iDreamPost
android-app
ios-app

తెలంగాణకు నేడు భారీ వర్షాలు.. ఏపీలో కూడా ఇదే పరిస్థితి!

  • Published Aug 01, 2023 | 8:32 AM Updated Updated Aug 01, 2023 | 8:32 AM
  • Published Aug 01, 2023 | 8:32 AMUpdated Aug 01, 2023 | 8:32 AM
తెలంగాణకు నేడు భారీ వర్షాలు.. ఏపీలో కూడా ఇదే పరిస్థితి!

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వదలడం లేదు. ప్రతి రోజు ఏదో ఒక సమయంలో వానలు దంచి కొడుతున్నాయి. పైగా మరో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణశాఖ అంచాన వేస్తోంది. ఇక సోమవారం సాయంత్రం.. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో.. పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నేడు కూడా నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ సూచించింది.

ఏపీలో కూడా వానలే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా కదులుతోన్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది. ముందుగా ఇది ఏపీవైపు వస్తున్నట్లు కనిపించినా.. ఆ తర్వాత మయన్మార్ వైపు తరలి వెళ్లింది. ప్రస్తుతం ఒడిశాకు దగ్గర్లో విస్తరిస్తోంది. దీని ప్రభావం ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణ వరకూ ఉందని వాతావరణ శాఖ అంచాన వేస్తోంది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారి.. కోల్‌కతా వైపు వెళ్లొచ్చని భావిస్తోంది. అల్ప పీడనం ప్రభావంగా నేడు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం రాయలసీమలో అంతగా కనిపించదని తెలిపారు.

గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వరదలు వచ్చాయి. తెలంగాణలో మోరంచపల్లి గ్రామంలో వరద కారణంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఏపీలోని పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక వరద బాధితులను ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. ఏపీలో కూడా వరద బాధితులుకు నిత్యావసరల పంపిణీతో పాటు.. ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు సీఎం జగన్‌.