iDreamPost

ఎమోషన్లతో మెప్పించిన ఫామిలీ డ్రామా – Nostalgia

ఎమోషన్లతో మెప్పించిన ఫామిలీ డ్రామా – Nostalgia

2001 సంవత్సరం. భారీ అంచనాలతో నిర్మాణంలో ఉన్న హిందీ సినిమా కభీ ఖుషి కభీ ఘం విడుదలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకు ఓ కీలక సమాచారం అందింది. డిసెంబర్ 14న విడుదల తేదీని ఖరారు చేస్తూ సెన్సార్ చేసుకున్న థియేటర్ కాపీ నిడివి 3 గంటల 27 నిమిషాలకు లాక్ చేశామని నిర్మాతలు అందులో పేర్కొన్నారు. ఇది తెలియగానే పెద్ద షాక్. అంటే ఇంటర్వల్ పావు గంటతో కలుపుకుంటే మొత్తం 225 నిముషాలు అవుతుంది. ఇంత లెన్త్ తో రోజుకు నాలుగు ఆటలు వేయడం దాదాపు అసాధ్యం. ప్రతి షోకు అదనంగా 45 నిమిషాల నిర్వహణ భారం పడుతుంది. ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉందాని నిర్మాత కం దర్శకుడు కరణ్ జోహార్ కు వర్తమానం పంపించారు. అతను ససేమిరా అన్నాడు. ఒక్క నిమిషం కూడా కట్ చేసే ప్రసక్తే లేదని చెప్పేశాడు. ఎవరికీ మాట్లాడే ఛాన్స్ లేదు. కోట్ల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

దాని మీద నెలకొన్న క్రేజ్ దృష్ట్యా ఎగ్జిబిటర్ల నుంచి పంపిణీదారుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. అమితాబ్ బచ్చన్ – షారుఖ్ ఖాన్ – హృతిక్ రోషన్ ఇలా మూడు తరాలకు చెందిన ఐకాన్ స్టార్లను ఒకేసారి తెరమీద చూడటం కన్నా ప్రేక్షకులకు కావాల్సింది ఏముంది. దానికి తోడు జయా బచ్చన్, కాజోల్, కరీనా కపూర్ లిస్టు చదువుతుంటేనే ఎవరికీ కాళ్ళు ఆగడం లేదు. సో రోజుకు మూడు ఆటల ప్రకారం ఈ సినిమా వేసేందుకు అధిక శాతం థియేటర్లు ముస్తాబయ్యాయి. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేలా చాలా చోట్ల ప్లానింగ్ జరిగింది. టికెట్ రేట్లు పెరిగిపోయాయి. బ్లాక్ మార్కెట్ రెక్కలు విచ్చుకుంది. అతి పెద్ద ఓపెనింగ్ కు రంగం సిద్ధమయ్యింది. అలా డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా కభీ ఖుషి కభీ ఘం రూపంలో చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప ఓపెనింగ్ దక్కింది.

ఇదో ఉమ్మడి కుటుంబం కథ. దత్తత తీసుకున్న కొడుకు రాహుల్(షారుఖ్) ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో తండ్రి(అమితాబ్) అతన్ని వద్దనుకుంటాడు. దీంతో రాహుల్ భార్య(కాజోల్)ను తీసుకుని లండన్ వెళ్ళిపోతాడు. ఆ టైంలో హాస్టల్ లో ఉన్న రెండో కొడుకు రోహన్( హృతిక్)అందరిని కలిపే బాధ్యత తీసుకుంటాడు. తర్వాత ఏం జరిగిందనేదే అసలు స్టోరీ. బరువైన ఎమోషన్లు, హాయిగా అనిపించే పాటలు, మైమరిపించే క్యాస్టింగ్ వెరసి ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ కభీ ఖుషి కభీ ఘం అంచనాలకు తగ్గట్టే మంచి విజయం నమోదు చేసుకుంది. హం ఆప్కే హై కౌన్ స్థాయిలో కాకపోయినా కరణ్ ని ఫ్యామిలీ డైరెక్టర్ ని మరోసారి గొప్పగా ఆవిష్కరించింది. జతిన్ లలిత్-సందేశ్-ఆదేశ్ సంయుక్తంగా అందించిన పాటలు ఇప్పటికీ గొప్ప ఆడియో విన్న అనుభూతిని కలిగిస్తాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి