iDreamPost
iDreamPost
సినిమా ఎంటర్ టైన్మెంట్లో కొత్త సంచలనానికి దారి తీస్తున్న డిస్నీ హాట్ స్టార్ రేపటి నుంచి క్రేజీ బాలీవుడ్ మూవీస్ డైరెక్ట్ రిలీజులకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆఖరి సినిమా దిల్ బేచారాతో ఈ వినోదాల విందుకు శ్రీకారం పడనుంది. దీనికి భారీ స్పందన దక్కడంలో ఆశ్చర్యం లేకపోయినా అందరి దృష్టి మాత్రం అక్షయ్ కుమార్ ‘లక్స్మీ బాంబ్’ మీదే ఉంది. 125 కోట్ల పెట్టుబడితో డిజిటల్ ప్రపంచంలో కనివిని ఎరుగని స్థాయిలో హక్కులు కొనుగోలు చేయడం ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇదే మొదటిసారి. ఇంత మొత్తం ఎలా వెనక్కు వస్తుందనే అనుమానం సామాన్యుల్లో లేకపోలేదు. లారెన్స్ దర్శకత్వంలో కాంచన రీమేక్ గా రూపొందిన దీని మీద నార్త్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
భరత్ అనే నేను, వినయ విధేయ రామలతో పరిచయమున్న కియారా అద్వానీ హీరోయిన్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ దీని మీద ఆసక్తి నెలకొంది. కథ విషయంలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదు కానీ అక్కడ ఎలా తీసుంటారన్న ఇంటరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు దీని ప్రమోషన్స్ కోసం అక్షయ్ ప్రత్యేకమైన ప్లాన్స్ చేస్తున్నారట. ఇందులో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తమిళ్ లో శరత్ కుమార్ చేయగా ఆ ట్రాక్ బ్రహ్మాండంగా పండింది. శరత్ కుమార్ చేసిన హిజ్రా క్యారెక్టర్ ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యింది. హిందీలో దీన్ని శరద్ కేల్కర్ చేస్తున్నాడు. తొలుత సంజయ్ దత్ తో చేయించాలని చాలా ట్రై చేశారు కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ అదే జరిగితే దీని బ్రాండ్ వేల్యూ ఇంకా పెరిగేది.
ఇదంతా కాసేపు పక్కనపెడితే ఇప్పుడీ 125 కోట్ల మొత్తాన్ని హాట్ స్టార్ ఎలా రాబట్టుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది. ఇది జరగాలంటే రికార్డు స్థాయిలో వ్యూస్ రావాలి. అభిమానంతో సంబంధం లేకుండా సగటు ప్రతి మూవీ లవర్ సినిమా చూడాలి. అలా జరగాలనే లక్స్మీ బాంబ్ టీమ్ భారీ ఎత్తున ప్రమోషన్ కు ప్లాన్ చేస్తోంది. వరసగా నెల రోజుల పాటు టీవీ ఛానల్స్, సోషల్ మీడియా, అవుట్ డోర్ పబ్లిసిటీ ఇలా దేన్నీ వదలకుండా ప్రమోట్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. ముందు ఆగస్ట్ 15 రిలీజ్ చేయాలనీ అనుకున్నప్పటికీ ప్రస్తుతం దాన్ని సెప్టెంబర్ కి షిఫ్ట్ చేశారని టాక్. వచ్చే నెల స్ట్రెయిట్ డిజిటల్ రిలీజులు చాలా ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. లక్స్మీ బాంబ్ కు వచ్చే రెస్పాన్స్ ని బట్టి భవిష్యత్తులో ఓటిటి రేట్లు డిసైడ్ అయినా ఆశ్చర్యం లేదు.