iDreamPost
android-app
ios-app

‘ఇడియట్’ ప్రేమలో యువత – Nostalgia

  • Published Aug 22, 2020 | 10:46 AM Updated Updated Aug 22, 2020 | 10:46 AM
‘ఇడియట్’ ప్రేమలో యువత – Nostalgia

సాధారణంగా సినిమా ప్రేమ కథలు ఒక మీటర్ లో సాగుతాయి. ప్రేక్షకులూ వాటికే అలవాటు పడ్డారు. దానికి భిన్నంగా ప్రయత్నం చేస్తే దెబ్బ తింటామేమోనన్న అనుమానం ఎందరో దర్శకులను వెనకడుగు వేసేలా చేసింది. ఎవరో ఒకరు రిస్క్ చేయకపోతే అద్భుతాలు ఎలా జరుగుతాయి. అది తానే ఎందుకు కాకూడదు అనుకున్నాడు పూరి జగన్నాధ్. 2001 సంవత్సరం. పవన్ కళ్యాణ్ బద్రితో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆనందం పూరికి బాచి ఫ్లాప్ రూపంలో ఆవిరైపోయింది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో హిట్టు కొట్టినా తన స్థాయి కన్నా తక్కువే అది. ఏదో తెలియని ఫ్రస్ట్రేషన్.

అందుకే పెద్దగా ఇష్టం లేకపోయినా శాండల్ వుడ్ నుంచి రాజ్ కుమార్ అంతటి బడా కుటుంబం పిలిచి అడిగేసరికి తమ్ముడు రీమేక్ ని ఆయన పెద్దబ్బాయికి తీసిచ్చాడు. ఆ టైంలోనే పూరి మేకింగ్ స్టైల్ నచ్చిన రాజ్ కుమార్ తన మూడో కొడుకు పునీత్ ని లాంచ్ చేసేందుకు బ్రహ్మాండమైన కథ చెప్పమని అడిగాడు. అప్పుడు పుట్టిందే అప్పు. కర్ణాటక బాక్సాఫీస్ తుప్పు రేగ్గొడుతూ అంచనాలకు మించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నిజానికిది రవితేజ కోసం రాసుకున్న కథ. కాకపోతే విధి నిర్ణయం ఇంకోలా ఉంది. అప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి వెనక్కు వచ్చిన ఇడియట్ కథకు రవితేజ అయితేనే పర్ఫెక్ట్ అని భావించిన పూరి ఎక్కువ ఆలస్యం చేయకుండా వైష్ణో అకాడెమి అని స్వంత బ్యానర్ పెట్టేసి నిర్మాణం మొదలుపెట్టాడు. షూటింగ్ చకచకా శరవేగంగా జరిగిపోయింది.

ఇదేం టైటిల్ అని ఇండస్ట్రీలో కొందరు కామెంట్లు చేసినా పూరి పట్టించుకోలేదు. రాక్షసుడు, కిరాతకుడు, దొంగ అని తిట్లను చిరంజీవి సినిమా పేర్లుగా పెట్టినప్పుడు రాని అభ్యంతరం రవితేజకు మాత్రం ఎందుకని ఎవరి మాట వినకుండా ముందుకు వెళ్ళిపోయాడు. చక్రి అద్భుతమైన ట్యూన్లు ఇచ్చాడు. పోలీస్ కమీషనర్ గా ప్రకాష్ రాజ్ విశ్యరూపానికి పూరి అక్కడికక్కడే ఫ్యాన్ అయిపోయాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్, డైలగ్ టైమింగ్ ని చూసి యూనిట్లోని ప్రతి ఒక్కరు షాక్. పదేళ్లుగా ఇంత ఎనర్జీ క్యారెక్టర్ వేషాలు చేస్తూ వృథా అయిపోయిందే అని బాధ పడ్డారు. కసిమీదున్న రవితేజకు కథలో దమ్ము అర్తమైపోయింది. పునీత్ లాంటి కొత్త కుర్రాడే ఆ రేంజ్ లో పండిస్తే ఇంత అనుభవం ఉన్నా తాను ఎలా రెచ్చిపోవాలి. అదే చేశారు. రిస్క్ చేయకుండా ఒరిజినల్ వెర్షన్ హీరోయిన్ రక్షితనే ఇక్కడికి తీసుకొచ్చారు.

కట్ చేస్తే ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇడియట్ గ్రాండ్ రిలీజ్. అప్పటికి నెల కింద రిలీజైన ఇంద్ర రికార్డుల ఊచకోతతో చెలరేగిపోతోంది. ఇడియట్ ఆ ప్రభంజనాన్ని తట్టుకోగలడా అనే అనుమానం ట్రేడ్ లో లేకపోలేదు. అనుమానాలతోనే ఇడియట్ ని థియేటర్లలో ప్రవేశపెట్టారు. దీనికైన బడ్జెట్ కేవలం రెండున్నర కోట్లు. 45 ప్రింట్లు వేశారు. రెండో వారం దాటేలోపే కౌంట్ వంద దాటిపోయింది. కలెక్షన్ ఫిగర్ ఏకబాకడం మొదలయ్యింది. ఏకంగా ఇరవై కోట్ల లెక్క అందరికీ మతులు పోయాయి. రవితేజ లాంటి అప్ కమింగ్ హీరోతో ఈ స్థాయి వసూళ్లు సాధించడం చూసి పూరికి ఫోన్ చేయని అగ్ర హీరో లేడు. తమను ఏ స్థాయిలో చూపిస్తాడోనని ఊహించుకుంటూ కథలు సిద్ధం చేయమని విపరీతంగా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

నేరుగా కలవకపోయినా పర్లేదు ప్రస్తుతానికి బ్లాంక్ చెక్ తీసుకోమని పంపిన నిర్మాతలు ఎందరో. పూరి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇది కదా తాను కోరుకున్న మజిలీ. అన్నం తింటే చాలు అనుకున్నవాడికి బిర్యానీ దొరికినంత ఆనందం యూనిట్ లో ప్రతి ఒక్కరిది. ఓ పోలీస్ కమీషనర్ కూతురిని కానిస్టేబుల్ కొడుకు ప్రేమించడం అనే పాయింట్ తో పూరి చేసిన మేజిక్ కి యూత్ ఫిదా అయిపోయింది. ముఖ్యంగా సంభాషణలు వాటిని రవితేజ పలికిన విధానం రిపీట్ ఆడియన్స్ ని రప్పించడం మొదలుపెట్టాయి. కమీషనర్ కూతుళ్ళకు మొగుళ్ళు రారా, చంటిగాడు లోకల్, లాంటి డైలాగ్స్ ఊతపదాలుగా మారిపోయాయి. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాట ఎక్కడ చూసినా మోత మోగిపోయింది. ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి.

అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న విసిడిల పైరసీ జడలు విప్పుకుని అద్దె షాపుల వాళ్ళ జేబులు నింపుతోంది. రక్షితకు క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. కోట శ్రీనివాసరావు, సంగీత, జీవా ఇలా నటించిన ప్రతిఒక్కరు చాలా సహజంగా పాత్రలకు జీవం పోశారు. అప్పటిదాకా స్ట్రగుల్ అవుతున్న శ్రీనివాసరెడ్డి లాంటి ఆర్టిస్టులను యమా బిజీగా మార్చింది ఇడియట్. యాభై రోజులు చాలు అనుకుంటే ఏకంగా శతదినోత్సవం చేసుకుని చాలా చోట్ల కొత్త రికార్డులు నమోదు చేసింది. ముక్కుసూటిగా పెడసరిగా మాట్లాడే హీరో క్యారెక్టరైజేషన్ ఇడియట్ తోనే మొదలై ఇప్పటిదాకా ఎందరో రచయితలు దర్శకులకు స్ఫూర్తినిస్తోనే ఉంది. యువతను ప్రేమలో పాడేస్తూనే ఉంది. అందుకే 18 ఏళ్ళు దాటినా ఇడియట్ వయసు మాత్రం నిత్యయవ్వనం