iDreamPost

Reality Shows : ఎంత రచ్చ చేస్తే అంత రేటింగ్ తరహాలో ప్రోగ్రాంలు

Reality Shows : ఎంత రచ్చ చేస్తే అంత రేటింగ్ తరహాలో ప్రోగ్రాంలు

ఇటీవలి కాలంలో రియాలిటీ షోల పేరుతో ఛానల్స్ లో చేస్తున్న అతిని చూస్తున్నాం. రేటింగ్స్ కోసం సుప్రసిద్ధ సంస్థలు సైతం ఎంతకైనా దిగజారేందుకు సిద్ధపడుతున్నాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుంది మనం చేస్తున్నది రైటా రాంగా ఇవేవి ఆలోచించడం లేదు. యాడ్స్ రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తే చాలానే రీతిలో డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి శృతి మించి పక్కింటి భార్యల మీద వెగటు పుట్టే రేంజ్ లో జోకులు వేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టేలా సాగుతున్న తీరు చూస్తుంటే అసలు ఇవి ఎక్కడి దాకా వెళ్తాయో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. ఇక్కడితో ఆగితే బాగానే ఉంటుంది.

ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్ లో వచ్చిన కామెడీ స్కిట్ లో ప్రముఖ హాస్య నటుడు ఒక హీరో వాడే భాషను అనుకరిస్తూ బాగా వ్యంగ్యంగా ఇమిటేట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇతను టార్గెట్ చేసినది చిన్న వ్యక్తిని కాదు. దీంతో ఇది కాస్తా రకరకాల మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అభిమానులకు ఆగ్రహం వచ్చి సదరు కమెడియన్ మీద బయట ఎక్కడో చేయి చేసుకున్నారనే టాక్ కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. పేర్లు బయటికి రాకుండా మేనేజ్ చేశారు కానీ ఇలాంటి విషయాల్లో చాలా యాక్టివ్ గా ఉండే నెటిజెన్లు ఇది ఎందుకు ఎవరి వల్ల జరిగిందో ఈజీగా పసిగట్టేసి అందరికీ చెప్పేస్తున్నారు. ఇదీ రచ్చ మ్యాటర్

నిర్వాహకులకు ఆదాయం తప్ప ఇంకేదీ పట్టనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. అసలే సీరియల్స్ లో మహిళలను విలన్లు చిత్రీకరించి చిన్న పిల్లలను సైతం వదలకుండా వాళ్ళ వయసుని మించిన పాత్రలు డిజైన్ చేస్తున్నారు. వాళ్ళతోనూ కుట్రలు చేసి రుద్దుతున్న తీరు గురించి వీలైనంత తక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఇంత జరుగుతున్నా పేరు మోసిన ఛానల్స్ మాత్రం కనీసం చీమ కుట్టినంత కూడా స్పందించడం లేదు. సినిమా లాగా టీవీ అనేది మనం ఎంచుకునేది కాదు. వద్దన్నా చూడాలనిపించే ఖచ్చితమైన అలవాటు. చూస్తున్నారు కదాని ఇలా రుద్దుతూ పొతే వివాదాలే కాదు ఇంకెన్ని విపరీతంగా పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదు

Also Read : Bheemla Nayak : పవన్ సినిమాలో ముఖ్యమైన రిపేర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి