అప్రూవర్గా మారిపోయాడు. గత ఏడాది సెప్టెంబరులోనే విచారణ పూర్తి కాగా ఈ నెల ఎనిమిదో తేదీన అభియోగాలు ఎదుర్కొంటున్న 77 మందిలో 49 మందిని దోషులుగా ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఏఆర్ పటేల్ ప్రకటించారు. మిగిలిన 28 మందిని నిర్దోషులుగా పేర్కొన్నారు.

దోషులుగా తేలిన 49 మందికి తాజాగా తీర్పులో శిక్షలు ఖరారు చేశారు. ఐపీసీ 302 సెక్షన్ తోపాటు అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం, పేలుడు పదార్థాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించారు. మరణశిక్ష పడిన వారిలో ఒకడైన ఉస్మాన్ అగర్బత్తీవాలకు ఆయుధ చట్టం కింద అదనంగా ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా కూడా విధించారు. అలాగే మొత్తం దోషులందరికీ రూ.2.85 లక్షలు చొప్పున జరిమానాలు విధించారు. ఈ జరిమానా సొమ్మును బాధితులకు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించారు. మృతి చెందిన 56మంది కుటుంబాలకు రూ. లక్ష చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు చొప్పున చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Also Read : ఫ్ర‌స్టేష‌న్ తో ఫ‌లితాలు వ‌స్తాయా?