iDreamPost
android-app
ios-app

పనిమనిషిగా జీవితం ప్రారంభించి.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి.. చివరకు అనాథగా!

  • Published Jul 18, 2023 | 2:39 PM Updated Updated Jul 18, 2023 | 2:39 PM
  • Published Jul 18, 2023 | 2:39 PMUpdated Jul 18, 2023 | 2:39 PM
పనిమనిషిగా జీవితం ప్రారంభించి.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి.. చివరకు అనాథగా!

సినిమా అనేది ఓ రంగుల లోకం. ఇక్కడ స్టార్‌డమ్‌ రావడనానికి ఎంత కష్టపడాలో.. దాన్ని నిలుపుకోవడానికి అంతకు మించి శ్రమించాలి. కెరీర్‌ను చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. లేదంటే.. పాతాళానికి పడిపోవడానికి ఒక్క క్షణం చాలు. సినీతార లోకంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించికున్నప్పటికి.. కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఉజ్వలంగా వెలిగిపోతున్న కెరీర్‌ను, జీవితాన్ని నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. మన దగ్గర మహానటి సావిత్రి జీవితం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి సావిత్రిలు ఎందరో ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఓ సీనియర్‌ నటి గురించే మనం తెలుసుకుందాం. పనిమనిషిగా జీవితం ప్రారంభించిన ఆమె స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. హీరోలకు ధీటుగా అప్పట్లోనే ఒక్క సినిమాకు లక్షల్లో పారితోషికం తీసుకోవడమే కాక.. వారితో సమానంగా గౌరవ మర్యాదలు పొందింది. మరి చివరకు.. నా అనేవాళ్లు పక్కన లేకుండా అనాథగా తన జీవితాన్ని ముగించింది. ఇంతకు ఆ నటి ఎవరంటే..

కానన్‌ దేవి.. ఈతరం వారికే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా తెలియదు. ఎందుకంటే ఆమె బెంగాలీ నటి. తొలి తరం నటి, సింగర్‌గా బెంగాలీ తెర మీద వెలిగిపోయింది. పురుషాధిక్యం రాజ్యమేలుతున్న రోజుల్లోనే ఆమె వెండి తెర మీద ఓ ధ్రువ తారలా వెలిగిపోయింది. హీరోయిన్‌గా ఒక్క సినిమాకు అప్పట్లోనే 5 లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకుంది. కానీ చివరకు అనాథలా జీవితం ముగిసిపోయింది. రెండు సార్లు వివాహం చేసుకుంది.. కానీ అవి ఆమెకు చేదు జ్ఞాపకాలే మిగిల్చాయి. కానన్‌ దేవి పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో 1916, ఏప్రిల్‌ 22న ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి రతన్‌ చంద్రదాస్‌ ఆమెకు బాల్యం నుంచే సంగీతంలో శిక్షణ ఇచ్చేవాడు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న కానన్‌ జీవితం.. తండ్రి మరణంతో తిరగబడింది. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి.

రూ.5 నుంచి 5 లక్షలు తీసుకునే స్టేజ్‌కి..

ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో.. యాజమాని వారిని బయటకు గెంటేశాడు. ఈ క్రమంలో ఏడేళ్ల వయసులో తల్లితో కలిసి ఓ ధనవంతుల ఇంట్లో పనిమనిషాగా చేరింది కానన్‌. ఆ యజమాని ఆమె చేత గొడ్డు చాకిరీ చేయించుకోవడమే కాక.. అసభ్యంగా కూడా ప్రవర్తించేవాడు. అతడి ఆగడాలు భరించలేక.. ఆ ఇంటి నుంచి వెళ్లిపోయింది కానన్‌. ఎక్కడికి వెళ్లాలో తెలియని సమయంలో.. హౌరాలోని వేశ్యా గృహాలకు సమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో కానన్‌ కుటుంబానికి స్నేహితుడైన ఓ వ్యక్తి.. ఆమెను చూసి.. తను సినిమాల్లో రాణించగలదని గుర్తించాడు. పదేళ్ల వయసులో తొలి సారి జైదేవ్‌ చిత్రంలో తెర మీద కనిపించింది కానన్‌. అప్పుడు ఆమె అందుకున్న తొలి పారితోషికం 5 రూపాయలు. ఆ తర్వాత పలు చిత్రాల్లో బాల నటిగా చేసింది. సింగర్‌గాను సత్తా చాటింది.

ఇండస్ట్రీతో ఏర్పడిన పరిచయం కారణంగా 21 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా మారింది కానన్‌. ఆమె అందానికిక, నటనకు బెంగాల్‌ ప్రజలు దాసోహం అయ్యారు. దాంతో అనతి కాలంలో సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. పాట పాడితే రూ.లక్ష, హీరోయిన్‌గా చేసే ఒక్కో సినిమాకు రూ. 5 లక్షల వరకు పారితోషికం అందుకునేది. తన కెరీర్‌లో కానన్‌ మొత్తం 40 పాటలు పాడగా.. 57 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ కాలంలోనే అందరు ఆమెను మేడమ్‌ అని గౌరవంగా పిలిచేవారు. అనతి కాలంలోనే కోటీశ్వరురాలిగా ఎదిగింది.

కలిసిరాని రెండు పెళ్లిళ్లు..

వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలు అధిరోహించిన కానన్‌.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా వైవాహిక జీవితం ఆమెకు కలిసిరాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. 2 సార్లు చేదు అనుభవాలే మిగిలాయి. కానన్‌ తొలిసారి 1940 డిసెంబర్‌లో బ్రహ్మ సమాజ సభ్యులు హిరంబ చంద్ర మిత్ర కుమారుడు అశోక్‌ మిత్రాను వివాహం చేసుకుంది. కానీపెళ్లైన ఐదేళ్లకే అతడికి విడాకులిచ్చింది. 1949లో బెంగాల్‌ గవర్నర్‌ దగ్గర ఏడీసీగా పని చేసిన హరిదాస్‌ భట్టాచార్జితో మరోసారి పెళ్లిపీటలెక్కింది. కానన్‌ను వివాహం చేసుకున్న హరిదాస్‌ దర్శకుడిగా తన లక్‌ పరీక్షించుకున్నాడు. కానీ అందరూ అతడిని కానన్‌ భర్తగానే గుర్తించారు. అది జీర్ణించుకోలేకపోయిన అతడు 1987 ఏప్రిల్‌ 4న భార్య ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.

విడాకులు తీసుకోనప్పటికి.. ఆ క్షణం నుంచి వీరిద్దరూ విడివిడిగా జీవించారు. 1992 జూలై 17న కానన్‌ దేవి 76 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసింది. తనను చివరి చూపు చూసేందుకు కూడా హరిదాస్‌ రాకపోవడం గమనార్హం. ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆమె అనాథగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. కానన్‌ దేవి చిత్రపరిశ్రమకు అందించిన సేవలను గుర్తించిన తపాలా శాఖ 2011లో ఆమె పేరిట ఓ స్టాంపును విడుదల చేసింది.