iDreamPost

మిన్నియా పోలీసు విభాగం రద్దు .. అమెరికా చరిత్రలోనే మొదటిసారి

మిన్నియా పోలీసు విభాగం రద్దు .. అమెరికా చరిత్రలోనే మొదటిసారి

అమెరికా చరిత్రలోనే మొదటిసారి ఓ సిటి పోలీసు విభాగాన్ని రద్ద చేయాలనే సంచలన నిర్ణయం జరిగింది. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మరణంపై అమెరికా మొత్తం జరుగుతున్న ఆందోళనలు అందరికీ తెలిసిందే. నిరవధికంగా జరుగుతున్న ఆందోళనల ఫలితంగా మిన్నియాపోలీసు పోలీసు విభాగాన్నే రద్దు చేసేయాలని మిన్నియాపోలీసు సిటి కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకున్నది. తొమ్మిది మంది సభ్యులున్న కౌన్సిల్లో మెజారిటి సభ్యుల నిర్ణయంతో పోలీసు విభాగం రద్దయిపోయింది. పోలీసు శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై జరిగిన సమావేశంలో కౌన్సిల్ లో మెజారిటి సభ్యులు ఇపుడున్న పోలీసు విభాగాన్ని రద్దు చేసి సరికొత్త తరహాలో మళ్ళీ ఏర్పాటు చేయాలని నిర్ణయించటం యావత్ అమెరికాలో సంచలనంగా మారింది.

ఫ్లాయిడ్ విషయంలో పోలీసు అధికారి డెరిక్ చావెన్ అమానుషంగా వ్యవహరించిన విధానంపై దేశంలో గడచిన పదిహేను రోజులుగా ఎంత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. రద్దుచేసిన పోలీసు వ్యవస్ధ స్ధానంలో సరికొత్తగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉండేలా అతి తొందరలోనే కొత్త పోలీసు వ్యవస్ధను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కౌన్సిల్ అధ్యక్షుడు లీసా బెండర్ ప్రకటించాడు. బెండర్ ప్రకటనను మిన్నెసోటా రాష్ట్రంలోని జనాలందరూ స్వాగతించారు.

రేషియల్ జస్టిస్ నెట్ వర్క్ అధ్యక్షుడు నెకిమా లెవీ ఆర్మ్ స్ట్రాంగ్ మాట్లాడుతూ మిన్నియాపోలీసు అధికారుల వైఖరిపై జనాలు ఎప్పటి నుండో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తుచేశాడు. పబ్లిక్ విషయంలో మిన్నియాపోలీసులోని కొందరి దురుసు ప్రవర్తనపై చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మిన్నియాపోలీసు విభాగాన్ని రద్దు చేయటంతో పాటు ఇపుడు అందుతున్న నిధుల్లో కూడా కోత పెట్టాలని సిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ లీసా బెండర్ చెప్పింది. 2020 వార్షిక సంవత్సరానికి 189 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు చెప్పింది.

మిన్నియాపోలిస్ మేయర్ కుల్లర్స్ మాట్లాడుతూ అమెరికా చరిత్రలోనే ఓ నగరంలోని పోలీసు విభాగాన్ని రద్ద చేయటం, బడ్జెట్ కేటాయింపులను తగ్గించటం ఇదే మొదటిసారిగా అభివర్ణించాడు. మిన్నియాపోలీసు విభాగంలో తేనున్న సంస్కరణలకు గాను ఆస్టిన్, న్యూయార్క్, టెక్సాస్ లో అమల్లో ఉన్న విధానాలపై అధ్యయనం చేయనున్నట్లు చెప్పాడు. అలాగే న్యూయార్క్ లో ఉన్నట్లుగా పోలీసు విభాగానికి ఉన్న కొన్ని అధికారాలను సామాజిక సంస్ధలకు అప్పగించే విషయంపైన కూడా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పాడు.

ఫ్లాయిడ్ దుర్మరణం ఘటన వెలుగులోకి రాగానే అల్లర్లతో అగ్రరాజ్యం అట్టుడుకిపోయింది. అమెరికాలోని దాదాపు 25 నగరాలు ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చేసి షాపింగ్ మాల్సును, కార్యాలయాలను, భవనాలను, వాహానాలను తగలబెట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే అదునుగా దొంగలు కూడా తమ ప్రతాపాన్ని చూపించారు. ఒకవైపు ఆందోళనకారుల దెబ్బకు షాపింగ్ మాల్స్, డిపార్టుమెంట్ స్టోర్సును యాజమాన్యం మూసేయటమో వదిలేసి పారిపోవటమే చేసినపుడు దొంగలు వాటిల్లోకి వెళ్ళి యధేచ్చగా లూటి చేసేశారు.

మొత్తానికి ఓ దారుణ ఘటన మిన్నియాపోలీసు రద్దుకే దారితీయటం కలకలం రేపుతోంది. ఓ పోలీసు అధికారి అత్యుత్సాహంతో చేసిన పని యావత్ పోలీసు విభాగాన్నే తలదించుకునేట్లు చేసింది. మరి తొందరలో ఏర్పాటు చేయబోయే పోలీసు విభాగమైన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కౌన్సిల్ సభ్యులు ఆశిస్తున్నారు. చూడాలి కొత్త వ్యవస్ధ పనితీరు ఏ విధంగా ఉంటుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి