iDreamPost

విజయ పరంపర కొనసాగుతుందా..?

విజయ పరంపర కొనసాగుతుందా..?

నూతన సంవత్సరంలో నేటి నుండి భారత క్రికెట్ జట్టు బలహీనమైన శ్రీలంక జట్టుతో మూదు T20 మ్యాచ్ ల సిరీస్ తో సొంతగడ్డపై మైదానంలో అడుగుపెట్టబోతోంది. ఈ అక్టోబర్ మాసం చివరలో ఆస్ట్రేలియాలో జరగనున్న T20 ప్రపంచ కప్పును దృష్టిలో పెట్టుకొని భారత్ మూదు ఫార్మెట్ లలో ఎక్కువగా T20 మ్యాచ్లను ఆడటానికి ప్రాధాన్యతను ఇస్తుంది. జనవరి మాసంలో స్వదేశంలో శ్రీలంక మరియు ఆస్ట్రేలియాలతో మ్యాచ్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ వెళ్లి ఆడనున్న ఐదు T20 మ్యాచ్ లతో కలిపి మొత్తం ఎనిమిది పొట్టి మ్యాచులు భారత్ నెలన్నర వ్యవధిలోనే ఆడబోతున్నది.

శ్రీలంక సిరీస్ లో గాయంతో మూడు నెలలుగా ఆటకు దూరమై తిరిగి జట్టులో చేరిన టీమిండియా ఫ్రంట్ లైన్ ఫేస్ బౌలర్ బుమ్రా పునరాగమనం చేస్తున్నాడు.గతంలో లాగా తన పదునైన యార్కర్ లతో లంకేయ బ్యాట్స్ మెన్ లను బెంబేలెత్తించే అవకాశముంది. గాయంతో ఈ సిరీస్ కు దూరమైన భువనేశ్వర్ స్థానంలో జట్టులో స్థానం సంపాదించిన యువ బౌలర్లు నవదీప్ సైని,శార్దూల్ ఠాకూర్ రాణించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి శ్రీలంకతో జరుగుతున్న T20 సిరీస్ వీరిద్దరికీ సువర్ణావకాశం. పాండ్యా గాయంతో జట్టులో చేరిన కొత్త ఆల్ రౌండర్ శివం దూబేకు రాణించి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ సిరీస్ మంచి అవకాశం.

రోహిత్ శర్మకు విశ్రాంతిని ఇచ్చిన కారణంగా గాయంతో కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్,తన స్థానంలో జట్టులో చేరి కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న కె.ఎల్.రాహుల్ తో కలిసి ఈ మ్యాచ్లో ఓపెనింగ్ చేయబోతున్నాడు.రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తే ధావన్,రాహుల్ లలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉండటంతో ఈ సిరీస్ లో ఎవరు రాణించి తన స్థానాన్ని పదిలం చేసుకుంటారనేది ఆసక్తికరం.

ముగిసిన సంవత్సరమంతా బ్యాటింగ్ లో నాలుగో స్థానం ఆడే సరైన ఆటగాడి కోసం కొనసాగిన ప్రయోగాలు చివరకు ఫలించి,కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో నిలకడగా రాణించడం శుభపరిణామం.ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు రిషబ్ పంత్ కూడా తన స్థాయికి తగిన విధంగా బ్యాటింగ్ మరియు కీపింగ్ లో రాణించి ఎంఎస్ ధోని స్థానాన్ని భర్తీ చేస్తే నూతన సంవత్సరంలో భారత విజయ పరంపర కొనసాగుతుందని ఆశించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి