iDreamPost

మైత్రి నిర్మాతలు భలే బ్యాలన్స్ చేశారు

మైత్రి నిర్మాతలు భలే బ్యాలన్స్ చేశారు

ఇద్దరు అగ్ర హీరోలతో ఒకేసారి సినిమాలు తీయడం నిర్మాణ సంస్థలకు కొత్తేమి కాదు కానీ ఒకే టైంలో రిలీజ్ చేయడం మాత్రం అరుదు. అనుకోకుండా జరిగిందో లేక ప్లాన్ చేసుకుని వచ్చారో కానీ మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఘనత దక్కింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డిలను సంక్రాంతి సీజన్ లోనే తీసుకురావడం బహుశా టాలీవుడ్ లోనే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఈ ఇద్దరూ పరస్పరం తలపడటం చాలా సార్లు జరిగింది కానీ ఇలా ప్రొడక్షన్ హౌస్ కోణంలో ఢీ కొట్టడం మాత్రం మొదటిసారి. అయితే ఇలాంటి ప్రాజెక్టులు తెరకెక్కుతున్నప్పుడు అప్డేట్స్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

ఎంత ప్రెజర్ ఉన్నా మైత్రి అధినేతలు వాటిని బాలన్స్ చేసిన తీరు నిజంగా అభినందనీయం. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే రీతిలో కాకుండా లిరికల్ సాంగ్స్ విడుదలతో మొదలుపెట్టి పోస్టర్లు, మేకింగ్ వీడియోలు, ఇంటర్వ్యూలు, మీట్ ది ప్రెస్ లు, టీజర్లు, ట్రైలర్లు అన్నీ ఒకపద్ధతి ప్రకారం ఒకటి ముందు తర్వాత మరొకటి వెంటనే దీనికి రివర్స్ సిరీస్ లో ఇంకోసారి మొత్తం పక్కా ప్లానింగ్ తో జరిగిపోయింది. దీని కోసమే ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి వాటి మధ్య సమన్వయం వచ్చేలా డిజైన్ చేసుకున్న తీరు ఇబ్బందులు రాకుండా చూసుకుంది. అందుకే ఊరికే దుమ్మెత్తిపోసుకునే ట్విట్టర్ బ్యాచీలు సైతం ఈసారి ఎక్కువ సౌండ్ చేయడం లేదు

రేపు వైజాగ్ లో జరిగే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కీలకమైన ఘట్టాలన్నీ పూర్తయినట్టే. ఆ తర్వాత పండగ ప్రోగ్రాంస్ లో భాగంగా ఛానల్స్ తో ముఖాముఖీలు సెలబ్రిటీ యాంకర్స్ తో కార్యక్రమాలు గట్రా ఉంటాయి. 12, 13 తేదీల దాకా ఇదంతా ఒక రకంగా టెన్షన్ కలిగించే వాతావరణమే. అసలే రెండూ ఊర మాస్ కమర్షియల్ బొమ్మలు. ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. వారసుడు థియేటర్ల పరంగా ఇబ్బందులు సృష్టిస్తున్నప్పటికీ చిరు బాలయ్యలు కనక కంటెంట్ తో మెప్పిస్తే బ్లాక్ బస్టర్స్ ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. వీటి మీద నూటా యాభై కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన మైత్రికి ఇవి సక్సెస్ కావడమూ చాలా కీలకం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి