iDreamPost

జ‌గ‌న్ ఆలోచ‌నే దేశ‌మంతా, మోడీ మాట‌ల్లో స‌డ‌లింపు వెనుక కార‌ణం అదేనా?

జ‌గ‌న్ ఆలోచ‌నే దేశ‌మంతా, మోడీ మాట‌ల్లో స‌డ‌లింపు వెనుక కార‌ణం అదేనా?

క‌రోనా ముప్పు పొంచి ఉన్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స‌మ‌గ్ర వ్యూహంతో సాగుతోంది. ప్ర‌చారం క‌న్నా ప‌నితీరుతో ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఉన్న వ‌న‌రుల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకుంటున్న‌ట్టు ఇప్ప‌టికే జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా వాలంటీర్లు, వార్డు లేదా గ్రామ స‌చివాల‌య సిబ్బంది చొర‌వ ఉప‌యోగ‌ప‌డుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. క్షేత్ర‌స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ లేని యంత్రాంగం ఏపీ ప్ర‌భుత్వం వ‌ద్ద ఉండ‌డంతో స‌మాచార సేక‌ర‌ణ‌, దాని ఆధారంగా విశ్లేష‌ణ‌, త‌గిన చ‌ర్య‌ల కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌ణాళిక రూపొందించుకునే అవ‌కాశం ఏపీకి ద‌క్కింది.

తొలుత విదేశాల నుంచి వ‌చ్చిన వారి సంఖ్య ఎక్కువ సంఖ్య‌లోనే ఉన్న‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం వారిని గుర్తించి స‌కాలంలో ఐసోలేట్ చేయ‌గ‌లిగింది. ఆ త‌ర్వాత మ‌ర్కాజ్ యాత్రికుల రూపంలో మొద‌ల‌యిన ముప్పు విష‌యంలో కూడా స‌కాలంలో స్పందించింది. అత్య‌ధిక సంఖ్య‌లో త‌బ్లీఘ్ కి వెళ్లిన వారున్న‌ప్ప‌టికీ కేసుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించింది. దాంతో ఇప్పుడు క‌రోనా కేసుల విష‌యంలో చాలా వ‌ర‌కూ నియంత్ర‌ణ చేయ‌గ‌లిగింది. అన్నింటికీ మించి కుటుంబాల వారీగా నిర్వ‌హించిన స‌ర్వే ఏపీ ప్ర‌భుత్వానికి బాగా తోడ్ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. కుటంబాల వారీగా స‌మాచారం సేక‌రించి, క‌రోనా ల‌క్ష‌ణాలున్న వాళ్లు, ఇత‌ర సాధార‌ణ స‌మ‌స్య‌ల‌తో ఉన్న వారు, దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లున్న వారు అంటూ వారిని విభ‌జించారు. స‌మ‌గ్ర సమాచారం ప్ర‌భుత్వం వ‌ద్ద ఉండ‌డంతో దాని ఆధారంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకునే అవ‌కాశం ప్ర‌భుత్వానికి వ‌చ్చింది.

అందుకు తోడుగా కాకినాడ ఎస్ ఈ జెడ్ లో ఉన్న బొమ్మ‌ల ప‌రిశ్ర‌మ‌, అచ్యుతాపురం సెజ్ లో ఉన్న బ్రాండిక్స్ కంపెనీల‌లో పీపీఈలు సొంతంగా త‌యారుచేయ‌డానికి ప్ర‌భుత్వం చూపిన చొర‌వ ప‌లితాన్నిస్తోంది. ఇక విశాఖ మెడ్ టెక్ జోన్ నుంచి ప‌రీక్ష కిట్లు సిద్ధం అవుతున్నాయి. దాంతో ఓవైపు ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌గ్ర డేటా అందుబాటులో ఉండ‌డం, అవ‌స‌రాలు తీర్చేందుకు త‌గిన స‌దుపాయాల ఉత్ప‌త్తిపై శ్ర‌ద్ధ‌పెట్ట‌డం వంటి చ‌ర్య‌లు అక్క‌ర‌కు వ‌స్తున్న‌ట్టు వాస్త‌వ లెక్క‌లు చాటుతున్నాయి ప‌రిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు ఈ చ‌ర్య‌ల‌న్నీ తోడ్ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో ఏపీ మొత్తాన్ని మూడు జోన్లుగా విభ‌జించి ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు పాటిస్తోంది. అందులో రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్ల వారీగా విడ‌దీసి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

ఏపీలో తీసుకున్న చ‌ర్య‌లు సత్ఫ‌లితాలు ఇస్తున్న ద‌శ‌లో సీఎం జ‌గ‌న్ కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం మోడీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో ప‌లువురు సీఎంలు లాక్ డౌన్ కొనసాగించాల‌ని కోరారు. కానీ సీఎం జ‌గ‌న్ మాత్రం త‌మ వ‌ద్ద ఉన్న డేటా ఆధారంగా కేంద్రాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. వాస్త‌వాన్ని విశ్లేషిస్తూ మూడు జోన్లుగా విభ‌జించి, త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. హాట్ స్పాట్స్ గా గుర్తించిన ప్రాంతాలలో లాక్ డౌన్ నుకొనసాగించి గ్రీన్ జోన్స్ లో లాక్ డౌన్ ను సడలించాలన్న సూచనను ప్రధాని పరిగణించినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ప్ర‌ధాని మాట‌ల్లో అదే ప్ర‌స్ఫుటించింది. మే 3 వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఏప్రిల్ 20 త‌ర్వాత స‌డ‌లింపు అనివార్యం అని ప్ర‌కటించారు. ఆయా ప్రాంతాల్లో న‌మోద‌యిన కేసులు, ప్ర‌జ‌ల ప‌రిస్థితులు అన్నీ గ‌మ‌నంలో ఉంచుకుని మూడుజోన్లుగా విభ‌జించ‌బోతున్న‌ట్టు సంకేతాలు ఇచ్చేశారు.ఆంధ్ర ప్రదేశ్ మాదిరే ఇప్పుడు ప్రతి రాష్ట్రం వైరస్ తీవ్రతను బట్టి జోన్లుగా డేటా సేకరించి ఏప్రిల్ 20 నుంచి లాక్ డౌన్ పాక్షిక సడలింపుకు ప్రయత్నం చెయ్యొచ్చు.

వాస్త‌వానికి అనేక చోట్ల జిల్లాల వారీగా జోన్ల విభ‌జ‌న ఉంటే, ఏపీలో మాత్రం మండ‌లం యూనిట్ గా తీసుకున్నారు. దానిద్వారా ప్ర‌జ‌ల ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వ్య‌వ‌సాయ‌, ఇత‌ర నిత్యావ‌స‌ర విష‌యాల్లో స‌డ‌లింపు కోసం ప్ర‌య‌త్నాలు మొద‌ల‌వుతున్నాయి. మొత్తంగా ఇప్ప‌టికే ఎన్డీటీవీ వంటి జాతీయ చానెళ్లు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన‌ట్టుగా ఏపీలో డేటా ఆధారంగా తీసుకుంటున్న చ‌ర్య‌లు దేశానికి ఆద‌ర్శ‌నీయంగా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అంద‌రికీ ప్ర‌యోజ‌నం చేకూర్చే దిశ‌లో కేంద్రం అడుగులు వేయ‌డం ఆశావాహ‌కంగా మారుతోంది. క్ర‌మంగా స‌డ‌లింపు జ‌రిగితే తిరిగి కొద్ది మేర‌కు కార్య‌క‌లాపాల‌కు ఆస్కారం ఉంటుంద‌ని ఆశిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి