2001 సెప్టెంబర్ 11.. అత్యంత భద్రత కలిగిన దేశంగా అత్యున్నత అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాల పెద్దన్నగా పేరు పొందిన అమెరికాని చివురుటాకులా వణికించిన రోజు.. ఆధునిక ప్రపంచ చరిత్రలో అమెరికన్లకు అత్యంత విషాదాన్ని మిగిల్చిన ఈ రోజు ప్రపంచం ఉన్నంత కాలం చరిత్రలో గుర్తు చేసుకునే రోజుగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఆల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ఇదే రోజున అమెరికాలో మారణహోమం సృష్టించాడు. అమెరికన్లకు కలలో తలచుకున్నా ఉలిక్కిపడేలా చేసిన ఈ దుర్దినానికి 19 ఏళ్ళు పూర్తయ్యాయి.
అది 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11… అమెరికన్ ట్విన్ టవర్స్ గా పేరొందిన న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైపు ఒక విమానం వేగంగా దూసుకొచ్చి నార్త్ టవర్ ను బలంగా ఢీకొట్టింది. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు.. అసలు ప్రమాదం ఎలా చోటుచేసుకుందో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. కానీ వెంటనే స్పందించిన అమెరికన్ అధికారులు సహాయక చర్యలు మొదలు పెట్టారు. ప్రమాదానికి గల కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు అధికారులు. ఇంతలో మరో విమానం కూడా సౌత్ టవర్ ని బలంగా ఢీకొనడంతో అమెరికన్లకు అధికారులకు ఉన్నత స్థాయి నాయకులకు అర్థమైంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు అని. అప్పటికి కొంతకాలం క్రితమే అమెరికాపై దాడులు జరిగే అవకాశం ఉందని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కానీ పటిష్టమైన భద్రత కలిగిన అమెరికాపై దాడులకు తెగబడే సాహసం ఎవరూ చేయలేరన్న ధీమాతో ఉన్న అమెరికన్లకు 2001 సెప్టెంబర్ 11 ఓ చేదు జ్ఞాపకం అనే చెప్పాలి.
ఆల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ వ్యూహం మేరకు ఇస్లామిక్ మిలిటెంట్లు నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను హైజాక్ చేసి దారి మళ్లించి ఆ విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తోపాటు, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ముఖ్యంగా న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ పై విమానాలతో ఢీకొట్టినప్పుడు జరిగిన భారీ పేలుడులో అత్యంత దృఢంగా నిర్మించిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం పిల్లర్లు కృగింపోయి నేలమట్టం అయిపోయాయి. భవనంలో ఉన్న వారు మృత్యువాత పడ్డారు. ఆల్‌ఖైదా ఉగ్రవాదులు రెండు విమానాలతో ట్విన్ టవర్స్ ని ఢీకొట్టగా మూడో విమానంతో అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ని ఢీ కొట్టారు. నాలుగో విమానంలో ఉన్న కొందరు ప్రజలు మరియు సిబ్బంది ఉగ్రవాదులకు ఎదురుతిరగడంతో పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదాన ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
కాగా సెప్టెంబర్ 11 దాడులతో అగ్రరాజ్యం కాస్త అతలాకుతలం అయింది. ఈ దాడుల్లో 3000 మందికి పైగా చనిపోగా అనేకమంది గాయాలపాలయ్యారు. దాడులకు పాల్పడిన 19 మంది హైజాకర్లు విమాన ప్రమాదాల్లో చనిపోగా నాలుగు విమానాల్లో ప్రయాణికులందరు దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అనేకమంది అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కూడా పొగలో ఉక్కిరిబిక్కిరి అయ్యి ఊపిరి ఆడక చనిపోయారు. ట్విన్ టవర్స్ కాస్త కుప్పకూలిపోయి గ్రౌండ్ జీరోగా మిగిలిపోయింది.
ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
దాడులకు రూపకర్త అయిన ఒసామా బిన్ లాడెన్ వెతుకులాటలో అమెరికా రక్తపుటేరులు పారించిందనే చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ పై దాడులకు తెగబడింది. ఇరాక్ లో జీవాయుధాలు ఉన్నాయన్న నెపంతో ఇరాక్ పై దండెత్తి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ని ఉరి తీసింది. పాకిస్థాన్ లో అబోటబాద్ లో లాడెన్ ఉన్నాడన్న పక్కా సమాచారంతో అర్ధరాత్రి పూట లాడెన్ నివాసం ఉంటున్న భవంతిపై అమెరికన్ సీల్స్ దాడి చేసి 2010 ఏప్రిల్ 29న లాడెన్ ను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ కు అమెరికా పెట్టిన పేరు ఆపరేషన్ జెరోనిమా ఎకియా.. ఆఖరికి లాడెన్ మృతదేహాన్ని కూడా ప్రపంచ దేశాలకు చూపించే ప్రయత్నం చేయలేదు అమెరికా. అతని మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేసింది. దీంతో లాడెన్ సృష్టించిన నరమేధానికి అమెరికా ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
కాగా ట్విన్ టవర్స్ కూలిన తర్వాత అక్కడి శిథిలాల ఉక్కుతో యూఎస్ఎస్ న్యూయార్క్ అనే షిప్ ని నిర్మించింది అమెరికా. గ్రౌండ్ జీరోలో ఫ్రీడమ్ టవర్స్ ని నిర్మించింది. లాడెన్ నాశనం చేసిన ట్విన్ టవర్స్ ని తిరిగి నిర్మించుకుంది. కాగా ప్రపంచ ఉగ్రవాద చరిత్రను 2001 సెప్టెంబర్ 11 కు ముందు ఆ తరువాత అని రెండుగా విభజించిందంటే ఈ ఘటన ప్రపంచ చరిత్రను ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాను చివురుటాకుల వణికించిన ఆ రోజు నేటికి 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
లాడెన్ రాసిన రక్తాక్షరాలకి 19 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా