idream media
idream media
చదువుల ఒడి రక్తమోడుతోంది. కసాయి మూకల చిక్కి విలవిల్లాడుతోంది. అత్యున్నత విద్యాసంస్థలో చీకటి వేళ చెలరేగిన ముఠాలు తమ నైజాన్ని చాటుకున్నాయి. ముఖానికి ముసుగులు ధరించిన దుండగులు దర్జాగా చెలరేగిపోయారు. ముందస్తు వ్యూహాలతో విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. ఇది విద్యార్థులపై జరిగిన దాడి ఎంత మాత్రం కాదు. భారతీయతపై జరిగిన దాడి. మహోన్నత భారతీయ విలువలపై పెరుగుతున్న దాడి. గడిచిన నాలుగైదేళ్లుగా జేఎన్యూని చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో విఫలమవుతున్న శక్తులు తమ అసలు స్వరూపం చూపించిన సందర్భం.
దేశమంతా విద్యార్థి లోకం విజృంభిస్తోంది. కెరీరిజంలో యువత కొట్టుకుపోతోందనే నైరాశ్యం సర్వత్రా వ్యాపించిన వేళ సామాజిక స్పృహతో నవతరం ముందుకొస్తోంది. సుదీర్ఘకాలం తర్వాత చైతన్యపూరిత ఉద్యమ జ్వాల రగిలిస్తున్నారు. సామాజిక సమస్యలపై స్పందిస్తున్నారు. ఒకనాటి అనుభవం మాదిరిగానే ఇప్పుడు క్యాంపస్ లో ఉద్యమ కార్యాచరణకు కేంద్రాలవుతున్నాయి. ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమం కూడా తొలుత అక్కడే పుట్టింది. ఇప్పుడు దేశమంతా వ్యాపించింది. హైదరాబాద్ వంటి నగరాల్లో మిలియన్ మార్చ్ వరకూ ఉధృతమవుతోంది.
యువత ఎంతగా కదిలితే పాలకపక్షాల పీఠంలో అంత వేగంగా కదలిక వస్తుందన్నది చారిత్రక అనుభవం. యువతరం గళమెత్తితే అన్నట్టుగా వారే గొంతు విప్పితే ఆ స్వరం భాస్వరంగా మారుతుందన్నది సత్యం. అందుకే ఇప్పుడు ఎగిసిపడుతున్న ఉద్యమ కెరాటాల తాకిడికి ఆధిపత్యం అల్లాడిపోతోంది. తమకు ఎసరుపెట్టే స్థాయికి వస్తుందని కలవరపడుతోంది. దాంతో ఇక సహించలేని తత్వం వచ్చేసినట్టు కనిపిస్తోంది. అనాగరికంగా గోసంరక్షక దళాల పేరుతో అనేక మంది సామాన్యులను మట్టుపెట్టిన అనుభవంతో ఇప్పుడు అన్ని చోట్లా మంటలు పెడుతోంది. ఇప్పుడు హస్తినలో కూడా అధికారం అండతో చెలరేగిపోయిందనే వాదన వినిపిస్తోంది. దేశంలోనే ఉన్నత యూనివర్సిటీలో క్యాంపస్ బయట పోలీసులు కాపలా ఉంటే, లోపల అన్ని గేట్లు మూసివేసి ఆడపిల్లలను సైతం వదలకుండా రక్తమొచ్చేలా గాయాలు చేశారంటే విద్యార్థి వెల్లువతో వారెంత కలవరపడుతున్నారో అర్థమవుతోంది.
తొలుత మోరల్ పోలీసింగ్ అంటూ వారు అప్పుడప్పుడూ వాలెంటైన్స్ డే పేరుతో వచ్చే వారు. ఆ తర్వాత అధికారం తమకు అండగా ఉందని తెలిసిన తర్వాత గోరక్షక దళమనే ముసుగులో మూక దాడుల ముఠాల రూపం దాల్చారు. ఇటీవల యూపీలోని పలుచోట్ల పోలీసుల రూపం కూడా దాల్చి పట్టపగలే కెమెరాల సాక్షిగా సిద్ధమయిపోయారు. మీరట్ జిల్లా ఎస్పీ అయితే నేరుగా మీరు పాకిస్తాన్ పోండి అంటూ ఆందోళనకారులను బెదిరిస్తుంటే అధికారపార్టీ కార్యకర్తలే లాఠీలు చేతబట్టి సామాన్యులను చితకబాదిన వైనం అనాగకరిక ముఠాల అరాచకం ప్రజ్వరిల్లుతోందనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకనాడు హైకోర్ట్ ముందు కన్నయ్య మీద దాడికి పాల్పడిన నాటి నుంచి చూస్తే ఇప్పుడు నేరుగా క్యాంపస్ లోకి చొరబడిన తీరు దేశంలో దిగజారుతున్న పరిణామాలను చాటుతోంది. ఇలాంటి పోకడలను అడ్డుకోవడానికి బదులుగా పుంఖానుపుంఖాలుగా అసత్యాలు ప్రచారం చేసే ఒక బ్యాచ్ నేరుగా గాయాలు పాలయిన వారినే నేరగాళ్లుగా చేసేందుకు సిద్ధపడినా ఆశ్చర్యం లేదు. అందుకే ఇంతటి అరాచకపోకడల మీద స్పందించకపోతే రేపు ఎవరి మీదనయినా ప్రైవేటు గూండారాజ్ పెత్తనం చేసేందుకు బరి తెగిస్తుంది. పారాహుషార్…!