iDreamPost

KCR సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌.. వారి జీతాలు భారీగా పెంపు..

  • Published Aug 30, 2023 | 8:55 AMUpdated Aug 30, 2023 | 8:55 AM
  • Published Aug 30, 2023 | 8:55 AMUpdated Aug 30, 2023 | 8:55 AM
KCR సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌.. వారి జీతాలు భారీగా పెంపు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. కేసీఆర్‌ సర్కార్‌.. ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా.. పథకాలు అమలు చేస్తున్నారు. ఇక కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడమే కాక.. పలు శాఖల్లో పని చేస్తోన్న ఉద్యోగుల జీతాలను భారీగా పెంచడం.. పీఆర్‌సీ అమలు చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా కేసీఆర్‌ సర్కార్‌.. మరో వర్గం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి వేతనాలు భారీగా పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. ఆ వివరాలు..

రాష్ట్రంలోని అర్చకులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. అర్చకుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం కింద అందజేస్తోన్న గౌరవ వేతనాన్ని.. రూ. 6000 నుంచి రూ.10,000కు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్‌కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఉమ్మడి పాల‌న‌లో అర్చకుల‌కు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్రమే గౌరవం వేతనంగా అందించేవారు. ఇంత తక్కువ జీతంతో అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన సీఎం కేసీఆర్ వారి వేత‌నాన్ని రూ. 6,000కు పెంచార‌ని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి గుర్తు చేశారు.

ఇక కేసీఆర్‌ ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామ‌ంటూ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు తాజాగా వేతనాలు పెంచుతూ.. ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అర్చకుల వేతనం పెంచుతూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమ‌న్నారు. ఇక గ‌తంలో 1,805 ఆల‌యాల‌కు మాత్రమే ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు చేస్తే.. ద‌శల వారీగా ఈ ప‌థ‌కాన్ని మ‌రిన్ని ఆల‌యాల‌కు వర్తింప‌ చేస్తున్నామని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 6,541 దేవాల‌యాల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని వెల్లడించారు. ధూప దీప నైవేద్య పథకానికి సంవత్సరానికి రూ.78. 49 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి