iDreamPost

భాదిత మహిళల అభ్యర్ధన – సి.యం జగన్ తక్షణ స్పందన

భాదిత మహిళల అభ్యర్ధన – సి.యం జగన్ తక్షణ స్పందన

Yఅయినవాళ్లకు ఆపదొస్తే అరగంట ఆలస్యం చేస్తానేమో కానీ, ఆడవాళ్లకు ఆపదొస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయను. ఇది ఓ సినిమాలో హీరో డైలాగ్‌. ఈ డైలాగ్‌ నిజ జీవితంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సరిగ్గా సూటవుతుంది. అన్నా మేము కష్టాల్లో ఉన్నామంటే.. వాటిని తీర్చేందుకు జగన్‌ వేగంగా చర్యలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మొన్నటికి మొన్న మహిళలపై అత్యాచారాల నిరోధానికి దేశంలోనే మొదటి సారిగా ఏపీ దిశ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. తాజాగా కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న వందలాది మంది మహిళలను కాపాడి తన మంచి మనసును చాటుకున్నారు.

అసలేం జరిగింది?

గత శుక్రవారం కువైట్‌ నుంచి ఆంద్రప్రదేశ్ కి చెందిన మహిళలు ఓ వాట్సప్‌ మెసేజ్‌ పంపించారు. ఉపాధి కోసం ఏజెంట్లు మాయలు నమ్మి పొట్ట చేతపట్టుకొని పరాయి దేశానికి వెళ్లిన వందలాది మహిళలను అరబ్‌ షేక్‌లకు అమ్మేస్తున్నారని, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు. కొంతమంది మహిళలు అక్కడి యజమానుల నుంచి తప్పించుకొని భారత ఎంబసీకి చేరుకున్నారు. వారి దగ్గర పాస్‌పోర్టులు కూడా లేవు. దీంతో అక్కడ ఎవరో వ్యక్తి ఫోన్‌ తీసుకొని ఓ వాట్సప్‌ మెసేజ్‌ను బంధువులకు పంపించారు.

వాట్సప్‌ మేసేజ్‌లో ఏముంది?

“జగనన్నా.. మాది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామం. ఇరగపురం మండలం పొదలాడకు చెందిన ఏజెంట్‌ లక్ష్మణరావు.. అక్కడి మహిళలకు మాయ మాటలు చెప్పి కువైట్‌ షేకులకు అమ్మేస్తున్నారు. మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మా పాస్‌పోర్టులు కూడా లాక్కున్నారు. ప్రస్తుతం మేం ఎంబసీలో ఉన్నాం. ఇక్కడి మాలాంటి వందలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతూ  ఉన్నారు. జగనన్నా మమ్మల్ని మేరే కాపాడాలి” అంటూ కారెం వసుంధర అనే మహిళ వాట్సప్‌లో మెసేజ్‌ పంపింది. ఆమెతో పాటు మరికొందరు కూడా తమ బాధను పంచుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గుత్తం శీను అనే ఏజెంట్‌ తమను మోసం చేశాడని, తాను కిడ్నీ వ్యాధితో బాధపతున్నప్పటికీ ఇంటికి వచ్చే దిక్కు లేకపోయిందని మరో మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే కొత్తపేట, నెల్లూరు జిల్లా వెంకటగిరి, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన పలువురు మహిళలు కూడా తమను కాపాడాలని కోరారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చేరింది.

Read Also : బానిసలుగా తెలుగు అమ్మాయిలు – రంగంలోకి దిగిన సిఎం జగన్

వేగంగా చర్యలు చేపట్టిన వైఎస్‌ జగన్‌..

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎంవో అధికారులు వేగంగా స్పందించారు. అక్కడి మహిళలను తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. కువైట్‌లోని ఏపీకి చెందిన పలువురు వెంటనే ఎంబసీకి చేరుకొని మహిళలకు భరోసానిచ్చారు. వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఇండియాకు వీలైనంత తొందరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మహిళల కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వేగంగా చర్యలు తీసుకొని మహిళలను కాపాడడంతో వారు ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ మరో వీడియో పెట్టారు. ఇంత తొందరగా స్పందించి, తమని పిల్లల దగ్గర పంపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి