iDreamPost

పోలీసులకు లొంగిపోయిన జేసీ

పోలీసులకు లొంగిపోయిన జేసీ

టీడీపీ నేత అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు అనంతపురం రూరల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత నెల 18 న చంద్రబాబు అనంతపురం పర్యటన సందర్భంగా మేము అధికారంలోకి వచ్చాక మా బూట్లు నాకే పోలీసులని తెచ్చుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యం లో అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టించాయి. దీనిపై స్పందించిన అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆయన వ్యాఖ్యలను ఖండించడం తో పాటు జెసి పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగింది. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో జేసీ దివాకర్ రెడ్డి పై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే అరెస్టు నుండి తప్పించుకోవడానికి కోర్ట్ ని ఆశ్రయించిన జేసీ కోర్ట్ నుండి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ని పొందారు. బెయిల్ నిబంధనల మేరకు ఈ కేసుకు సంబంధించి నెలకు రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యాలని కోర్ట్ జేసీ దివాకర్ రెడ్డి ని ఆదేశించింది. ఆ మేరకు జేసీ ఇవాళ అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి బెయిల్ కి సంభందించిన పత్రాలను సమర్పించారు.

Also Read : మీసం తిప్పడం నుండి.. బూట్లు తుడవడం వరకు..

గత నెల 18 న చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలను ఉద్దేశించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన జేసీ టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని చంద్రబాబు ముందే నోరు జారారు. ఎస్పీ, ఆ స్థాయి పైన అధికారులు గానీ, కింది స్థాయి అధికారులు గాని టీడీపీ నేతలను అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారి సంగతి చెబుతామని సభా వేదికనుంచే జేసీ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులిరువురు పోలీసులమీద నోరు పారేసుకోవడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు ఇలానే నోరు జారి సమస్యలు కొని తెచ్చుకోవడమే కాకుండా ప్రజలలో కూడా అభాసుపాలయ్యారు. జెసి కి మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుత హిందూపూర్ యంపీ గోరంట్ల మాధవ్ మధ్య గతంలో జరిగిన వివాదం కూడా ఈ కోవ లోనిదే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి