iDreamPost
android-app
ios-app

17 మంది నిర్దోషుల ఎన్ కౌంటర్

17 మంది నిర్దోషుల ఎన్ కౌంటర్

వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు – ఈ మాటను భారతీయ న్యాయ వ్యవస్థకు ఆత్మగా చెప్పుకోవచ్చు. మన చట్టాలు కూడా ఇదే సూత్రాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. కానీ భద్రతా సిబ్బంది డ్యూటీ లో చేసిన పొరపాటు వల్ల 17 మంది నిర్దోషులు, దోషులుగా ముద్రపడి ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసి ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఏడేళ్లక్రితం చత్తిస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలోని సర్కేగుడాలో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా 2012 జూన్ 28న, 17 మందిని భద్రతా దళాలు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు. తాజాగా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన వారంతా అమాయక గ్రామ ప్రజలని జ్యుడీషియల్ విచారణలో తేలింది.

ఈ కాల్పుల ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ అప్పటి బీజేపీ ప్రభుత్వం జస్టిస్ వీకే అగర్వాల్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది. ఆ కమీషన్ దర్యాప్తును ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఆ కమీషన్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలను గమనిస్తే 2012 జూన్ 28న గ్రామస్థులు “బీజ్ పందుమ్”పండగ గురించి చర్చించేందుకు సమావేశం అయ్యారు. అయితే గ్రామస్తులు మావోయిస్టులతో సమావేశానికి హాజరయ్యారని సమావేశం రావడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో 17 మంది గ్రామస్తులు చనిపోయారు. అయితే ముందుగా గ్రామస్థులే భద్రతా దళాలపై కాల్పులు జరిపారని అందుకే ఎదురుకాల్పులు జరిపామని భద్రతా సిబ్బంది వెల్లడించారు.

కాగా గ్రామస్థులు ఎలాంటి కాల్పులు జరపలేదని తాజాగా దర్యాప్తులో వెల్లడైంది. భద్రతా దళాల అత్యుత్సాహం వల్లనో కంగారు వల్లనో గ్రామస్తులపై కాల్పులు జరిపారని విచారణలో తెలిసింది. గ్రామస్థులు మావోయిస్టులనడానికి సరిపోయే సాక్ష్యాలు ఏవి లేవని జ్యుడీషియల్ కమీషన్ దర్యాప్తులో వెల్లడించారు. చాలా దగ్గరనుండి గ్రామస్థులను కాల్చినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. చేయని తప్పుకు గ్రామస్థులను కాల్చి చంపారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా వీకే అగర్వాల్ నివేదిక మీడియాకు లీకవడం వివాదస్పదంగా మారింది. ఈ కాల్పుల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.