Idream media
Idream media
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్‌డౌన్‌ను పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. అయితే లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్ జోన్లకే పరిమితం చేసింది. మిగతా ప్రాంతాల్లో ఇప్పటి వరకూ పరిమితులు ఇచ్చిన వాటికి పచ్చజెండా ఊపింది. షాపింగ్ మాల్స్, ఇతర సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు మినహాయింపులు ఇచ్చింది.
జూన్ 8 నుంచి ఈ సడలింపులు వర్తిస్తాయని పేర్కొంది. గతంలో రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. తాజాగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫూ కొనసాగుతుందని ప్రకటించింది. సినిమా హాళ్లు, విద్యా సంస్థలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్కులు, పబ్బులు, ఆడిటోరియాలు, జిమ్ములు, బార్లు, సినిమా హాల్లు, మెట్రో రైళ్ల సర్వీసులపై ఆంక్షలు కొనసాగనున్నాయి.
కరోనా కట్టడికి మార్చి 24వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పలు దఫాలుగా నాలుగు సార్లు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రేపటితో నాలుగో విడత లాక్‌డౌన్ గడువు ముగుస్తుండడంతో తాజాగా దాన్ని మరింతగా పోడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు పూర్తి ఆంక్షలతో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోంది. తాజాగా కంటైన్‌మెంట్ జోన్లకే లాక్‌డౌన్‌ను పరిమితం చేసిన బీజేపీ ప్రభుత్వం.. మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. మరో వైపు లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వడం గమనార్హం.