iDreamPost

నిర్భయ దోషులకు రేపు ఉరి అమలు సాధ్యమేనా?

నిర్భయ దోషులకు రేపు ఉరి అమలు సాధ్యమేనా?

నిర్భయ దోషులకు 20న ఉరి తీయాలని ఉరి శిక్ష ఖరారు చేస్తూ పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పుకు మరొక్కరోజు గడువు మాత్రమే ఉంది. ఇప్పటికే ఉరి శిక్ష అమలుకు కావాల్సిన ఏర్పాట్లను తీహార్ జైల్లో అధికారులు పూర్తి చేశారు. ఉరిశిక్ష అమలు చేయాల్సిన తలారిని కూడా నాలుగు రోజులు ముందుగానే తీహార్ జైలుకు చేరుకోవాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో తీహార్ జైలుకు తలారి చేరుకున్నాడు.

కానీ శిక్షను ఎలాగైనా వాయిదా వేయించాలని నిందితులు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం గడప కూడా తొక్కారు. నిందితుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా సుప్రీం కోర్టులో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌నని, దిగువ కోర్టులు ఈ వాస్తవాన్ని విస్మరించాయని తన పిటిషన్‌లో పవన్‌ పేర్కొన్నారు. నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ను కావడంతో తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు మార్చాలని పవన్ కుమార్ గుప్తా కోరాడు.

కాగా పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో నిందితులకు రేపు శిక్ష అమలు చేయడంలో ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం లేదని పలువురు న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు నిర్భయ నిందితులకు వాయిదా పడిన విషయం తెలిసిందే. పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్న కారణంగా నిర్భయ నిందితులకు ఉరిశిక్ష విధించడం సాధ్యంకాలేదు.

నిందితులకు లభించిన న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో పటియాలా కోర్టు మార్చ్ 20 ఉదయం 5.30 కి ఉరి తీయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది. దీంతో నిర్భయకు న్యాయం జరుగుతుందని నిందితులకు ఉరి శిక్ష అమలు ఖాయమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి