iDreamPost
android-app
ios-app

AP MLC – ఏపీలో 11 మంది కొత్త ఎమ్మెల్సీల ఏకగ్రీవం.. వారి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

AP MLC – ఏపీలో 11 మంది కొత్త ఎమ్మెల్సీల ఏకగ్రీవం.. వారి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 8 జిల్లాలలో స్థానిక సంస్థల నుంచి వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లో వెల్లడించింది. అనంతపురం నుంచి యల్లారెడ్డి గారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్ ఎన్నికైనట్టు తెలిపింది. తూర్పుగోదావరి నుంచి అనంత సత్య ఉదయ భాస్కర్, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంత రావు ఏకగ్రీవం అవగా విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస రావు ఎన్నికైనట్టు నోటిఫికేషన్ లో తెలిపింది. చిత్తూరు నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీ అసెంబ్లీలో పూర్తి మెజారిటీతో ఉన్న వైసీపీ ఇప్పుడు శాసనమండలిలోనూ అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో 151 మందితో వైసీపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ ఇప్పుడు శాసనమండలిలోనూ అదే స్థాయిలో బలాన్ని పెంచుకుంది. స్థానిక సంస్థల కోటాలో వైసీపీకి చెందిన 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మండలిలో వైసీపీ బలం 32కు చేరనుంది. శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటే ఇప్పుడు వైసీపీ సభ్యుల సంఖ్య 32కు చేరింది. టీడీపీ సంఖ్యాబలం 15కు తగ్గింది. బీజేపీ నుంచి ఒకరు, పిడిఎఫ్ నుంచి నలుగురు సభ్యులు మండలిలో ఉంటారు. ఇక, వైసీపీ నుంచి సభ్యులుగా ఉన్న వారిలో 18 మంది ఎస్సీ – బీసీ – మైనార్టీ వర్గాలకు చెందిన వారు కాగా వారిలో నలుగురు మైనార్టీలు. అయితే వారిలో ఒక మైనారిటీ సభ్యురాలు కరి మున్నీసా మరణించారు. ఇక, తాము అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులు నాడు టీడీపీ తమకున్న సంఖ్యా బలంతో అడ్డుకున్నారు. దీంతో..మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇక, తాజాగా మండలి రద్దు తీర్మానం ను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానం చేసింది. ఇప్పుడు శాసన మండలి సభ్యులు పూర్తికాలం తమ పదవులలో కొనసాగనున్నారు.

పాలవలస విక్రాంత్..

శ్రీకాకుళానికి చెందిన పాలవలస విక్రాంత్ పార్టీకి విధేయుడిగా గుర్తింపు పొందారు. అందుకే ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కింది. అయితే ఆయనకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండగా ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు విక్రాంత్. విక్రాంత్ తాత పాలవలస సహకార సంఘం నాయకుడుగా నాయనమ్మ రుక్మిణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం కి కూడా పూర్తి రాజకీయ అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. ఇక విక్రాంత్ కూడా డీసీసీబీ చైర్మన్ గా పని చేశారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

Also Read : Rampachodavaram, Ananta Babu, MLC Seat – ఉదయ్‌ భాస్కర్‌కు ఎమ్మెల్సీ ఖాయమేనా..?

ఇందుకూరి రఘురాజు..

విజయనగరం జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇందుకూరి రఘురాజు గెలుపొందగా ఆయన ఎస్‌ కోట మండలం తెన్నుబొడ్డవర కు చెందిన వారు. ఐవీఎన్‌ రాజు వారసుడిగా 2001లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 2001లో జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీటు ఖరారు చేసినా చివరి నిమిషంలో ఆయనను కాదని అల్లు జోగి నాయుడుకు ఇచ్చింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మళ్లీ బరిలో నిలిచి ఓటమి పాలయిన ఆయన యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పీసీసీ సభ్యుడిగా, జిల్లా యువజన కాంగ్రెస్‌ కన్వీనరుగా పనిచేశారు. 2013 నుంచి 2014 వరకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చేశారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన 2014 -2018 వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేసి 2019 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. అప్పటి నుంచి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వైసీపీలో చేరినప్పుడే రఘురాజుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నారు.

తలశిల రఘురామ్‌, మొండితోక అరుణ్‌కుమార్‌..

ఇక కృష్ణా జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీగా సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌, అలాగే అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉన్న మొండితోక అరుణ్‌కుమార్‌లు ఎమ్మెల్సీలు అయ్యారు. విజయవాడ నగరానికి చెందిన తలశిల రఘురామ్‌ మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉండే గొల్లపూడిలో నివాసం ఉంటారు. ఓసీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన మొదట కాంగ్రెస్‌ పార్టీలో ఉండేవారు కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్‌ వెంటే ఉన్నారు. ముందు నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహణ బాధ్యతలు చూసేవారు. వైసీపీలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లాలో అయన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలా ఆయనకు అవకాశం దక్కడంతో పాటు విధేయతతో జగన్ వెంటే ఉన్న నందిగామకు చెందిన అరుణ్‌ కుమార్‌కు కేటాయించారు.

వంశీ కృష్ణ శ్రీనివాస్‌, వరుదు కళ్యాణి.. 

విశాఖకు చెందిన వంశీ కృష్ణ శ్రీనివాస్‌కు నగర మేయర్‌గా అవకాశం కల్పిస్తారని ఆశించినా వారికి నిరాశ మిగిలినప్పటికీ జగన్ మాట మేరకు సైలెంట్ అయ్యారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించే వ్యక్తిగా వంశీ కృష్ణ శ్రీనివాస్‌కు ఉన్న ఈ వ్యక్తిత్వమే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించింది. మొదటి నుంచి వరుదు కళ్యాణి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read : YCP, MLC Elections, Tumati Madhava Rao – తుమాటి మాధవరావుకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా..?

అనంత ఉదయ భాస్కర్.. 

తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు అనంత ఉదయ భాస్కర్. ఆయన గతంలో అడ్డతీగల జెడ్.పి.టి.సి గా ఎన్నికయ్యారు. తర్వాత అడ్డతీగల ఎం.పి.పి.గా కూడా పని చేశారు. 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడు స్థానం నుండి వైసిపి తరపున నామినేషన్ వేస్తె ఆయన అనర్హుడని హైకోర్టు ప్రకటించింది. అప్పుడే అనంతబాబు అసలు కులాన్ని కోర్టు నిర్థారించింది. ఆయన పెద్ద కాపు అని ఓ.సి కేటగిరీకి చెందిన వ్యక్తి అని తేలడంతో అప్పుడు సైలెంట్ అయ్యారు. కానీ 2019 ఎన్నికలకు ముందు సాధారణ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న నాగులపల్లి ధనలక్ష్మిని పార్టీలోకి తీసుకురావడమే కాకుండా, ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మెజార్టీతో గెలవటంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ఆయన పనితనానికి ఎమ్మెల్సీ పదవి దక్కింది.

మురుగుడు హనుమంత రావు.. 

గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు అనూహ్యంగా పదవి దక్కించుకున్నారు. హనుమంతరావు 1987లో మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1999, 2004 లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఆప్కో చైర్మన్‌గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. 

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గతంలో టీడీపీ ఎమ్మెల్యే, తదుపరి ఎంపిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత జగన్ ఆయనను మండలికి ఎంపిక చేయడమే పార్టీ పక్షాన మండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా కల్పించారు. తిరిగి అధికారంలోకి వచ్చాక ఆయనకు చీఫ్ విప్ పదవి ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవిని రెన్యూ చేశారు.

శివరామిరెడ్డి.. 

అనంతపురం జిల్లాకు చెందిన శివరామిరెడ్డి గతంలో ఆయన ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. గత ఎన్నికల్లో ఆయన సోదరులు ముగ్గురు బాలనాగిరెడ్డి (మంత్రాలయం), శివప్రసాదరెడ్డి ( ఆదోని)వెంకట్రామిరెడ్డి (గుంతకల్లు) పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పుడు శివరామిరెడ్డికి టిక్కెట్ ఇవ్వలేకపోయిన నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

Also Read : AP Council, Abolished Bill – మండలి యధాతథం.. ఏపీ శాసన సభలో కీలక పరిణామం