iDreamPost

Megastar Chiranjeevi: భారతరత్నకు చేరువుగా చిరంజీవి

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు జాతి గర్వ పడేలా చేశారు. ఇప్పుడు ఆయన మరో ఘనతకు అతి చేరువలో ఉన్నారు.

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు జాతి గర్వ పడేలా చేశారు. ఇప్పుడు ఆయన మరో ఘనతకు అతి చేరువలో ఉన్నారు.

Megastar Chiranjeevi: భారతరత్నకు చేరువుగా చిరంజీవి

చరిత్ర పేజీలను ఒక్కసారిగా తిప్పి చూస్తే, తెలుగు భాషే నిజానికి జాతీయ భాషగా ఎంపికకావాల్సింది. కానీ ఒక్క బాబూ రాజేంద్రప్రసాద్ ఓటు వల్ల ఆ ఆధిక్యత తెలుగు భాష చేజారి పోయిందంటారు కొందరు. హిందీకి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల ఓట్లు నమోదైన నేపథ్యంలో తెలుగు భాషకి ఆ అవకాశం వచ్చి ఉండేది, కానీ బాబూ రాజేంద్రప్రసాద్ కారణంగానే ఫలితాలు మారిపోయాయన్నది కొందరి మేథావుల పరిశీలన. అలా మొదట నుంచి తెలుగు అనే మన ప్రాంతీయ భాషకి ఎప్పుడూ దక్కాల్సినంత గౌరవం, స్థాయి దక్కలేదు. ఉత్తరాదివారు దక్కనివ్వలేదు. ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకూ కొనసాగుతున్నదే.

కనీసం ప్రతిభకు, అత్యున్నత, అత్యుత్తమ మేలిమి సేవలకు కూడా లభించవలసిన గుర్తింపు, గౌరవం కూడా తెలుగువారు అందుకోలేకపోతున్నారన్నది కూడా అంతే వాస్తవం. దానికి మన తెలుగువాళ్ళు కూడా చేయని సాయం లేదు. ఏ తెలుగువాడు ఎందుకూ పనికిరాడని ప్రతీ తెలుగువాడికి గొప్ప నమ్మకం అన్న మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి మాట గానీ, మనవాళ్ళు ఒట్టి వెథవాయులోయ్ అనే మహాకవి గురజాడవారి మాటను గానీ ఎక్కడా పొల్లు పోకుండా కాపాడుకుంటూ రావడంలో మన తెలుగువారు మాత్రమే దేశం మొత్తం మీద సిద్ధహస్తులు.

mega star chiranjeevi

భానుమతి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావాలని అక్కినేని నాగేశ్వరరావుగారు ఎంత పట్టుబట్టినా, అప్పట్లో కేంద్రంలో చక్రం తిప్పుతున్న జైపాల్ రెడ్డిగారే అడ్డుపడ్డారని స్వయంగా నాతో చెప్పడం నాకు బాగా గుర్తు. దానికి అక్కినేని తీవ్రంగా మనస్తాపం చెందడం కూడా నాకు తెలుసు. అదీ మన వరస. అదే ఇతర రాష్ట్రాల వాళ్ళైతే అడ్డంగా వచ్చి మీదన పడిపోతారు. ఇంక ఎస్వీ రంగారావుగారు, సావిత్రిగారు నుంచి తీసుకుంటే ఎందరో మహా మహా అనుకున్నవాళ్ళెవరికీ పద్మశ్రీ కూడా చివరికి రాలేదు. అదీ మన తెలుగూస్ ప్రయోజకత్వం.

టాబూకి పద్మశ్రీ ఇచ్చినప్పుడు ఆర్ నారాయణమూర్తి బాహాటంగా మీడియా ముందే ఆవేశపడి, “ఆవిడకి ఎందుకు వచ్చిందో, జయసుధలాంటి వారికి ఎందుకు రాలేదో అర్ధం కాదు” అని బిగ్గరగానే మాట్లాడారు. బహుభాషా గాయకుడిగా, గంధర్వ గాయకుడిగా పూజలందుకున్న శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యంకి అంత లేటుగా పద్మ పురస్కారం ఎందుకు వచ్చిందో ఎవరూ వివరించలేరు. అది ఉత్తరాదిలో జరిగే ఇంద్రజాల మహేంద్ర జాలం. అసలు మన ప్రముఖుల చిత్రపటాలే లేవక్కడ అని ఒకసారి ఏదో కార్యక్రమానికి ముంబై వెళ్ళి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో మదనపడి మద్రాసు రాగానే మీడియా మీట్ నిర్వహించి మరీ చింతించారు. దాని ఫలితమే హిందీలో ఆయన చేసిన ప్రతిబంధ్ సినిమా. కసితో తెలుగువాళ్ళ దమ్మేంట్ చూపించాలని ఆయన చేసిన సినిమా విజయం ఉత్తరాదివారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది. కొమ్ములు విరిచేసింది.

ఇప్పుడు ఈ ఏటికి మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ వంటి అత్యున్నత ద్వితీయ పద్మ పురస్కారం లభించడం అన్నది కేవలం తెలుగువారికి ఆయన చేసిన ఘనసన్మానం కిందనే లెక్క. అంతటి మొనగాడు ఒకరు తెలుగు జాతిలో శిరసెత్తడం నిజంగా చిరస్మరణీయమైన ఘట్టంగా అబివర్ణిస్తాను. ఏదో ఒక కుంటిసాకుతో తెలుగువారిని పక్కకు నెట్టేయగలిగిన దమ్ము, గడుసుదనం, వ్యూహరచన పుష్కలంగా ఉన్నా, ఉత్తరాదివారు కూడా పావులు కదపలేక పోయినంత విశాలమైన పద్మవ్యూహంలోనుంచి పద్మవిభూషణ్ తో మరలి రాగలిగారు మన చిరంజీవి. అది ఆయన సాధించిన సుదీర్ఘకాల ఔన్నత్యానికి, ప్రశ్నించలేని ఘనతకు తార్కాణం అని చెప్పి ఒక్క క్షణం పొంగిపోదాం.

మన పక్కనే ఉండి, ఎప్పటికప్పుడు అత్యుత్తమ పురస్కారాలు, గౌరవాలు, బిరుదలు చాలా తేలికగా ఎత్తుకుపోయే తమిళ, కేరళ, కన్నడ రాష్ట్రాలు కూడా ఈసారి చిరంజీవిని పద్మవిభూషణ్ వరించడానికి వ్యతిరేకంగా ఎత్తులు వేయలేకపోయాయి. అది చిరంజీవి అసలుసిసలు ఎత్తు. ఆయనకు చేరువగా కూడా చాలా మంది పరభాషా నటశిరోమణులు రాలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని తప్ప మరొకరి గురించి ఆలోచించలేకపోయిన దట్టమైన, మన్నికైన గెలుపు సంతకాన్ని చిరంజీవి ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ నట, సాంఘిక జీవితంలో సాధించారు. ఆ సాధనే అందరినీ అధిగమించి, అయనకు Second Highest Civilian Award in the entire country, పద్మవిభూషణ్ ని ఇంటి తలుపు తట్టిమరీ ఇచ్చింది.

ఇంక ఆయనిప్పుడు భారతరత్నకి కేవలం ఒక్క మెట్టు దూరంలోనే ఉన్నారు. నిఖార్సయిన ఆయన ఘనతకు దాసోహమై, ఆయన అభిమానులమైన మేము ఆయనకి భారతరత్న రావాలని ఏనాటి నుంచో కలలు కంటూనే ఉన్నాం. మీడియాకి కూడా ఆయన డార్లింగే. మీడియా కూడా అందుకు అతీతం కాదని చెప్పగలిగే క్షణాలివి. అసలు నందమూరి తారకరామారావుకే భారతరత్న రావాలి అన్నది చాలా సులువైన పరిశీలిన, విశ్లేషణ. ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసి, హిందూ పురాణాలకు ఊపిరిపోసి, నిర్మాతగా, స్టూడియో అధినేతగా అరుదైన చరిత్రను నెలకొల్పి, తనదైన పార్టీని స్థాపించి, కేవలం 9నెలలోనే అధికార పీఠమెక్కిన ఒక ఛాంపియన్ కి ఎందుకు భారతరత్న రాలేదో అన్నేళ్ళు కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడే సమాధానం చెప్పాలి. ఎవరో పెట్టిన పార్టీలో సభ్యుడిగా చేరి, రాజకీయ పరిణామాల వైకుంఠపాళీలో ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగిన అతి సాధారణ పినీ కథానాయకుడు ఎంజి రామచంద్రన్ కి భారతరత్న ఎలా వచ్చిందో ఆ రహస్యం చిదంబరంగారి లాంటివారు విప్పిచెప్పాలి.

ప్రస్తుతం, చిరంజీవి విశ్వరూపం విశ్వంభర మొత్తం వ్యాపించి ఎవరూ ఆయనకు అందగలిగే ఏ అత్యున్నత పురస్కారాన్ని, భారతరత్నతో సహా, అడ్డుకోగలిగే దిక్కుమాలిన ధైర్యం, దమ్మూ ఉన్నవాళ్ళు భూతద్దం పెట్టి వెతికినా ఈ అతిపెద్ద ఉపఖండంలో లేరు. అది చిరంజీవి తనకు తాను రాసుకున్న ఒక మహా జీవన ప్రబంధం. చిరంజీవి విషయంలో ఎవరి పప్పులూ ఉడకవు. అప్రతిహతమైన ఆయన జీవితకాలపు ఘనతలను ఏ రాజకీయ సమీకరణాలు పక్కకు జరపలేవు. ఏ రాజ్యాంగ ప్రలోభాలూ సాహసం చేయలేవు. ఆయన ముందు, ఆయన సాధించిన సమున్నత శ్రేణికి ముందు విన్యాసాలు చేద్దామనుకున్నా ఏ పొడగరి అయినా మరుగుజ్జుగా మాత్రమే మిగిలిపోవడం ఖాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి