iDreamPost

ఆదిపురుష్ OTTకి నెట్ ఫ్లిక్స్ మతిపోయే ఆఫర్

ఆదిపురుష్ OTTకి నెట్ ఫ్లిక్స్ మతిపోయే ఆఫర్

ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉన్న ప్రభాస్ ఆది పురుష్ కి నెట్ ఫ్లిక్స్ అదిరిపోయే డీల్ ఇచ్చినట్టుగా ముంబై రిపోర్ట్. 250 కోట్లకు అన్ని బాషల హక్కులను సొంతం చేసుకుందట. ఇప్పటి దాకా తెలుగునే కాదు ఏ మూవీకి ఇండియాలో ఇంత పెద్ద ఓటిటి ఆఫర్ రాలేదు. ఈ విషయంలోనూ డార్లింగ్ మరో సరికొత్త రికార్డు అందుకున్నాడు. అఫీషియల్ గా బయటికి చెప్పలేదు కానీ ఒప్పందం జరిగిపోయిందట. తానాజీతో జాతీయ అవార్డు సాధించే స్థాయికి చేరుకున్న ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ లో కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ కాదు ఇప్పటిదాకా కనీసం ప్రీ లుక్ కూడా వదల్లేదు.

ఇప్పుడీ టాపిక్ నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ గా మారిపోయింది. పెద్ద పెద్ద బాలీవుడ్ మూవీస్ ని కాదని ఇంత పెద్ద మొత్తాన్ని నెట్ ఫ్లిక్స్ ఎందుకు ఖర్చు పెడుతుందానే అనుమానం రావడం సహజం. ఇటీవలి కాలంలో దానికి సౌత్ సినిమాలు బంగారు బాతులా మారాయి. ఆర్ఆర్ఆర్ ని ప్రపంచవ్యాప్తంగా ఎగబడి చూశారు. అది కూడా కేవలం హిందీ వెర్షన్ కే. మేజర్, అంటే సుందరానికి భారీ వ్యూస్ వచ్చాయి. కొన్ని వారాల పాటు ఇవి టాప్ 5 వ్యూస్ లో చోటు సంపాదించుకున్నాయి. డిజాస్టర్ అయిన విరాట పర్వం కు సైతం కోట్లాది వీక్షణలు దక్కాయి. అందుకే ఇకపై తెలుగు స్టార్ల ఓటిటి రైట్స్ ని ఎంతకైనా సరే కొనాలని నెట్ ఫ్లిక్స్ డిసైడ్ అయ్యిందట.

ఈ లెక్కన చూస్తే దాదాపుగా బడ్జెట్ మొత్తం ఈ రూపంలో వచ్చేసినట్టే. ఇంకా శాటిలైట్, థియేట్రికల్, డబ్బింగ్ ఇలా బోలెడున్నాయి. ఎంతలేదన్నా ఆరేడు వందల దాకా ఆది పురుష్ వర్కౌట్ చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 2023 సంక్రాంతికి విడుదల ఉంటుందా లేదా అనే దాని గురించి నిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. గ్రాఫిక్స్ తాలూకు పనులు అక్టోబర్ లోగా కొలిక్కి వస్తే జనవరి టార్గెట్ ని చేరుకోవడం సులభమవుతుంది. ఎందుకంటే ప్రమోషన్లకు కనీసం రెండు మూడు నెలలు అవసరమవుతాయి. మరి నెలల తరబడి ఎదురుచూస్తున్న అభిమానులు ఎదురుచూపులకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో నిర్మాణ సంస్థ టి సిరీసే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి