iDreamPost

కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే-తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్

కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే-తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్

తాలిబాన్‌లతో అమెరికా జరుపుతున్న చర్చల ప్రక్రియలో భారత్ కూడా భాగస్వామి కావాలని అగ్రరాజ్యం కోరుకుంటున్న వేళ తాలిబాన్ కీలక ప్రకటన చేసింది.తాలిబన్‌ రాజకీయ విభాగంగా పనిచేసే ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ మీడియా అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని ప్రకటించాడు.ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్‌ స్పష్టం చేసింది.అలాగే కాశ్మీర్‌లో జిహాద్ (పవిత్ర యుద్ధం) పేరిట దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదానికి తాము మద్దతివ్వనున్నట్లు వస్తున్న వార్తలను కూడా తాలిబన్ మీడియా ప్రతినిధి ఖండించాడు.

కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు తమకు భారత్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాలిబన్ మీడియా ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ వార్తపై తాలిబన్ ప్రతినిధి స్పందిస్తూ సుహైల్‌ షాహీన్‌ అలాంటిదేమీ లేదని, పొరుగు దేశాల అంతర్గత అంశాలలో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని ప్రకటించారు. మీడియాలో వెలువడుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, తాము ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేమీ చేయలేదని తాలిబన్ ప్రతినిధి స్పష్టం చేశారు.కాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్తపై దర్యాప్తు చేపట్టిన భారత ప్రభుత్వం కూడా ఇది నకిలీ వార్తని తాలిబన్‌ ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చింది.

రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్లతో అమెరికా తరపున చర్చలు జరుపుతోన్న ప్రతినిధి జల్మాయ్ ఖలీల్‌జాద్ ఢిల్లీలో పర్యటించారు.ఈ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి జై శంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం భారత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాలిబన్లతో భారత్ కూడా నేరుగా చర్చలు జరపటం అవసరమని భారత ప్రభుత్వానికి జల్మాయ్ సూచించారు.  

భారతదేశం కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో హింస పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా తాలిబన్‌ల మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతునిచ్చింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో పార్లమెంటు భవనంతో పాటు,భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన భారత్ ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామి అయింది. తాజాగా తాలిబన్‌లు చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి