iDreamPost

క‌మ‌లం క‌మిలిపోయింది..!

క‌మ‌లం క‌మిలిపోయింది..!

తెలంగాణ‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో గెలుపు స‌మీక‌ర‌ణాలతో పాటు ఓట‌మి స‌మీక‌ర‌ణాలు కూడా ఆస‌క్తిగా ఉన్నాయి. ప్ర‌ధానంగా బీజేపీ డిపాజిట్ కూడా ద‌క్కించుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని, రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాగా వేసి తీరుతామ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించే బీజేపీ నేత‌లు నాగార్జున సాగ‌ర్ కు వ‌చ్చేస‌రికి చ‌తికిల ప‌డ్డారు. దుబ్బాక నుంచి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వ‌ర‌కూ విజ‌య ప్ర‌స్థానం సాగించిన బీజేపీ, నిన్న‌, మొన్న జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్ర‌లు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా అధికార పార్టీకి గ‌ట్టి పోటీయే ఇచ్చింది. కానీ, నాగార్జున‌సాగ‌ర్ లో క‌నీసం డిపాజిట్ కూడా పొంద‌లేక‌పోవ‌డం వెనుక కార‌ణాలు అనేకం క‌నిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక‌లో ప‌ని చేసిన మ్యాజిక్ ఇక్క‌డ క‌నీసం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. కుల స‌మీక‌ర‌ణాలు, ఎదుటి పార్టీ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న కోసం వేచి చూసే ధోర‌ణి, సామాన్య వ్య‌క్తిని నిల‌బెట్ట‌డం ఇవేమీ క‌లిసి రాలేదు.

దుబ్బాక ఉప ఎన్నిక‌లో స్థానికత‌ను అనుకూలంగా మార్చుకోవ‌డంలో బీజేపీ స‌క్సెస్ అయింది. దీనికి తోడు అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు నిరంత‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌మే కాదు, ఎన్నిక‌ల స‌మ‌రంలో బీజేపీ మార్క్ రాజ‌కీయాల‌తో ర‌క్తి క‌ట్టించ‌గ‌లిగారు. దీనికి తోడు ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌వాహం, పోలీసుల అరెస్టుల‌ను కూడా రాజ‌కీయంగా త‌న‌కు ఉప‌యోగ‌ప‌డేలా తిప్పుకున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల నాటికి ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను బాగా ఉప‌యోగించుకున్నారు. వ‌ర‌ద‌లు సృష్టించిన క‌ల్లోలం, వ‌ర‌ద సాయంలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌జ‌ల త‌రుఫున నిల‌బ‌డి ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం క‌లిసి వ‌చ్చింది. వ‌ర‌ద‌ల ప్ర‌భావంతో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ప్రాంతాల‌న్నీ బీజేపీకే ఏక‌ప‌క్షంగా ప‌ట్టం క‌ట్టాయి.

నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు వ‌చ్చే స‌రికి మొద‌టి నుంచీ బీజేపీ తిక‌మ‌క ప‌డుతూనే ఉంది. అభ్య‌ర్థి ఎంపిక నుంచి, ఎంపిక ద్వారా ఇత‌ర ఆశావ‌హుల్లో పెల్లుబికే అసంతృప్తిని చ‌ల్లాచ‌ర్చ‌డంలో విఫ‌ల‌మైంది. దీన్నే అధికార పార్టీ త‌న‌కు అనువుగా మార్చుకుంది. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించే అభ్య‌ర్థిని బ‌ట్టి కుల‌, సామాజిక స‌మీక‌ర‌ణాల ఆధారంగా త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన‌ బీజేపీ వ్యూహం విక‌టించింది. టీఆర్ఎస్ నుంచి బీసీ, కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తులు అభ్య‌ర్థులుగా ఉండ‌డంతో సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను బేరీజు వేసుకుని బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్‌నాయక్ ను పార్టీ రంగంలోకి దింపింది. 40 వేల ఓట్లు కలిగిన లంబాడ సామాజిక వర్గానికి చెందిన వాడు కావ‌డం త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని భావించింది. కానీ, ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్ల‌లో బీజేపీ నాలుగో వంతు కూడా ప‌డ‌లేదు.

దీనికి తోడు సాగర్‌ బీజేపీ అభ్యర్థి పి.రవికుమార్‌ నాయక్‌కు ఇదే తొలి ఎన్నిక. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదు. విపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వెనుకబడి ఉన్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. పైగా సీటు పంపకాల్లో ఏర్పడ్డ లొల్లి బీజేపీకి అవరోధంగా మారింది. బీజేపీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ కడారు అంజయ్య యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా సాగర్‌ బరిలో దిగిన అంజయ్యయాదవ్‌ 27వేల ఓట్లు సాధించి జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నివేదితా రెడ్డి స్తబ్దుగా ఉన్నారు. ఇవ‌న్నీ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీజేపీకి ఘోర ఓట‌మిని మూట‌గ‌ట్టాయి. అయితే, 2018 ఎన్నికల్లో 2, 675 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈసారి 7,159 ఓట్లు సాధించి కాస్త అయినా పెంచుకున్నామ‌న్న సంతృప్తి మాత్రం ఆ పార్టీ అభ్య‌ర్ధికి ద‌క్కింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి