Idream media
Idream media
2001 ఏప్రిల్ 27 : రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భవించిన రోజు. సరిగ్గా రేపటికి 20 ఏళ్లు అవుతోంది. ఆవిర్భావం నుంచీ.. రాష్ట్ర సాఽధన వరకూ కేసీఆర్ సారథ్యంలో ఆ పార్టీ అలుపెరగని పోరాటం సాగించింది. ఏ ఉద్దేశ్యం కోసం ఏర్పడిందో ఆ కలను కేంద్రంతో కొట్లాడి సాధించుకుంది. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడం ఉద్యమాన్ని మలుపుతిప్పింది. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 13 ఏళ్ల పాటు కొనసాగిన ఉధృత పోరుతో 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది.
20 ఏళ్ల ప్రస్థానంలో..
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కలకలం లేకపోతే టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలను ఆ పార్టీ కేడర్ ఘనంగా నిర్వహించేది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో వేడుకలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా స్వయంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. దీంతో పరిస్థితి పూర్తి కుదుటపడ్డాక పార్టీ ద్విదశాబ్ధి వేడుకలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం భావిస్తోంది. అప్పుటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికసహా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇదిలాఉండగా 20 ఏళ్ల ప్రస్థానంలో టీఆర్‌ఎస్ రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
మొదటి పరీక్ష
2004లో టీఆర్‌ఎస్ మొదటిసారి చట్ట సభల పరీక్షకు సిద్ధపడింది. అప్పుడు కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీకి దిగి, 26 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు గెలిచింది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో టీఆర్‌ఎస్ చేరింది. ఆ తర్వాత తెలంగాణపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలుపుకోలేదనే కారణంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు వైదొలిగారు. అదే సమయంలో కేసీఆర్ 2006లో తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి, కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికకు తెర తీశారు. రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని చూడటం, పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవండంతో కేసీఆర్ 2008లో మళ్లీ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించారు. 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీల రాజీనామాతో నాడు జరిగిన ఉప ఎన్నికలు టీఆర్‌ఎస్‌కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఏడు ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలను మాత్రమే పార్టీ నిలబెట్టుకోగలిగింది.
స్వరాష్ట్రంలో తొలి అధికార పార్టీ
2014 ఏప్రిల్-మేలో ఉమ్మడి ఏపీలో భాగంగానే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఒంటరిగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగి 11 చోట్ల, 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 63 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. అనంతరం అదే సంవత్సరం జూన్ 2న ఏర్పడ్డ నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అధికార పార్టీ విజయాల పరంపర కొనసాగుతూ వస్తోంది. 2018లో సీఎం కేసీఆర్ అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేసి, నిర్ణీత గడువుకు ఆరు నెలలుగా ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. రాష్ట్రంలో వరుసగా రెండవసారి పార్టీని అధికారంలోకి తెచ్చారు.
కాస్త ఆగినా.. మళ్లీ దూకుడుగా..
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్ అంచనాలకు బ్రేకులు పడ్డాయి. 17 లోక్‌సభ స్థానాలకుగాను కేవలం 9 చోట్ల మాత్రమే గెలిచింది. కానీ, ఆ తర్వాత పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మళ్లీ సత్తా చాటింది. అనంతరం దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీట్ల సంఖ్య తగ్గడం పార్టీని ఖంగు తినిపించింది. దీంతో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కా వ్యూహాలతో ఫలితం సాధించారు. తాజాగా మే 2న వెలువడనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, మినీ మునిసిపల్ ఎన్నికల సంగ్రామంలో గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.