2008 నవంబర్ 26,సమయం సాయంత్రం సుమారు 7 గంటలు. దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ తీరానికి సుమారు పది మంది ఉగ్రవాదులు జాలరుల పడవలో ముంబాయికి చేరుకున్నారు. ముంబయిలో నరమేధం సృష్టించి, రక్తపుటేరులు పారించే లక్ష్యంతో ఇద్దరేసి చొప్పున విడిపోయి ముంబయిలో ఐదు వేరు వేరు ప్రాంతాలకు చేరుకున్నారు.మొదట లియోఫోర్డ్ కేఫ్ లో చొరబడ్డ ముష్కరులు, హ్యాండ్ గ్రైనేడ్లతో దాడి చేశారు. అలా మొదలైన రక్తమేధం సుమారు 60 గంటల పాటు అప్రతిహంగా, నిరాటంకంగా సాగిన ఉగ్రదాడులు దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిని చిన్నాభిన్నం చేసాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎక్కడ ఉగ్రదాడి జరుగుతుందో, ఎక్కడ బాంబు పేలుతుందో అని ముంబయి ప్రజలు బిక్కుబిక్కుమంటు ఒక్కో క్షణం గడిపారు.
లియోఫోర్డ్ కేఫ్ దగ్గర నరమేధం ప్రారంభించిన ఉగ్రమూకలు, తరువాత తాజ్ హోటల్ కేఫ్, ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్ హోటల్ ప్యాలెస్, తాజ్ టవర్స్,ట్రైడెంట్ హోటల్,ఒబెరాయ్ హోటల్, కామా హాస్పిటల్,నారిమన్ హౌస్, మెట్రో సినిమా థియేటర్,విల్లెపార్లే, సెయింట్ జేవియర్ జూనియర్ కాలేజ్,మజ్గాన్ డాక్ ల వద్ద మెషిన్ గన్స్ తో కాల్పులు జరుపుతూ, హ్యాండ్ గ్రైనేడ్స్ విసురుతూ రక్తపురులు పారించారు. ఉగ్రమూకలు ప్రయాణం చేస్తున్న దారుల్లో కూడా విధ్వంసం సృష్టిస్తూ ముందుకు సాగిపోయారంటే వారిలో ఉన్న రక్త దాహాన్ని అంచనా వేయడం కష్టం. ఉగ్రవాదులు ప్రయాణించడానికి ఉపయోగించిన మూడు కార్లలో టైమర్లు అమర్చిన బాంబులు పెట్టడం వల్ల, మూడు ప్రాంతాల్లో టాక్సీ బాంబులు పేలాయి. ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర మొదట టాక్సీ బాంబు పేలగా, నారీమన్ హౌస్ దగ్గర రెండో టాక్సీ బాంబ్ పేలింది. మజ్గాన్ డాక్ దగ్గర మూడో టాక్సీ బాంబ్ పేలింది.
ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టడానికి రంగంలోకి దిగిన ముంబయి పోలీసులు, NSG కమెండోలు నవంబర్ 27న “ఆపరేషన్ బ్లాక్ టోర్నెడో”ను ప్రారంభించారు. హెలికాఫ్టర్లసాయంతో కమెండోలు ఉగ్రవాదులు దాగిన భవనాల్లోకి ప్రవేశించారు. నవంబర్ 27 సాయంత్రం 6 గంటలకు నారీమన్ హౌస్ లో నక్కిన ఉగ్రవాదులను కమెండోలు మట్టుబెట్టారు. తాజ్ హోటల్ లో దాగిన ఉగ్రవాదులను కమెండోలు మట్టుబెట్టడంతో ఆపరేషన్ బ్లాక్ టొర్నాడో ముగిసింది. ఉగ్రవాదుల్లో 9 మంది కమెండో ఆపరేషన్లో చనిపోగా “కసబ్” మాత్రం ప్రాణాలతో చిక్కాడు. కసబ్ మరియు ఇస్మాయిల్ ఖాన్ కారులో పారిపోతున్నప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ చనిపోగా కసబ్ మాత్రం పోలీసులకు చిక్కాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన తుకారాం ఓంబ్లే పై కాల్పులు జరిపి తప్పించుకోవాలని కసబ్ ప్రయత్నించాడు. తుకారాం ఓంబ్లే తన ప్రాణాలు పోతున్నా కసబ్ ని మాత్రం వదల్లేదు. కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. తుకారాం ఓంబ్లే ధైర్యసాహసాల వల్ల కసబ్ పట్టుబట్టాడు. కసబ్ ఇస్మాయిల్ ఖాన్ తో కలిసి ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో సాగించిన నరమేధం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఉగ్రవాదుల రక్తదాహానికి 28 మంది విదేశీయులు సహా, 166 మంది బలయ్యారు. 9 మంది పోలీసులు,కమెండోలు ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో అసువులు బాసారు.308 మంది తీవ్రంగా గాయపడ్డారు. హేమంత్ ఖర్గరే, అశోక్ కామ్టే , విజయ్ సలాస్కర్ లాంటి పోలీస్ ఉన్నతాధికారులు, తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులతో పోరాడి అమరులయ్యారు. కసబ్ ని విచారించిన సెషన్స్ కోర్ట్ 2010లో కసబ్ కి ఉరిశిక్ష విధించింది. కసబ్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా రాష్ట్రపతి దానిని తిరస్కరించారు. దీనితో 2012 నవంబర్ 21న కసబ్ ని ఉరి తీశారు. భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా ముంబయి పై దాడి నిలిచిపోయింది.దాడివల్ల కకావికలమైన ముంబయిలో శాంతి భద్రతలను ప్రభుత్వం త్వరలోనే అదుపులోకి తెచ్చింది. ఉగ్ర దాడులకు భయపడమన్న సందేశాన్ని ప్రపంచానికి భారతదేశం పంపింది. మరొకసారి అలాంటి ఉగ్రదాడులు భారత దేశంలో జరగకుండా భారత ప్రభుత్వం జాగ్రత్త పడింది. దాడుల వల్ల ధ్వంసమైన ముంబయ్ ని తిరిగి అదే రూపుకు తీసుకురావడం వెనుక భారత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. కానీ భారతదేశ చరిత్రలో నెత్తుటి మరకలా ముంబయిపై ఉగ్రవాదుల దాడి చరిత్రలో నిలిచిపోయింది.ఆ నరమేధాన్ని ఆధారం చేసుకుని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 26/11 ముంబయి అటాక్స్ సినిమా రూపొందించారు.
ముంబయి ఉగ్రదాడులకు నేటితో 11 ఏళ్ళు అయిన సందర్భంగా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినా అధికారులను స్మరిస్తూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నివాళులు అర్పించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తున్నాను. దేశాన్ని కాపాడంలో ప్రాణత్యాగం చేసిన భద్రతా బలగాలకు నివాళులర్పిస్తున్నానని,వారి త్యాగాలను దేశం ఎప్పుడూ మరవదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముంబై దాడుల్లో చనిపోయిన వారందరికీ ప్రజలు నివాళులర్పిస్తున్నాని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.