iDreamPost

టీడీపీ తరువున విజయనిర్మల పోటీచేశారా?కృష్ణ మద్దతు ఇచ్చారా?

టీడీపీ తరువున విజయనిర్మల పోటీచేశారా?కృష్ణ మద్దతు ఇచ్చారా?

కైకలూరు – కొల్లేటి రాజధాని… చారిత్రికంగా వడ్డి రాజుల కొల్లేటి కోట ప్రాంతం.. 90 వ దశకం నుంచి చేపల చెరువులకు కేంద్రం… రాజకీయంగా పెద్దగా పేరు లేని నియోజకవర్గం కానీ అనేక ప్రత్యేకతలు ఉన్న నియోజకవర్గం …

2014 లో టీడీపీ మిత్రపక్షంగా బీజేపీ తరుపున గెలిచి మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ గెలిచింది కైకలూరు నుంచే … టీడీపీ ఆవిర్భావం తరువాత 1983,1985,1994 .. మూడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వొచ్చినా ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రెండే రెండు నియోజకవర్గాలలో 1983-1994 మధ్య జరిగిన నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలవలేక పోయింది.. అవి కైకలూరు , డోర్నకల్ … ఈ రెండిటిలో కూడా కైకలూరు నుంచి కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ తరుపున గెలవగా,డోర్నకల్లో 1983,1985 ఎన్నికల్లో సురేందర్ రెడ్డి మరియు 1989 & 1994 ఎన్నికల్లో రెడ్యా నాయక్ గెలిచారు…

బహుశా ఈ లెక్కను దృష్టిలో పెట్టుకొనే 1999 ఎన్నికల్లో కైకలూరు నుంచి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో సూపర్ స్టార్ కృష్ణ శ్రీమతి విజయ నిర్మలను చంద్రబాబు టీడీపీ తరుపున కైకలూరులో పోటీచేయించాడు.. కానీ ఆవిడ ఓడిపోయారు.. చంద్రబాబు కైకలూరు ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటానికి ఒక కారణం ఉంది 1993 మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో చంద్రబాబు అన్నీతానై “ఎలక్షనీరింగ్” అన్న పదానికి అర్ధం చెప్పేలా కైకలూరులో పనిచేసి టీడీపీ అభ్యర్థి ఎర్నేని రాజా రామచంద్రరావ్ (రాజబాబు) ను గెలిపించాడు కానీ 1994 ఎన్నికల్లో మాత్రం రాజా బాబు ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి నంబూరి వెంకట రామరాజు (రాము) గెలిచాడు.. అందుకే 1999 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎన్టీఆర్ పాలనను విమర్శిస్తూ ఎన్నో సినిమాలు తీసిన విజయ నిర్మలను టీడీపీ తరుపున బరిలోకి దించాడు. ఆ వివరాలలోకి వెళ్లేముందు 1993 ఉప ఎన్నిక పూర్వాపరాలు తెలుసుకోవాలి…

కనుమూరి బాపిరాజు రాజీనామా

కైకలూరు నుంచి 1978లో స్వతంత్ర అభ్యర్ధిగా 46 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన కనుమూరి బాపిరాజు కాంగ్రెసులో చేరి 1983,1985,1989 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వరుసగా గెలిచారు. 1989 కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తరువాత చెన్నారెడ్డి,నేదురుమల్లి జనార్దన్ రెడ్డి,కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి మద్యపాన నిషేధ ఉద్యమం తీవ్రంగా జరుగుతుంది. ఆయన మంత్రివర్గంలో కనుమూరి బాపిరాజు ఎక్సయిజ్ మంత్రిగా ఉండేవారు.

12 డిస్ట్రీలరీస్ మరియు 12 బ్రూవరీస్ కి అనుమతులు ఇచ్చిన వ్యవహారంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రే లక్ష్యంగా ఆరోపించాయి.ఆ ఆరోపణల పరంపరలో కనుమూరి బాపిరాజు స్వయంగా రాజీనామా చేసాడు. ఎక్సయిజ్ మంత్రిగా నాదే బాధ్యత అని విచారణ పూర్తయ్యే వరకు ఏ పదవి స్వీకరించను అని ప్రకటించి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసాడు.

ముఖ్యమంత్రి కోట్ల,ఇతర సీనియర్ నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చిన రాజీనామా వెనక్కి తీసుకోలేదు. బహుశా నైతిక బాధ్యతతో అది కూడా ఎమ్మెల్యే పదవితో సహా రాజీనామా చేసిన చివరి నాయకుడు బహుశా బాపి రాజే కావొచ్చు.

Also Read:  అచ్చెం నాయుడికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఎలా వొచ్చింది?

బాపిరాజు రాజినామతో కైకలూరుకు,నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి మరణంతో కోవూరుకు 1993 మే నెలలో ఉప ఎన్నికలు జరిగాయి. కైకలూరు నుంచి కాంగ్రెస్ తరుపున నంబూరి వెంకట రామ రాజు(రాము ),టీడీపీ తరుపున ఎర్నేని రాజా రామచంద్రరావు (రాజా బాబు ) పోటీపడ్డారు.

కోవూరులో నల్లపురెడ్డి శ్రీనయ్య కొడుకు ప్రసన్న కుమార్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవటంతో ఆయన టీడీపీ తరుపున పోటీచేశాడు. ఈ రెండు సీట్లు గెలవటం ముఖ్యమంత్రి కోట్లకు ప్రతిష్టాత్మకం అయ్యింది. మరో వైపు 1994 సాధారణ ఎన్నికలు మరో 18 నెలలో ఉండటంతో ఈ ఉప ఎన్నికలు గెలిచి సత్తా చాటాలని టీడీపీ శాయశక్తులు ఒడ్డి పోరాడింది.

ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాలలో టీడీపీ తరుపున చంద్రబాబే బాధ్యత తీసుకున్నారు. డబ్బు ప్రభావం పెద్దగా లేని ఆ రోజుల్లో ప్రచారం, నాయకులను మేనేజ్ చేయటం, పోలింగ్ రోజు దగ్గర ఉండి పోలింగ్ బూతులు తీసుకెళ్లి ఓట్లు వేయించుకోవటం విజయ రహస్యం. చంద్రబాబు ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలు చేసి కైకలూరు, కోవూరు రెండు స్థానాలలో టీడీపీని గెలిపించాడు.

ఆ విధంగా కైకలూరులో తొలిసారి టీడీపీ గెలిచింది,రాజ బాబు తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు.

1991లో టీడీపీ తరుపున నర్సాపురం లోక్ సభకు గెలిచిన సీనియర్ నాయకుడు భూపతిరాజు విజయ కుమార్ రాజు పీవీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో టీడీపీ నుంచి బహిష్కరించారు.. 1993 కైకలూరు ఉప ఎన్నికల్లో భూపతిరాజు విజయకుమార్ రాజు మద్దతుతో కాంగ్రెస్ టికెట్ దక్కింది.

ఎర్నేని కుటుంబం
ఎర్నేని రాజబాబు సొంత గ్రామం కొండూరు సర్పంచిగా రాజకీయ జీవితం మొదలు పెట్టాడు. 1981లో కైకలూరు సమితి అధ్యక్షుడయ్యారు. రాజబాబు కన్నా ముందు కైకలూరు సమితి అధ్యక్షుడిగా నంబూరి రాము బాబాయి బద్రి రాజు సమితి అధ్యక్షుడిగా చేసారు.

రాజబాబు సొంత తమ్ముడు ఎర్నేని నాగేంద్రనాథ్ స్వయంగా ఒక రైతు సంఘం స్థాపించి రైతు సమస్యల మీద స్పందిస్తుంటారు. నాగేంద్రనాథ్ శ్రీమతి సీతాదేవి ముదినేపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పలుసార్లు ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి గా కూడా పనిచేశారు.

ముదినేపల్లిలో కాంగ్రెస్ తరుపున పిన్నమనేని కుటుంబం , టీడీపీ తరుపున ఎర్నేని కుటుంబం అనేకసార్లు తలపడ్డాయి. 2009లో ముదినేపల్లి నియోజకవర్గం రద్దుకావటంతో సీతాదేవికి పోటీచేసే అవకాశం రాలేదు. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. పిన్నమనేని వెంకటేశ్వర రావ్ కు మాత్రం కాంగ్రెస్ గుడివాడ నుంచి అవకాశం ఇచ్చింది కానీ ఆయన గెలవలేదు. 2014లో టీడీపీ తరుపున పోటీచేసి కూడా కొడాలి నాని చేతిలో పిన్నమనేని ఓడిపోయాడు. 2019లో పోటీచేసే అవకాశం రాలేదు. ఆ విధంగా కృష్ణా జిలా రాజకీయాలను రెండు దశాబ్దాలు శాసించిన పిన్నమనేని కోటేశ్వర రావ్(వెంకటేశ్వరరావు తండ్రి) కుటుంబ రాజకీయ జీవితం ముగిసింది.

2004లో వైయెస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కృష్ణా ,గుంటూరు జిల్లాల్లో కార్పొరేషన్ పదవుల మీద పీఠముడులు పడ్డప్పుడు పిన్నమనేని కోటేశ్వర రావ్ మధ్యవర్తిత్వం చేసాడు. గుంటూరు మేయర్ కోసం రాయపాటి,కన్నా కొడుకుల కోసం పోటీపడ్డప్పుడు కోటేశ్వర రావు రాజీ చేసాడు. వెంకటేశ్వర రావు వైయస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు .

Also Read:  రాసి పెట్టుకో జగన్ అనేంత ధైర్యం,ఉమాకు ఎలా వొచ్చింది? దేవినేని సోదరుల రాజకీయ ప్రస్థానం

1999 ఎన్నిక విజయనిర్మల రంగ ప్రవేశం

1993 ఉప ఎన్నికలో గెలిచిన రాజబాబు 1994 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన నంబూరి రాము కాంగ్రెస్ తరుపున గెలిచాడు. స్వతహాగా ఉన్న మంచి పేరుతో పాటు,18 నెలల కిందట ఓడిపోయిన సానుభూతి కూడా నంబూరి రాముకు కలిసొచ్చింది.

1999 ఎన్నికలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎదుర్కొన్న తొలి ఎన్నికలు. రాజకీయాల్లోకి తటస్థులు రావాలన్న నినాదంతో డబ్బున్న వారికి విరివిగా టికెట్స్ ఇచ్చాడు. అప్పటివరకు రాజకీయనాయకులకు పెట్టుబడి దారులుగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, ధనిక డాక్టర్లు, లాయర్లు ఇలా అనేక మందికి 1999 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం వొచ్చింది.

1994 టీడీపీ సునామీలో కాంగ్రెస్ కేవలం 26 స్థానాలే గెలిచింది. కృష్ణా జిల్లాలో రెండు సీట్లు మాత్రమే గెలిచింది. టీడీపీ నాయకుడు కోగంటి సత్యం తనకు టికెట్ రాకపోవటంతో తన సోదరుడిని రెబల్ గా పోటీకి దించి టీడీపీ అభ్యర్థి జయరాం తో పోటాపోటీగా 27500 ఓట్లు సాధించటంతో వంగవీటి రత్న కుమారి 16 వేల మెజారిటీతో గెలిచింది. కైకలూరులో నంబూరి రాము టీడీపీ రాజబాబు మీద 5,500 మెజారిటీతో గెలిచాడు.

1994లోనే గెలవలేని రాజ బాబు 1999లో ఏమి గెలుస్తాడు అనుకున్న చంద్రబాబు సహజంగానే ఆయనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ వ్యతిరేకులుగా ముద్రపడ్డ సూపర్ స్టార్ కృష్ణ శ్రీమతి విజయనిర్మలను బరిలోకి దించారు. విజయ నిర్మల కూడా ఎన్టీఆర్ పాలనను తూర్పారపడుతూ అనేక సినిమాలు నిర్మించి, నటించటం గమనార్హం.

విజయనిర్మలకే ఎందుకు టికెట్ ఇచ్చారు?
కైకలూరులో బాపిరాజు వరుసగా నాలుగుసార్లు,రాము ఒకసారి గెలిచినా అక్కడ క్షత్రియ ఓటర్ల సంఖ్య తక్కువ.మత్స్యకార,వడ్డిక, కమ్మ, కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. కాపు సామాజిక వర్గానికి చెందిన కమ్మిలి అప్పారావ్ 1955,1962లో గెలిచి 1967లో ఓడిపోయారు. 1972 ఎన్నికల్లో అప్పారావ్ శ్రీమతి మంగతాయారమ్మ గెలిచింది. 1978 నుంచి బాపిరాజు హవా మొదలైంది. కమ్మిలి అప్పారావ్ కొడుకు విఠల్ రావ్ ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశాడు.ఇప్పటికి కొంత అనుచరవర్గం ఉంది.

కమ్మ సామాజిక వర్గ ఓట్లు సహజంగానే టీడీపీకి ఎక్కువ పడతాయి కాబట్టి విజయ నిర్మల పోటీచేస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా పడతాయని సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు , రామానాయుడు, అప్పటి టీడీపీ నేత కామినేని శ్రీనివాస్ తదితరులు భావించి విజయనిర్మల ను ఒప్పించి పోటీకి దించారు.

కైకలూరు నియోజక వర్గం ఏలూరు లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఏలూరు లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున కృష్ణ 1989లో గెలిచి 1991లో ఓడిపోయారు. కృష్ణ కు ఆ ఎన్నికల్లో పనిచేసిన వారిలో ముఖ్యులు కొంతమంది పార్టీకి అతీతంగా విజయనిర్మల విజయానికి తోడ్పతారని కూడా చంద్రబాబు భావించి ఉండవచ్చు.

టీడీపీ టికెట్ రాని రాజబాబు రెబల్ అభ్యర్థిగా పోటీకి దిగాడు. కాంగ్రెస్ తరుపున నంబూరి రాము పోటీచేశారు. కైకలూరులో అప్పటి వరకు కులం పేరుతో ప్రచారం జరిగింది లేదు.ఆ ఎన్నికల్లో కులసమీకరణలు స్థానికులను ఆశ్చర్యపరిచాయి. మరో వైపు విజయనిర్మల కోసం కృష్ణ ప్రచారం చేయలేదు కనీసం ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు. టీడీపీ తరుపున జయసుధ(విజయనిర్మల మేనకోడలు), రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ తో సహా అనేకమంది నటీనటులు ప్రచారం చేశారు. కామినేని శ్రీనివాస్ రావ్ కూడ సినిమా రంగంతో సంబంధాలు ఉన్న మనిషే. కామినేని శ్రీనివాస్ మేన కోడలిని హీరో వెంకటేష్ పెళ్లి చేసుకున్నారు. అటు రాజకీయంగా కూడా సీనియర్ నేత మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు,గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసిన యడ్లపాటి వెంకట్ రావ్ కామినేని కి మేన మామ… ఈ సంబంధాల వలన కైకలూరులో కామినేని హవా నడిచేది.

ఎంతమంది ప్రచారం చేసినా,కులం ,డబ్బు కూడా కలిసిరాక విజయనిర్మల ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన రాజబాబు గెలిచాడు.. సానుభూతి కారణం.. ఆ విధంగా విజయనిర్మల జీవితంలో పోటీచేసిన ఏకైక ఎన్నికలో ఓడిపోయారు..

ఆ ఎన్నికల్లో రాజబాబు “కుర్చీ” గుర్తు మీద గెలచి కుర్చీ ఎక్కాడు అని కైకలూరు వాసులు కామెంట్ చేశారు.

Also Read:  వైస్సార్ ఓటమి అంచుల వరకు వెళ్లిన 1996 లోక్ సభ ఎన్నిక

2004 తరువాత కైకలూరు రాజకీయాలు
1999లో ఇండిపెండెంట్ గా గెలిచిన రాజబాబు కాంగ్రెసుతో కలిసి పనిచేశారు. 2004లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి 2009లో ఓడిపోయారు.ఆ తరువాత స్తబ్దుగా ఉండిపోయారు. రాజబాబు మొన్న 17-May-2020 న చనిపోయారు.

కామినేని శ్రీనివాస్ చంద్రబాబుకు,వెంకయ్య నాయుడికి అత్యంత సన్నిహితడైన ఆయనకు టీడీపీ టికెట్ దక్కకపోవడం ఆశ్చర్యం. 2009లో ప్రజారాజ్యం తరుపున పోటీచేసిన కామినేని శ్రీనివాస్ టీడీపీ అభ్యర్ధీ మత్స్యకార వర్గానికి చెందిన జయమంగళం వెంకట రమణ మీద ఓడిపోయాడు.

కైకలూరు నియోజకవర్గంలో కొల్లేటి లంకలు చాలా ఉన్నాయి. సంఖ్యా పరంగా కూడా మత్స్యకార,వడ్డిక వర్గానికి చెందినవారు ఎక్కువ. తనకు సన్నిహితుడై కూడా టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరాడన్న కోపంతోనే అప్పటి వరకు ఎప్పుడు టికెట్ ఇవ్వని కొల్లేటి లంకవాసి, వడ్డిక కులానికి చెందిన జయమంగళం వెంకట రమణకి చంద్రబాబు టికెట్ ఇవ్వటం అతను గెలవటం జరిగింది. అంటే 1993 ఉప ఎన్నికను వొదిలేస్తే టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన ఏడో ఎన్నికల్లో కైకలూరులో తొలిసారి గెలిచినట్లు. ఆ ఎన్నికల్లో కామినేని శ్రీనివాస్ గెలుపు ఖాయం అనుకున్నా హోరా హోరి పోరులో 974 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

2014 లో బీజేపీ తో పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాస్ ను బీజేపీలో చేర్చి టికెట్ ఇచ్చారు.. గెలిచిన తరువాత మంత్రి కూడా అయ్యారు.. ఆ విధంగా బాపిరాజు మంత్రి పదవికి రాజీనామా చేసిన 21 సంవత్సరాల తరువాత కైకలూరుకు మంత్రి పదవి దక్కింది.

మొన్న 2019 ఎన్నికల్లో కైకలూరులో వైసీపీ తరుపున దూలం నాగేశ్వర రావ్ గెలిచాడు. వాస్తవానికి వైసీపీ తరుపున 2014ల్లో కూడా దూలం నాగేశ్వర్ రావ్ కు గెలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికలకు నెల ముందు జరిగిన ఒక గొడవ వలన దూలం నాగేశ్వర రావ్ ను తప్పించి ఉప్పల రామ్ ప్రసాద్ కి వైసీపీ టికెట్ ఇచ్చారు. ఉప్పల రామ్ ప్రసాద్ అప్పటి పెడన నియోజకవర్గం సీటు కోసం పనిచేశాడు .

యువ తరానికి అవకాశం వయస్సు రీత్యా కామినేని శ్రీనివాస్ మరోసారి పోటీచేయకపోవచ్చు.. మొన్న ఓడిపోయిన జయమంగళం వెంకట రమణకు కూడా మరోసారి టీడీపీ టికెట్ రాకపోవచ్చు.. కైకలూరులో కొత్త నాయకుల అవకాశం ఉంది..

తూర్పు కృష్ణ జిల్లా రాజకీయాలను శాసించిన పిన్నమనేని కోటేశ్వర రావ్,మండలి కృష్ణ రావ్, బూరగడ్డ నిరంజన్ రావ్,ఎర్నేని కుటుంబాల రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే. ఈ కుటుంబాల నుంచి మూడో తరం రాజకీయాలలోకి వొచ్చినా వారు నియోజకవర్గాన్ని దాటి జిల్లా స్థాయికి ఎదగటం వొచ్చే రెండు దశాబ్దాలలో జరిగే అవకాశం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి