అంతా పూర్తయిపోయింది. ఒక మహాశకానికి సెలవు ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణగారికి యావత్ ప్రపంచం తుది వీడ్కోలు పలికింది. మహేష్ బాబు మానసిక స్థితి, తన ఆలోచనల గురించి తలుచుకుని అభిమానులు కలవరపడుతున్నారు. ఒకే ఏడాదిలో అన్నయ్య, తల్లి, తండ్రిని కోల్పోవడం కన్నా పెద్ద విషాదం ఎవరికైనా ఇంకేముంటుంది. అందులోనూ తాను ప్రాణంగా ప్రేమించే వాళ్లంతా ఇలా దూరమైతే తట్టుకోవడం సులభం కాదు. నిన్నా మొన్నటి దాక కుటుంబ బాధ్యతను మోసిన వాళ్ళు లేకపోవడంతో ఇక మొత్తం మహేష్ భుజాల పైనే ఉంటుంది. నాన్నకు తగ్గ వారసుడిగా ఇప్పటిదాకా తెచ్చుకున్న పేరు వేరు. ఇకపై దాన్ని మరింత సంక్లిష్టతతో మోయాల్సి ఉంటుంది.
ఇక సర్కారు వారి పాట పూర్తయినప్పటి నుంచి బాగా గ్యాప్ తీసుకున్న మహేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పటికే పలు బ్రేకులు వేసుకుంటూ వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్ బాగా రాలేదని ఒకసారి, స్క్రిప్ట్ విషయంలో ఏవో మార్పులు అవసరమయ్యాయని మరోసారి, హీరోయిన్ పూజా హెగ్డే డేట్లు దొరకడం ఇబ్బందిగా ఉందని ఇంకోసారి ఇలా రకరకాల కారణాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. వాటికి చెక్ పెడుతూ ఆ మధ్య ఒక చిన్న అప్ డేట్ ఇవ్వడం తప్ప నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఈలోగా ఇందిరాదేవి, కృష్ణ గార్ల మరణాలు జాప్యాన్ని అనివార్యం చేస్తూ వచ్చాయి. ఇవన్నీ ఎవరూ ఊహించని పరిణామాలే.
పరిస్థితిని గమనిస్తే 2023 ప్రారంభంలో తప్ప అంతకన్నా ముందే ఎస్ఎస్ఎంబి 28 రెగ్యులర్ షూట్ కి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ముందు మహేష్ పూర్తిగా కోలుకోవాలి. మునుపటిలా సిద్ధం కావాలంటే కొంత బ్రేక్ అవసరం. కనీసం నెల రోజులైనా లేకపోతే కోలుకోవడం కష్టం. అందుకే ఆ సంసిద్ధత కోసమైనా విరామం తీసుకోవాలి. పైగా వ్యక్తిగతంగా 2022 మహేష్ చాలా బ్యాడ్ ఇయర్ గా మిగిలిపోయింది. ఇంకొక్క నెలన్నర ఉంటే అయిపోతుంది. అప్పటిదాకా కామ్ ఉండటమే మంచిదని అభిమానులు కోరుతున్నారు. రిలీజ్ డేట్ గతంలో 2023 ఏప్రిల్ 28 ప్రకటించారు ఇప్పుడా అవకాశం లేదు. దసరా లేదా దీపావళికి టార్గెట్ పెట్టుకున్నా వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.