iDreamPost

సాగర్‌ బైపోల్‌ : నామినేషన్ల పరిశీలనలో ట్విస్ట్‌.. బీజేపీ నేతకు షాక్‌..

సాగర్‌ బైపోల్‌ : నామినేషన్ల పరిశీలనలో ట్విస్ట్‌.. బీజేపీ నేతకు షాక్‌..

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 77 మంది 128 నామినేషన్లు దాఖలు చేయగా.. ఈ రోజు వాటన్నింటినీ రిటర్నింగ్‌ అధికారి పరిశీలించారు. 77 మంది అభ్యర్థుల్లో 17 మంది నామినేషన్లు తిరష్కరణకు గురయ్యాయి. ఇందులో బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి నివేదితా రెడ్డితోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి సహా స్వతంత్రులు 15 మంది ఉన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి జానా రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌ నాయక్‌లతో సహా వివిధ పార్టీలు, స్వతంత్రులు 60 మంది నామినేషన్లు అధికారులు ఆమోదించారు. ఏప్రిల్‌ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాత బరిలో ఎంత మంది ఉంటారనేది తేలుతుంది.

బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి అయిన నివేదితారెడ్డిని దురదృష్టం ఆది నుంచి వెంటాడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన నివేదితారెడ్డి.. ఉప ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానే విశ్వాసంతో ఉన్నారు. అయితే సామాజికవర్గాల సమీకరణాలతో టిక్కెట్‌ రాకపై సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ టిక్కెట్‌ ఎవరికనేది తేల్చకముందే.. ఆమె పార్టీ కండువా వేసుకోకుండా నామినేషన్‌ వేశారు.

కాంగ్రెస్‌ రెడ్డి సామాజికవర్గానికి చెందిన జానా రెడ్డికి, టీఆర్‌ఎస్‌ యాదవ సామాజికవర్గానికి చెందిన నోముల భగత్‌కు టిక్కెట్‌ ఇవ్వడంతో.. బీజేపీ ఎస్టీ (లంబాడా) సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ రవినాయక్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.

Also Read : బీజేపీలో జగన్‌ కోవర్టులున్నారట..! వారెవరో హింట్‌ కూడా ఇచ్చిన అచ్చెం నాయుడు..!

బీజేపీ టిక్కెట్‌ రేసులో మొదటి నుంచీ నివేదితా రెడ్డితోపాటు కడారి అంజయ్య, రవికుమార్‌ నాయక్‌లు ఉన్నారు. టిక్కెట్‌ రవికుమార్‌కు ప్రకటించడంతో అంజయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌ను కలసి గులాబీ కండువా కప్పుకున్నారు.

బీజేపీ అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్న టీఆర్‌ఎస్‌.. నివేదితా రెడ్డిని కూడా చేర్చుకోవాలని ప్రయత్నించింది. టిక్కెట్‌ రాకపోవడంతో ఆమె కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారే ప్రచారం సాగింది.

నివేదితా రెడ్డి భర్త శ్రీధర్‌ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో సమయంలో నివేదితా దంపతులు పార్టీ వీడితే తీరని నష్టమనే అంచనాతో.. బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు.

బీజేపీ నేతలు బుజ్జగించడంతోపాటు.. నియోజకవర్గంలో మరో కీలక నాయకుడు కడారి అంజయ్య టీఆర్‌ఎస్‌లో చేరడంతో.. రాబోయే సాధారణ ఎన్నికల్లో సాగర్‌ టిక్కెట్‌ తనకే వస్తుందనే నమ్మకంతో నివేదితా రెడ్డి పార్టీ మార్పు అంశం పక్కనపెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీకి సిద్ధమయ్యారు.

Also Read : సాగర్ బరిలో డాక్టర్.. బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి