iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికల ‘రాజకీయం’ మళ్లీ మొదలు కాబోతోందా..?

స్థానిక సంస్థల ఎన్నికల ‘రాజకీయం’ మళ్లీ మొదలు కాబోతోందా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కరోనా వైరస్‌ కేసు కూడా నమోదు కాని సమయంలో జెట్‌ స్పీడ్‌తో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కరోనా పేరు చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాయిదా వేసిన తర్వాత జరిగిన రాజకీయం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జరపాలని కోరుతూ 2019 సెప్టెంబర్‌లో దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు విచారణ జరగడం విశేషం. ప్రస్తుత కరోనా సమయంలో ఎన్నికలు జరపలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు సైతం జరుగుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యనించింది. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయం తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది.

మార్చి 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా నామినేషన్‌ ప్రక్రియ ముగిసి మరో 14 రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయనుకుంటున్న తరుణంలో ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాయిదా వేశారు. ఆర్థిక ఏడాది ముగిసే లోపు ఎన్నికలు జరపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండగా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. ఎన్నికల కమిషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఈ విషయంలో పెద్ద వివాదమే నడిచింది. ఈ వివాదం కోర్టుల వరకూ వెళ్లింది. ఎన్నికల సంస్కరణలతో నిమ్మగడ్డ పదవి పోగా.. ఆ తర్వాత న్యాయ స్థానాల్లో జరిగిన పరిణామాలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. టీడీపీ నాయకులతో కలసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సాగించిన రాజకీయ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

Read Also: బుచ్చయ్యగారు గతం మరచిపోయారా..?

ఎన్నికల వాయిదాతో స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగించడం అనివార్యమైంది. వచ్చే ఏడాది జనవరి వరకూ ఏపీలోని పంచాయతీ, పట్టణ సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల పూర్వ పరిణామాలు ఇలా ఉండగా.. ఇప్పుడు ఈ అంశంపై జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్‌కు మధ్య మళ్లీ బేదాభిప్రాయాలు నెలకొనే అవకాశం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనగా.. హైకోర్టు నోటీసులకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమని సమాధానం ఇస్తుందన్నది సర్వత్రా ఆసక్తిని రేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్‌ కూడా నడిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనని అంటే మాత్రం మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా రాజకీయ క్రీడకు తెరలేచినట్లేననే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

Read Also: కోర్టు ధిక్కారం కేసు.. సీబీఐకి వెళ్లబోతోందా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి