iDreamPost

మహిళపై పోలీసుల అరాచకం.. వైరల్​గా మారిన వీడియో!

  • Author singhj Published - 01:29 PM, Thu - 17 August 23
  • Author singhj Published - 01:29 PM, Thu - 17 August 23
మహిళపై పోలీసుల అరాచకం.. వైరల్​గా మారిన వీడియో!

నిరసన వ్యక్తం చేస్తున్న ఒక మహిళపై పోలీసులు అరాచకంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఆమె జట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో వారి మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు పోలీసులు ఈ ఘటనపై ఇచ్చిన సమాధానం అందర్నీ నివ్వెరపరుస్తోంది. మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని కత్నీ జిల్లా పరిధిలోని కౌరియా గ్రామంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తన పొలంలో కరెంటు స్తంభం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి పరిహారం అందలేదని ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ నిరసన వ్యక్తం చేసింది.

పరిహారం విషయంలో నిరసన వ్యక్తం చేసిన మహిళ తన వారితో కలసి విద్యుత్ స్తంభం ఏర్పాటును వ్యతిరేకించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అంతేగాకుండా కొందరు మహిళా పోలీసులు ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ స్త్రీ జట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన విజువల్స్ వైరల్ అయ్యాయి. దీంతో పోలీసు శాఖ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. వైరల్​గా మారిన వీడియోపై పోలీసు ఉన్నతాధికారి మనోజ్ కేడియా స్పందించారు. ఆమె విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేయనీయకుండా అడ్డుపడుతోందన్నారు.

కరెంట్ స్తంభం ఏర్పాటు చేయకుండా అడ్డుపడినందుకే ఆ మహిళను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని మనోజ్ కేడియా తెలిపారు. ఆ మహిళను పోలీసు సిబ్బంది కొట్టలేదని, తాము రూల్స్ ప్రకారమే వ్యవహరించామని చెప్పారు. అయితే ఆ వీడియో పాతదని చెప్పిన మనోజ్ కేడియా.. అది ఎప్పటిదో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే, తనతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై సీరియస్ అయిన మహిళ.. తన లాయర్​తో కలసి కలెక్టర్​ను ఆశ్రయించింది. విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కుమ్మక్కై కాంట్రాక్టర్లు తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించింది. తన మీద దాడి చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరింది.


 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి