iDreamPost

చరిత్ర సృష్టించిన తెలంగాణ హైకోర్టు.. తొలిసారి ఆ పని చేసింది!

  • Published Jun 30, 2023 | 5:23 PMUpdated Jun 30, 2023 | 5:23 PM
  • Published Jun 30, 2023 | 5:23 PMUpdated Jun 30, 2023 | 5:23 PM
చరిత్ర సృష్టించిన తెలంగాణ హైకోర్టు.. తొలిసారి ఆ పని చేసింది!

తెలంగాణ హైకోర్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇంతకు ఏం జరిగింది అంటే.. తెలంగాణ హైకోర్టు.. ఓ కేసు విచారణలో భాగంగా తొలిసారి తెలుగులో తన తీర్పు వెల్లడించింది. ఇప్పటి వరకు కేవలం కేరళ హైకోర్టు మాత్రమే ఇలా మాతృభాషలో తీర్పు వెల్లడించగా.. ఆ తర్వాత మాతృభాషలో తీర్పు వెల్లడించిన రెండో హైకోర్టుగా తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం రికార్డు సృష్టించింది. మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వులు, ఆదేశాలు, ప్రభుత్వ కార్యకలాపాలన్ని మాతృభాషలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలానే న్యాయస్థానాల్లో జరిగే అంశాలను కూడా తెలుగులో వెల్లడిస్తే.. సామాన్యులకు కూడా బాగా అర్థం అవుతుందనే ఉద్దేశంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పును వెల్లడించి.. మాతృభాషలో తీర్పు వెల్లడించిన తొలి హైకోర్టుగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ హైకోర్టు నిలిచింది. ఆస్తి వివాదం కేసులో భాగంగా.. ఆ తీర్పును అనుసరించి సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం తొలిసారిగా తెలుగులో 44 పేజీల తీర్పును ఇచ్చింది.

సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఇంగ్లీష్ భాషలోనే మొత్తం వివారాలు ఉంటాయి. పిటిషన్‌లు దాఖలు చేసినప్పుడు అనుబంధ డ్యాక్యుమెంట్లు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లెట్ చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలి. అయితే గత కొద్ది కాలంగా సుప్రీం కోర్టు కీలక తీర్పులను ఈ మధ్య స్థానిక భాషల్లోకి ట్రాన్స్‌లెట్ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులు కూడా స్థానిక భాషలో తీర్పు వెలువరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేయడం ప్రారంభించాయి.

తెలంగాణ హైకోర్టు.. తెలుగులో తీర్పు వెలువరించటంపై ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టులు ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువరించేలాగా పార్లమెంటు తప్పనిసరిగా చట్టం చేయాలన్నారు. గతంలో తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి కోరగా.. సుప్రీంకోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. అలానే 2014 జూన్‌లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇదే విధమైన అప్పీళ్లను సుప్రీంకోర్టుకు పంపాయని జస్టిస్ రామలింగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో తీర్పులను వెలువరించటం ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థ మరింత చేరువ అవుతుందని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి