iDreamPost

భూకుంభకోణంపై విచారణ – టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు

భూకుంభకోణంపై విచారణ – టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడింగ్‌ ట్రేడింగ్‌పై దర్యాప్తు చేయించాలని సీఎం జగన్‌ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ రోజు శుక్రవారం తీర్మానించిన విషయం తెలిసిందే. న్యాయ నిపుణల సలహా మేరకు ఏ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలన్నది నిర్ణయించనున్నారు. జాతీయ స్థాయిలోని సీబీఐ, లేదా రాష్ట్రపరిధిలోని సీబీ సీఐడీ.. ఇలా ఏ సంస్థ అనేది న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సంబంధించిన నిర్ణయం తీసుకోనుంది.

రాజధాని అమరావతిలో జరిగిన భూముల కుంభకోణంపై ఇటీవల జరిగిన అసెంబ్లీలో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇన్‌సైడింగ్‌ ట్రేడింగ్‌ జరిగిందని అధికార పార్టీ ఆరోపించగా, అలాంటిది ఏమీలేదని అప్పటి ప్రతిపక్ష టీడీపీ సభ్యులు వాదించారు. ప్రాధమిక సమాచారం మేరకే దాదాపు 4070 ఎకరాల కుంభకోణం జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రకటించారు.

రాజధానిగా అమరావతిని ప్రకటించిన 2014 డిసెంబర్‌ 31 ముందే అప్పటి అధికార పార్టీ టీడీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులు, బినామీలు, తమ వద్ద పని చేసే వారి పేరుతో అమరావతి చుట్టు పక్కల గ్రామాల్లో భూములు కోనుగోలు చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఇందులో మాజీ మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌ బాబు, పి. నారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజా చౌదరి, మాజీ ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, ధూళ్లిపాల నరేంద్ర తదితరులు ఉన్నారు.

అసెంబ్లీ ముగిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు తాము తప్పు చేసి ఉంటే విచారణ చేయించుకుని, చర్యలు తీసుకోవచ్చని సవాళ్లు విసిరారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ విచారణ జరిపాలని డిమాండ్‌చేశారు. అంతేకానీ ఈ సాకుతో రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని డిమాండ్‌ చేశారు.

ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై టీడీపీ నేతలు చేసిన సవాళ్లతో ఒక విధంగా అధికార వైఎస్సార్‌సీపీ ఇరకాటంలో పడినట్లైంది. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు నిరూపించకపోతే తప్పు తమ వైపు ఉంటుదని భావించిన అధికార పార్టీ ఈ కుంభకోణంలో అసలు నిజాలు ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తాజా మంత్రి వర్గ నిర్ణయంలో రాజధానిలో జరిగిన భూ కుంభకోణంపై విచారణకు నిర్ణయించింది.

మంత్రివర్గ సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతల్లో ఒణుకు మొదలైంది. 2014 డిసెంబర్‌కు ముందు భూములు కొన్న వారి వివరాలు, తేదీలు, రిజిస్ట్రేషన్‌ జరిగిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎవరి పేరుపై చేయించారన్న వివరాలు అన్నీ విచారణలో తేలుతాయని చెప్పి టీడీపీ నేతల్లో ఒణుకుపుట్టించారు. మంత్రి మాటలు నేరుగా విన్న వారికి ఆయన మాటల్లో వాస్తవం కనిపించింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చేటుచేసుకుంటాయోన్న ఆసక్తి అందిరిలోనూ నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి